![MLA Anantha Venkatarami Reddy Phone Call To Beneficiary - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/24/MLA-Anantha-Venkatarami-Red.jpg.webp?itok=RbYIl8-A)
స్పందన ఫిర్యాదులపై ఆరా తీస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం సెంట్రల్: ‘హలో అనురాధమ్మనా మాట్లాడేది. నేను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని మాట్లాడుతున్నా. రేషన్‌కార్డు కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నావు కదా కొత్త కార్డు వచ్చిందా.’ అంటూ స్వయంగా ఓ లబ్ధిదారుకు ఫోన్ చేసి ఎమ్మెల్యే ఆరా తీయడం అందరినీ ఆశ్చర్యపరచింది. శనివారం నగరంలో రహమత్‌నగర్‌లోని 27వ సచివాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. స్పందన కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులను తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ లబ్ధిదారురాలికి నేరుగా ఫోన్ చేశారు. సమస్య పరిష్కారమయిందా లేదా అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారు మాట్లాడుతూ.. రేషన్‌కార్డు వచ్చిందని, పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నా రావడం లేదని తెలిపారు.
బాధ్యతగా సేవలందించండి
అనంతరం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. అర్హత ఉంటే వెంటనే పథకాలు అందించాలని ఆదేశించారు. ‘స్పందన’ ఫిర్యాదులను రికార్డుల్లో నమోదు చేసి.. పరిష్కారం అయిన వెంటనే పొందుపర్చాలని సూచించారు. దాదాపు 3 నెలలుగా ఫిర్యాదులు రికార్డుల్లో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులుగా నియమితులై రెండు సంవత్సరాలు పూర్తవుతోందని.. నేటికీ సరిగా విధులు నిర్వహించకపోవడమేంటని ప్రశ్నించారు. వచ్చామా.. పోయామా అంటే కుదరదని... ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ప్రతి ఇంటికీ వెళ్లాలని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను ఆదేశించారు.
ఒక సమస్యపై ప్రజలు తరుచూ తిరగకుండా, సమస్య పరిష్కారమయేంత వరకూ సచివాలయ ఉద్యోగులదే బాధ్యతని తెలియజేశారు. దీర్ఘకాలికంగా ప్రకాష్‌రోడ్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్న రైల్వే ట్రాక్ డ్రెయినేజీ సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు. ప్రకాష్‌రోడ్డు ప్రాంతానికి సంబంధించి సచివాలయం రహమత్‌నగర్‌లో ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కార్యాలయాన్ని మార్చాలని చెప్పారు. అర్హత ఉన్న అందరికీ పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న వయస్సుల్లోనే ఉద్యోగాల్లోకి వచ్చిన మీరు ప్రజలకు జవాబుదారిగా పనిచేయాలని సూచించారు. కోట్లాది రూపాయలను సచివాలయ వ్యవస్థపై సీఎం వెచ్చిస్తున్నారని, ఆయన నమ్మకానికి అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment