సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్ పోస్టాఫీస్ వద్ద నగదు కోసం బారులు తీరిన మహిళలు
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంక్ అకౌంట్ లేని ఆహార భద్రత కార్డుదారులకు పోస్టాఫీసుల ద్వారా ప్రభుత్వ చేయూత రూ.1500లు పంపిణీ తాత్కాలికంగా నిలిచిపోయింది. పోస్టల్ శాఖ బీఎస్‌ఎన్‌ఎల్ లైన్ డిస్ కనెక్షన్ కావడంతో టీఎస్ ఆన్‌లైన్ సర్వర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో శుక్రవారం ఆహార భద్రత కార్డుదారులకు నగదు పంపిణీని నిలిపివేస్తున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది. టీఎస్ ఆన్‌లైన్ సర్వర్‌తో బీఎస్‌ఎన్‌ఎల్ లైన్ పునరుద్ధరణ అనంతరం తిరిగి చెల్లింపులు ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, లబ్ధిదారులైన నిరుపేదలు సమాచారం తెలియక పోస్టాఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టి నిరాశకు గురయ్యారు.
నిరాశకు గురైన నిరు పేదలు
లాక్‌డౌన్ నేపథ్యంలో ఆహార భద్రత కార్డులు కలిగిన పేద కుటుంబాలకు గత నెల ఏప్రిల్‌లో ఉచిత బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం.. నిత్యావసర సరుకుల కోసం వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.1500ల నగదు జమ చేసిన విషయం తెలిసిందే. బ్యాంక్ అకౌంట్‌లేని వారిని సైతం గుర్తించి వారి నగదు పోస్టాఫీసుల్లో జమ చేసి రేషన్ కార్డు నంబర్ ఆధారంగా డబ్బు చెల్లించాలని ఆదేశించింది. దీంతో పోస్టల్ శాఖ నగరంలోని జనరల్ పోస్టాఫీసు(జీపీవో)తో కలిపి సుమారు 24 పోస్టాఫీసుల ద్వారా నగదు పంపిణీ చేస్తోంది. నిరుపేదలు పోస్టాఫీసుల ద్వారా నగదు తీసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వారం రోజుల నుంచి మండుటెండల్లో పోస్టాఫీసుల ముందు నగదు కోసం గంటల కొద్దీ కిలోమీటర్ల పొడవునా బారులు తీరుతున్నారు. కాగా శుక్రవారం సాంకేతిక సమస్య కారణంగా పోస్టాఫీసుల ద్వారా నగదు పంపిణీని నిలిపివేయడంతో ప్రజలు నిరాశకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment