సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ‘గ్యారంటీ’గా రావాలంటే.. రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో వాటి కోసం అర్హులైన లక్షలాది కుటుంబాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి రేషన్‌కార్డు నిబంధన లేదు. అయితే, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే పథకానికి మాత్రం రేషన్‌కార్డు తప్పనిసరి చేశారు. ఇటీవల మరో రెండు గ్యారంటీలు..రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీల అమలుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
ఈ పథకాలకు కూడా రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకొంది. దీంతో రేషన్‌కార్డు లేని అర్హులైన లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్‌కార్డులు జారీ చేసి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రజాపాలనలో భాగంగా రేషన్‌కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరించారు. కానీ కొత్త కార్డుల విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలను ప్రకటించడం కానీ, ఎప్పటి నుంచి కార్డులు జారీ చేస్తారన్న సమాచారం ఇవ్వడం కానీ చేయకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు ప్రక్రియలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు ఆధార్, రేషన్‌కార్డు నంబర్లు సిద్ధంగా ఉంచుకోవాలంటూ సందేశాలు పంపిస్తుండటంతో రేషన్ కార్డులు రానివారు ఆందోళనకు గురవుతున్నారు.
20 లక్షల దరఖాస్తులు..
కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్‌లోనే ఆరు గ్యారంటీలకు ప్రజాపాలన పేరిట దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రతి గ్రామం, పట్టణం నుంచి వార్డుల వారీగా 1.28 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా రేషన్‌కార్డుల కోసం అర్హులైన కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. దీంతో రేషన్‌కార్డుల కోసం కూడా విడిగా దరఖాస్తులు స్వీకరించారు.
అలా సుమారు 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అనధికారిక లెక్క. కాగా పౌరసరఫరాల శాఖ.. కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులు తమకు అందలేదని స్పష్టం చేస్తుండటంతో ప్రజాపాలనలో ప్రజలు రేషన్‌కార్డుల కోసం చేసిన దరఖాస్తుల పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రజాపాలనలో వచ్చిన 1.28 కోట్ల దరఖాస్తుల్లో కూడా రేషన్‌కార్డు జిరాక్స్ కాపీ లేకుండా అందజేసినవే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో కొత్త రేషన్‌కార్డులు ఇవ్వకుండా ఆరు గ్యారంటీలను అమలు చేయడం అంటే అర్హులకు అన్యాయం చేయడమే అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో 90.14 లక్షల రేషన్‌కార్డులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తెలుపు, గులాబీ కార్డులను జారీ చేసింది. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు రకాల కార్డులను రద్దు చేసి, ఆహార భద్రతా కార్డు పేరుతో కొత్త కార్డులు జారీ చేసింది. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద 54.48 లక్షల కార్డులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి.
మొత్తం 90.14 లక్షల కార్డుల ద్వారా 2.83 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువున (బీపీఎల్) ఉన్నట్టు తెలుస్తోంది. కాగా కొత్తగా పెళ్లిళ్లయి కుటుంబాల నుంచి వేరుపడిన వాళ్లు, వివిధ కారణాల వల్ల కార్డులు పొందలేని వాళ్లు లక్షల సంఖ్యలో ఇప్పుడు కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరు కాకుండా రేషన్‌కార్డుల్లో పుట్టిన పిల్లల పేర్లు చేర్చడానికి కూడా లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వెంటనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ, కార్డుల్లో అడిషన్స్ (చేర్పులు) చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment