సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్ వేళ ఆహారభద్రత (రేషన్) కార్డులు లేని నిరుపేదలు ఉచిత బియ్యం కోసం వేచిచూస్తున్నారు. కార్డు లేకున్నా నిరుపేదలయితే ఉచిత బియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో లక్షలాది మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల నిరుపేదలందరికీ బియ్యం అందడం లేదు. ముందుగా కార్డు వున్న వారికి పంపిణీపైనే దృష్టిపెట్టారు. వీరికి నెలకు కుటుంబంలోని మనిషికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ వేళ చాలా మంది నిరుపేదలు పనులు లేక..చేతిలో చిల్లిగవ్వ లేక పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. గత నెలలో కార్డులేని వారికి కేవలం ఐదు కిలోల బియ్యం ఇచ్చారు. అదికూడా కొన్ని కుటుంబాలకే పరిమితం చేశారు.
కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల్లో దరఖాస్తులు
దారిద్య్రరేఖకు దిగువనున్న దాదాపు లక్షన్నర నిరుపేద కుటుంబాలు కొత్తగా రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. కానీ వీటికి మోక్షం లభించలేదు. దరఖాస్తుదారులంతా చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు. గతంలోనే కార్డు వచ్చి ఉంటే కరోనా కష్టకాలంలో తమకు ఎంతో ఆసరాగా ఉండేదని వారు వాపోతున్నారు.
మీ సేవ ద్వారా ఆహార భద్రత కార్డు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా కొత్త కార్డులు, రద్దైన కార్డుల పునరుద్ధరణ, కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు భారీగా దరఖాస్తులు వచ్చినా, చాలా వరకు పరిష్కారం దొరకలేదు. వాస్తవంగా పౌరసరఫరాల శాఖకు ఆన్‌లైన్‌లో చేరిన దరఖాస్తుల్లో కొన్ని క్షేత్ర స్థాయి పరిశీలనలోనే నిలిచిపోగా, మరికొన్ని మంజూరు కాకుండా ఆగాయి. పౌరసరఫరాల శాఖ గతేడాది జూన్, జూలైలో పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్‌కు ప్రత్యేక బృందాలను నియమించి ఏడు రోజుల్లో కార్డులు జారీ చేయాలని ఆదేశించినా ఆ ప్రక్రియ మాత్రం కాగితాలకు పరిమితమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆహారభద్రత కార్డులకు సంబంధించిన సుమారు 1.65 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా హైదరాబాద్‌లో 80 వేల దరఖాస్తులు, రంగారెడ్డి పరిధిలో 60 వేలు, మేడ్చల్ పరిధిలో 25 వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. ఏది ఏమైనా ప్రభుత్వం స్పందించి లాక్‌డౌన్ నేపథ్యంలో...కార్డులు లేని వారికి సైతం రేషన్ బియ్యం ఇవ్వాలని, రూ.1500 నగదు అందించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment