కార్డుల కొర్రీ.. వైద్యం వర్రీ | Private hospitals Create Problems In Aarogyasri | Sakshi
Sakshi News home page

కార్డుల కొర్రీ.. వైద్యం వర్రీ

Published Wed, Aug 14 2019 1:40 AM | Last Updated on Wed, Aug 14 2019 3:31 AM

Private hospitals Create Problems In Aarogyasri - Sakshi

హైదరాబాద్‌కు చెందిన సావిత్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవాలని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించింది. ఆమె వద్ద తెల్ల రేషన్‌కార్డు ఉండటంతో దాని కింద వైద్యం పొందొచ్చని భావించింది. కానీ తెల్ల రేషన్‌కార్డుతోపాటు ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలని కార్పొరేట్‌ ఆసుపత్రి వర్గాలు చెప్పేశాయి.

సిద్దిపేట జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అతడికి ఆరోగ్యశ్రీ కార్డుంది. కానీ ఆహారభద్రత కార్డు లేకపోవడంతో కేవలం ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్యం చేయలేమని ఓ ప్రైవేటు ఆసుపత్రివర్గాలు చెప్పడంతో 3 లక్షలు పోసి వైద్యం చేయించుకున్నాడు. 

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నా.. కొన్ని ఆసుపత్రుల తీరుతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ, ఆహార భద్రత కార్డుల్లో ఏదో ఒక కార్డు ఉన్నప్పటికీ ఉచిత వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవాలంటే అటు ఆరోగ్యశ్రీ కార్డుతోపాటు ఇటు ఆహార భద్రత కార్డు లేదా తెల్ల రేషన్‌ కార్డు తప్పనిసరి అని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో ఉచిత వైద్యం చేయించుకోవాలనే పేదలకు ఆరోగ్యశ్రీ అక్కరకు రాకుండా పోతోంది. ఈ విషయంపై ఆరోగ్యశ్రీ ట్రస్టుకు కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. అయితే ఆరోగ్యశ్రీ కార్డులున్న కుటుంబాలు, ఆహార భద్రత కార్డులున్న కుటుంబాలను ఒకసారి  పరిశీలించి ఉమ్మడిగా మరో కార్డు ఇవ్వాలని గతంలో ట్రస్టు భావించినట్టు తెలిసింది. కానీ తర్వాత ఆ ఆలోచనను ఉపసంహరిం చుకుంది. అయినా ప్రైవేటు ఆస్పత్రులు 2 కార్డులూ ఉండాల్సిందేనని కొర్రీలు పెడుతున్నాయి. ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లకు పైగా బకాయి పడినందున ఈ నెల 16 నుంచి సమ్మెకు వెళ్లాలని నెట్‌వర్క్‌ ఆసుపత్రులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలోనే ఆసుపత్రులు 2 కార్డులు కావాలని కొర్రీలు పెడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఉచితానికి లక్షలాది మంది దూరం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఆ పథకం ఇప్పటివరకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగింది. ప్రస్తుతం తెలంగాణలో 330 నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.800 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 77.19 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉండగా.. 87.89 లక్షల కుటుంబాలకు ఆహార భద్రత కార్డులున్నాయి. అంటే 10.70 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నప్పటికీ, ఆహార భద్రత కార్డులు లేవు. ప్రైవేటు ఆస్పత్రుల తీరుతో ఇలాంటి వారికి ఇబ్బందులు తప్పడంలేదు. పౌరసరఫరాల లెక్కల ప్రకారం ఒక్కో కుటుంబం కింద సరాసరి 3.20 మంది సభ్యులున్నారు. అంటే ఆహార భద్రత కార్డులు లేని కారణంగా దాదాపు 34 లక్షల మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వైద్య సేవలు అందడంలేదు. అయితే, ఏ ఒక్క కార్డు ఉన్నా వైద్యం చేయడానికి అంగీకరించాలని తాము స్పష్టంచేసినట్టు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రెండు కార్డులకూ లింక్‌ పెట్టాలని అనుకున్నా.. తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నామని తెలిపాయి.

సీఎం కార్యాలయ లెటరే దిక్కు... 
ఆరోగ్యశ్రీ, ఆహార భద్రత కార్డుల్లో ఏదో ఒకటి మాత్రమే ఉన్న పేదలకు ఉచిత వైద్యం అందాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేకంగా లేఖలు తీసుకోవాల్సిందే. ఈ లేఖలు ఇవ్వడం కోసం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఒక కౌంటర్‌ కూడా ఏర్పాటు చేశారు. తొలుత ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవాలనే పేదలు తమ వద్దనున్న కార్డును ఆసుపత్రికి చూపించాలి. ఆసుపత్రి వర్గాలు రోగం, అందుకయ్యే వ్యయం వివరాలతో కూడిన లెటర్‌ ఇస్తాయి. ఆ లేఖను తీసుకెళ్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో ఇవ్వాలి. వారు దాన్ని పరిశీలించిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద వైద్యానికి అనుమతి ఇస్తున్నారు. ఇదంతా పెద్ద ప్రహసనంగా ఉండటంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి ఆయా ఆస్పత్రులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని పలువురు కోరుతున్నారు.

330 : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న నెట్‌వర్క్‌ ఆసుపత్రులు 
77 : ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న కుటుంబాలు 
88 : ఆహార భద్రత కార్డులున్న కుటుంబాలు  
11 : ఆరోగ్యశ్రీ కార్డున్నాఆహార భద్రత కార్డు లేని కుటుంబాలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement