public service comission
-
ఏబీవీపీ TGPSC ముట్టడి విఫలం.. నాంపల్లిలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: ఏబీవీపీ ముట్టడి ప్రయత్నంతో నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక వాతావరణం నెలకొంది. గ్రూప్ ఉద్యోగాలు, డీఎస్సీ పోస్టుల డిమాండ్‌తో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు మంగళవారం ఉదయం టీజీపీఎస్సీ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. అయితే.. ఒక్కసారిగా వాళ్లు కమిషన్ భవనం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. పలువురు ఏబీవీపీ కార్యకర్తల్ని, విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100 పిలవాలని, గ్రూప్ 2 లో పోస్టులు పెంచి, డిసెంబర్ లో గ్రూప్ టు పరీక్షలు నిర్వహించాలని, టీచర్ పోస్టుల్ని పెంచి డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని టీజీపీఎస్సీని డిమాండ్ చేస్తోంది ఏబీవీపీ. -
పట్టించుకునే వారేరీ..?
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో ప్రజా పంపిణీ వ్యవస్థపై పర్యవేక్షణ కొరవడింది. పేదల బియ్యం పక్కదారిపడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రజా పంపిణీ సరుకుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక యంత్రాంగం పని చేస్తున్నా ఫలితం లేదు. అడప దడప జరుగుతున్న స్పెషల్ ఆపరేషన్ టీం, టాస్క్ ఫోర్స్ పోలీస్, విజిలెన్స్ దాడుల్లో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం బయటపడుతోంది. క్వింటాళ్ల కొద్ది బియ్యం పట్టుబడుతున్నా సంబంధిత పౌర సరఫరాల శాఖ అధికారుల్లో మాత్రం చలనం లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవంగా మూడేళ్లుగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ఈ పాస్ (వేలిముద్ర) విధానంలో సరుకులు పంపిణీ చేస్తున్నా డీలర్లు చేతివాటానికి మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. పీడీఎస్ బియ్యం అవసరం లేని లబ్ధిదారులకు నగదు అంటగట్టి వారి కోటా బియ్యాన్ని నల్ల బజారుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారులు కూడా బియ్యానికి బదులు నగదు పుచ్చుకుంటున్నారు. లబ్ధిదారులకు కిలో ఒక్కంటికి రూ. 11 చొప్పున లెక్క కట్టి బియ్యం ధర ఒక రూపాయి మినహాయించి రూ.10 చొప్పున నగదు ఇస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు సగటున నెలకు రూ.300 నుంచి రూ.400 వరకు ముడుతున్నాయి. రేషన్ బియ్యంపై లబ్ధిదారుల అనాసక్తి డీలర్లకు కాసులు కురిపిస్తోంది. దీంతో గుట్టు చప్పుడుగా క్వింటాళ్లకొద్ది బియ్యాన్ని సేకరించి సరిహద్దులు దాటిస్తున్నారు. మధ్యతరగతికి కార్డులు.. నగరంలో నివాసం ఉంటున్న మధ్యతరగతి కుటుంబాల్లో సగానికి పైగా ఆహారభద్రత (రేషన్)కార్డులు కలిగి ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగిలిన కుటుంబాలకు కార్డులు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం పథకాల నుంచి లబ్ధి పొందేందుకు, గుర్తింపు చిరునామాల కోసం దాదాపు 60 శాతం మధ్య తరగతి కుటుంబాలు కార్డులు తీసుకున్నారు. అయితే రేషన్ బియ్యం నాసిరకంగా ఉండటంతో వాటిని వండుకొని తినేందుకు వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒక వేల కొనుగోలు చేసినా ఈ బియ్యాన్ని కేవలం అల్పహారాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఒక వేళ రేషన్ షాపునకు వెళ్లి ప్రతి నెల బియ్యం కోనుగోలు చేయకుంటే కార్డు రద్దు కావచ్చనే అనుమానంతో డీలర్ల సలహా మేరకు లబ్ధిదారులు ఈ బియ్యాన్ని వారికే ఇస్తూ నగదు పుచ్చుకుంటున్నారు. దీంతో మధ్య తరగతికి సంబంధించిన అత్యధిక శాతం కుటుంబాలు రేషన్ కార్డు ఇన్ యాక్టివ్ కాకుండా రేషన్ షాపునకు వచ్చి వేలి మద్ర వేసి నగదు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబంలోని సభ్యుడికి ఆరు కిలోల చొప్పున ఎంత మంది సభ్యులు ఉంటే అన్ని కిలో బియ్యం పంపిణీ జరుగుతుంది. ఉదాహారణకు ఒక కుటుంబంలో భార్యభర్తలు, ముగ్గురు పిల్లలు ఉంటే మొత్తం ఐదుగురికి కలిపి ప్రతి నెల 30 కిలోల బియ్యం కోటా పంపిణీ జరుగుతుంది. ఈ లెక్కన కిలో కు రూ. 10 చొప్పున రూ. 300 నగదు లబ్ధిదారులకు అందుతోంది. దీంతో లబ్ధిదారులు అవసరం ఉన్నప్పుడు మాత్రమే బియ్యాన్ని తీసుకెళ్లడం, మిగితా సమయంలో నగదు తీసుకొని జేబుల్లో వేసుకుంటున్నారు. రేషన్ కార్డు రద్దు కాకుండా ఉండటంతో పాటు ప్రతి నెల నగదు అందుతున్నందున వారు దానిపైనే అసక్తి చూపుతున్నట్లు సమాచారం. బియ్యం విషయంలో కార్డుదారులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించడం డీలర్లకు కలిసి వస్తోంది. ఇలా మిగిలిన బియ్యాన్ని డీలర్లు దళారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
చదువుల తల్లి ముద్దుబిడ్డ
కాసుల తల్లి కటాక్షం లేకున్నా.. చదువుల తల్లి ముద్దుబిడ్డగా ఎదిగాడు. ఉన్నత విద్య అభ్యసనకు ఆర్థిక స్థోమత లేకున్నా.. చిన్నాచితక పనులు చేసుకుంటూ పీజీ వరకు చదువుకున్నాడు. బోధనా వృత్తిలో స్థిర పడాలనుకుని నిర్ణయించుకుని అందుకోసం అహర్నిశం శ్రమించాడు. డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్టిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ సాధించి విజయకేతనాన్ని ఎగురవేశాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులపై కొందరు నమ్మకం లేకుండా మాట్లాడుతున్న ప్రస్తుత రోజుల్లో అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని అనూహ్య స్థానాలకు ఎదిగిన మారుమూల గ్రామానికి చెందిన ఓ నిరుపేద విజయగాథ ఇది. వివరాల్లోకి వెళితే.. తనకల్లు: తనకల్లు మండలం ఎర్రబల్లికి చెందిన ఆదిరెడ్డి, గిరిజమ్మ దంపతులకు మూడు ఎకరాల పొలం ఉంది. కరువు ప్రాంతం కావడంతో నీటి వనరులు లేక పంట సాగుకు చాలా ఇబ్బంది పడుతున్న నిరుపేద రైతు దంపతులకు మహేశ్వరరెడ్డి, మంజునాథరెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలు తమలా ఇబ్బందులు పడకుండా ఉండాలని భావించిన తల్లిదండ్రులు.. వారికి చదువులు చెప్పించాలని భావించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలోని మండల పరి షత్ ప్రాథమిక పాఠశాలల్లో పూర్తి చేసుకున్న మంజునాథరెడ్డి.. తర్వాత పదో తరగతి వరకు చిత్తూరు జిల్లా మొలకలచెరువులోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశాడు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదో తరగతిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై.. అక్కడే ఇంటర్మీడియట్ చ దుకున్నాడు. అనంతరం కదిరిలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో 2005–08లో యూ జీ, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎంఎస్సీ., పూర్తి చేశాడు. ఆ సమయంలో బోధనావృత్తిపై మక్కువ పెంచుకున్న అతను 2011–12లో బీఎడ్., పరీక్షలో రాష్ట్రస్థాయిలో పదో ర్యాంక్‌తో మెరిసాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హత పట్టుదలతో చదువుల్లో రాణించిన మహేశ్వరరెడ్డి... ఈ మూడేళ్ల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించారు. బోధనావృత్తిపై ఉన్న మక్కువతో ఆయా ఉద్యోగాల్లో చేరేందుకు అతను విముఖత చూపించారు. సీఎస్ఐఆర్లో ఉద్యోగాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో 39వ ర్యాంక్‌ని సాధించారు. 2016లో ఎఫ్‌సీఐలో ఉద్యోగాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో జోనల్ స్థాయిలో మూడో ర్యాంక్‌ను పొందారు. ఓసీ అభ్యర్థులకు ప్రభుత్వ కొలువులు దక్కవనే ఆత్మనూన్యతతో నలిగిపోతున్న పలువురికి ఆదర్శంగా నిలుస్తూ నాలుగు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించినా.. బాధ్యతలు స్వీకరించకుండా లెక్చరర్ కావాలనే తపనతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆయూష్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ (చెన్నై)గా విధుల్లో చేరారు. డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో (వృక్షశాస్త్రం) మూడో ర్యాంక్ సాధించి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ ఫలితాలు శనివారం వెలువడ్డాయి. బోధనావృత్తిలో కొనసాగే అవకాశం దక్కడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందంటూ మంజునాథరెడ్డి పేర్కొన్నారు. -
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 4, 5వ తేదీల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. చిలుకూరులోని ప్రగతి రిసార్ట్స్‌లో నిర్వహించనున్న ఈ 18వ జాతీయ సదస్సును ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. సదస్సు సందర్భంగా సిలబస్, పరీక్ష విధానం, నూతన సాంకేతిక పద్దతులపై చర్చతో పాటు టీ హబ్‌లో ఐటీ కంపెనీలతో సర్వీస్ కమిషన్ చైర్మన్ల సమీక్ష ఉంటుందని చక్రపాణి వెల్లడించారు. యూపీఎస్సీ చైర్మన్‌తో పాటు అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు హాజరవుతున్న ఈ సదస్సు గవర్నర్ ప్రసంగంతో ముగియనున్నట్లు తెలిపారు.