సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో ప్రజా పంపిణీ వ్యవస్థపై పర్యవేక్షణ కొరవడింది. పేదల బియ్యం పక్కదారిపడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రజా పంపిణీ సరుకుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక యంత్రాంగం పని చేస్తున్నా ఫలితం లేదు. అడప దడప జరుగుతున్న స్పెషల్ ఆపరేషన్ టీం, టాస్క్ ఫోర్స్ పోలీస్, విజిలెన్స్ దాడుల్లో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం బయటపడుతోంది. క్వింటాళ్ల కొద్ది బియ్యం పట్టుబడుతున్నా సంబంధిత పౌర సరఫరాల శాఖ అధికారుల్లో మాత్రం చలనం లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవంగా మూడేళ్లుగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ఈ పాస్ (వేలిముద్ర) విధానంలో సరుకులు పంపిణీ చేస్తున్నా డీలర్లు చేతివాటానికి మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. పీడీఎస్ బియ్యం అవసరం లేని లబ్ధిదారులకు నగదు అంటగట్టి వారి కోటా బియ్యాన్ని నల్ల బజారుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారులు కూడా బియ్యానికి బదులు నగదు పుచ్చుకుంటున్నారు. లబ్ధిదారులకు కిలో ఒక్కంటికి రూ. 11 చొప్పున లెక్క కట్టి బియ్యం ధర ఒక రూపాయి మినహాయించి రూ.10 చొప్పున నగదు ఇస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు సగటున నెలకు రూ.300 నుంచి రూ.400 వరకు ముడుతున్నాయి. రేషన్ బియ్యంపై లబ్ధిదారుల అనాసక్తి డీలర్లకు కాసులు కురిపిస్తోంది. దీంతో గుట్టు చప్పుడుగా క్వింటాళ్లకొద్ది బియ్యాన్ని సేకరించి సరిహద్దులు దాటిస్తున్నారు.
మధ్యతరగతికి కార్డులు..
నగరంలో నివాసం ఉంటున్న మధ్యతరగతి కుటుంబాల్లో సగానికి పైగా ఆహారభద్రత (రేషన్)కార్డులు కలిగి ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగిలిన కుటుంబాలకు కార్డులు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం పథకాల నుంచి లబ్ధి పొందేందుకు, గుర్తింపు చిరునామాల కోసం దాదాపు 60 శాతం మధ్య తరగతి కుటుంబాలు కార్డులు తీసుకున్నారు. అయితే రేషన్ బియ్యం నాసిరకంగా ఉండటంతో వాటిని వండుకొని తినేందుకు వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒక వేల కొనుగోలు చేసినా ఈ బియ్యాన్ని కేవలం అల్పహారాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఒక వేళ రేషన్ షాపునకు వెళ్లి ప్రతి నెల బియ్యం కోనుగోలు చేయకుంటే కార్డు రద్దు కావచ్చనే అనుమానంతో డీలర్ల సలహా మేరకు లబ్ధిదారులు ఈ బియ్యాన్ని వారికే ఇస్తూ నగదు పుచ్చుకుంటున్నారు. దీంతో మధ్య తరగతికి సంబంధించిన అత్యధిక శాతం కుటుంబాలు రేషన్ కార్డు ఇన్ యాక్టివ్ కాకుండా రేషన్ షాపునకు వచ్చి వేలి మద్ర వేసి నగదు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబంలోని సభ్యుడికి ఆరు కిలోల చొప్పున ఎంత మంది సభ్యులు ఉంటే అన్ని కిలో బియ్యం పంపిణీ జరుగుతుంది. ఉదాహారణకు ఒక కుటుంబంలో భార్యభర్తలు, ముగ్గురు పిల్లలు ఉంటే మొత్తం ఐదుగురికి కలిపి ప్రతి నెల 30 కిలోల బియ్యం కోటా పంపిణీ జరుగుతుంది. ఈ లెక్కన కిలో కు రూ. 10 చొప్పున రూ. 300 నగదు లబ్ధిదారులకు అందుతోంది. దీంతో లబ్ధిదారులు అవసరం ఉన్నప్పుడు మాత్రమే బియ్యాన్ని తీసుకెళ్లడం, మిగితా సమయంలో నగదు తీసుకొని జేబుల్లో వేసుకుంటున్నారు. రేషన్ కార్డు రద్దు కాకుండా ఉండటంతో పాటు ప్రతి నెల నగదు అందుతున్నందున వారు దానిపైనే అసక్తి చూపుతున్నట్లు సమాచారం. బియ్యం విషయంలో కార్డుదారులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించడం డీలర్లకు కలిసి వస్తోంది. ఇలా మిగిలిన బియ్యాన్ని డీలర్లు దళారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment