హైదరాబాద్: ఆరు గ్యారంటీల పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. ప్రజాపాలనలో భాగంగా పదిరోజులుగా అర్జీలను తీసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో 150 వార్డుల్లోని 600 ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆరు గ్యారంటీ పథకాలతోపాటు ఇతరత్రా పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. శుక్రవారం నాటికి 21,52,178 దరఖాస్తులు అందాయి. వీటిలో 4,53,100 వరకు కొత్త రేషన్ కార్డు, ఇతరత్రా అర్జీలు ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం దరఖాస్తుల్లో 30 శాతం హైదరాబాద్ పాత బస్తీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. కంటోన్మెంట్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అత్యల్పంగా నమోదయ్యాయి. తొలి రెండు రోజులు దరఖాస్తుల తాకిడి అధికంగా కనిపించి క్రమంగా తగ్గుముఖం పట్టింది.
గ్రేటర్‌లో 40 లక్షలపైగానే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 40 లక్షలకుపైనే కుటుంబాలు ఉన్నట్లు పలు సర్వే సంస్థల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో ఆదాయ వర్గాలకు సంబంధించిన 10 లక్షలు మినహా మిగిలిన 30 లక్షల కుటుంబాలు పేద, మధ్యతరగతి వర్గాలే. సంపన్న వర్గాలు మినహా మిగతా కుటుంబాలకు ఆరు గ్యారంటీల పథకాల్లో మహాలక్షి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2,500, రూ. 500 వంట గ్యాస్ రాయితీ, గృహలక్ష్మి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవంగా మహా నగర పరిధిలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు 17.21 లక్షల వరకు ఉన్నాయి. మరో పది లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. మిగిలిన 2.79 కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఇప్పటి వరకు దరఖాస్తులు సమర్పించిన వారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు సమాచారం. చివరి రోజు శనివారం భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మళ్లీ నాలుగు నెలల తర్వాతే..
ఈసారి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని కుటుంబాలు రెండోసారి జరిగే కార్యక్రమంలో అర్జీలు సమర్పించే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి నాలుగు నెలలకోసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో మరో నాలుగు నెలల తర్వాత రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనుంది. మొదటి విడత ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీల ప్రక్రియ తక్షణమే ప్రారంభం కానుంది. ఈ నెల 17వ తేదీ వరకు పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డాటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగనుంది. డాటా ఎంట్రీలో దరఖాస్తుదారుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్, తెల్లరేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment