న్యూఢిల్లీ: రేషన్ కార్డు గల 80 కోట్ల మందికి కేంద్రం శుభవార్త అందించింది. ఈ నెలలో మొదట్లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎంజీకెఎఈ)ను నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు పీఎం నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని నేడు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నెల ప్రారంభంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్రం ఉచిత ఆహార కార్యక్రమం పీఎంజీకెఎఈను దీపావళి వరకు ఐదు నెలల పాటు పొడిగించనున్నట్లు ప్రకటించారు. "పీఎంజీకెఎఈ (ఫేజ్ IV) కింద అదనపు ఆహార ధాన్యాలను మరో ఐదు నెలల కాలానికి అంటే 2021 జూలై నుంచి నవంబర్ వరకు కేటాయించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది" అని ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కరోనా వైరస్ వల్ల కలిగే ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజల కష్టాలను తగ్గించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013(ఎన్ఎఫ్ఎస్ఎ) కింద కవర్ అయ్యే 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు పీఎంజీకెఎఈ కింద ప్రతి వ్యక్తికి నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఎన్ఎఫ్ఎస్ఎ కింద కవర్ చేయబడ్డ పేద లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు అందిస్తున్నారు. ఉచితంగా ఆహార ధాన్యాలను మరో ఐదు నెలల పాటు అందించడం వల్ల రూ.64,031 కోట్లు కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రవాణా, నిర్వహణ, రేషన్ దుకాణ డీలర్ల మార్జిన్లు మొదలైన వాటి కోసం ప్రభుత్వం సుమారు రూ.3,234.85 కోట్ల అదనపు ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపింది. "అందువల్ల, భారత ప్రభుత్వం భరించాల్సిన మొత్తం అంచనా వ్యయం రూ.67,266.44 కోట్లు" అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment