![Own a TV or fridge surrender BPL card In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/15/9aaf47b6-4042-4110-b5cb-d46516b241ef.jpg.webp?itok=z01KVk3Z)
సాక్షి, బెంగళూరు : రేషన్ కార్డుల పంపిణిపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సొంతగా టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్ కార్డును నిరాకరించాలని నిర్ణయించింది. బీపీఎల్ కార్డుల మంజూరు విషయంలో ఇకపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించదని ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖమంత్రి ఉమేష్ కత్తి స్పష్టం చేశారు.
సోమవారం బెళగావిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ సరుకులను ఉపయోగించుకున్నారని, దీని ద్వారా వెనుకబడిన వారికి సరుకులు చేరడంలేదని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునే ఉద్ధేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరఫరా చేస్తోందని, ఇకపై సరైన అర్హుల జాబితాను రూపొందిస్తామని స్పష్టం చేశారు.
1.20 లక్షల వార్షిక ఆదాయం కంటే ఎక్కువ ఉన్నవారు ఉచిత రేషన్‌కు అనర్హులన్నారు. అలాగే టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్ కార్డును వెంటనే వదులుకోవాలన్నారు. మార్చి 31 వరకు కార్డును వెనక్కి ఇచ్చేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉమేష్ కత్తి హెచ్చరించారు. ప్రభుత్వ ప్రతిపాదనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీవీ, ఫ్రిజ్ అనేవి నేడు నిత్యవసర వస్తుల జాబితాలో చేరిపోయాయని, వాటి కారణం చేత కార్డులను తొలగించడం సరైనది కాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment