సాక్షి, సిటీబ్యూరో: మీరు ఆహారభద్రత కార్డుదారులా..? లాక్ డౌన్ నేపథ్యంలో ఉచిత బియ్యం కోటా డ్రా చేసినా..నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వ సహాయం రూ.1500 నగదు మీ బ్యాంక్ ఖాతాలో జమ జరుగలేదా..? మీ కార్డులోని హెడ్ ఆఫ్ ఫ్యామిలీ(మహిళ) ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమై ఉన్నా... నగదు జమ కాలేదా? రెండు మూడు బ్యాంక్ ఖాతాలుంటే నగదు ఏ ఖాతాలో జరిగిందో తెలియదా? ..పరేషాన్‌కావల్సిన పనిలేదు. ఆహార భద్రత కార్డుదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక ల్యాండ్‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ల్యాండ్ ఫోన్ 040–23324614, 23324615 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1967లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఆయా నెంబర్లకు ఫోన్ చేసి మీ ఆహార భద్రత కార్డు కొత్త నంబర్ చెబితే సరిపోతుంది. మీ నగదు బ్యాంక్ ద్వారా లేదా పోస్టాఫీస్‌లో జమ అయిందా..? కాలేదా ? ఆన్‌లైన్‌లో పరిశీలించి తెలియజేస్తారు. బ్యాంక్‌లో జమ జరిగితే కుటుంబంలోని ఎవరి ఖాతాలో, ఎ బ్యాంక్‌లో జమ జరిగిందో వివరిస్తారు. బ్యాంక్‌లో పెండింగ్ ఉంటే దానికి గల స్టేటస్ తెలియజేస్తారు. బ్యాంక్ ఖాతా లేకుంటే పోస్టల్ ద్వారా నగదు జమ అయింది లేనిది కూడా తెలియ జేస్తారు. ఒక వేళ బ్యాంక్‌తో పాటు పోస్టాఫీసుల్లో కూడా నగదు జమ కాకుంటే ఎందుకు జమ కాలేదో స్టేటస్ వివరిస్తారు.
పోస్టాఫీసులో నగదు పంపిణీ ఇలా...
బ్యాంకు ఎకౌంట్ లేని వారు సమీప పోస్టాఫీసుకు వెళ్లి ఆహార భద్రత (రేషన్) కార్డు చూపించినా.. లేదా రేషన్ కార్డు కొత్త నెంబర్ మౌఖింగా తెలియజేసినా చాలు. పోస్టల్ శాఖ సిబ్బంది వెంటనే బయోమెట్రిక్ (వేలిముద్ర) తీసుకొని రూ.1500 నగదు అందజేస్తారు. అయితే ఆహార భద్రత నిబంధన ప్రకారం కార్డు లోని హెడ్ ఆఫ్ ఫ్యామిలీ (కుటుంబ పెద్ద) మహిళ మాత్రమే నగదు తీసుకునే వెసులుబాటు కల్పించారు. గురువారం హైదారబాద్ అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీసు(జీపీవో)లో చీఫ్ పోస్ట్ మాస్టర్ జయరాజ్ బ్యాంక్ అకౌంట్ లేని ఆహార భద్రత కార్డుదారులకు నగదు అందించే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రం మొత్తం మీద 5,21,641 కార్డుదారులకు బ్యాంక్ అకౌంట్ లేదని గుర్తించారు. అందులో హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు1.62 లక్షల కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద బ్యాంక్ అకౌంట్ లేని వారి కోసం సుమారు రూ.78,24, 55,500 నగదును ప్రభుత్వం తపాలాశాఖæ ఖాతాలో జమ చేసింది.
బ్యాంక్ అకౌంట్ లేని పేదలకే అవకాశం
బ్యాంక్ అకౌంట్ లేని వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా నగదు అందజేస్తామని చీఫ్ పోస్టుమాస్టర్ జయరాజ్ తెలిపారు. బ్యాంక్ అకౌంట్ ఉండి ఇన్ అక్టివ్‌లో ఉంటే వారి నగదు బ్యాంక్ ఖాతాల్లోనే జమ అయిందని చెప్పారు. ఎలాంటి బ్యాంక్ అకౌంట్ తెరువని వారు మాత్రమే సమీప పోస్టాఫీసు ద్వారా నగదు పొందవచ్చని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment