PMGKY scheme
-
కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త!
రేషన్ కార్డ్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద 81 కోట్ల మంది రేషన్ కార్డ్ దారులకు మరో ఐదేళ్లు రేషన్‌ను ఉచితంగా అందిచనుంది. ఇటీవల ఇటీవల ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్న పీఎంజీకేఏవై పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తామని స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలపై మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేంద్రం పేదలకు అండగా నిలుస్తూ పీఎంజీకేఏవై పథకాన్ని ఏప్రిల్ 2020లో ప్రారంభించింది. ఈ స్కీంలో జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే ప్రజలకు ఉచిత రేషన్‌ను మూడు నెలల పాటు అందించింది. ఆ తర్వాత పొడిగిస్తూ వచ్చింది. ఈ డిసెంబర్ 31తో ఈ పథకం వ్యవధి ముగియనుండగా.. తాజాగా దీన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
భళా: భారత్‌లో పేదరికం తగ్గుతోంది, 'పీఎంజీకేఏవై' పై ప్రశంసల వర్షం!
న్యూఢిల్లీ: పేద ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేఏవై)వల్ల భారత్‌లో పేదరికం తీవ్రత తగ్గిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) విశ్లేషించింది. ఈ పథకం వల్ల కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొన్న 2020 సమయంలో భారత్‌లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద కనిష్ట స్థాయిలో కొనసాగిందని ఒక వర్కింగ్ పేపర్లో పేర్కొంది. ‘మహమ్మారి, పేదరికం, అసమానత: భారతదేశం నుంచి పాఠాలు’ అనే అంశంపై ఈ వర్కింగ్ పేపర్ రూపొందింది. 2004–05 నుంచి మహమ్మారి సవాళ్లు విసిరిన 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ భారతదేశంలో పేదరికం, వినియోగ అసమానతలపై ఈ పత్రం అధ్యయనం చేసింది. సుర్జిత్ ఎస్ భల్లా, కరణ్ భాసిన్, అరవింద్ విర్మానీలు రూపొందించిన ఈ వర్కింగ్ పేపర్లోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►2019లో కరోనా ముందు సంవత్సరంలో భారత్‌లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద ఉంది. 2020 మహమ్మారి సంవత్సరంలోనూ అది తక్కువ స్థాయిలోనే కొనసాగాలా చూడ్డంలో ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కీలకపాత్ర పోషించింది. ►మార్చి 2020లో ప్రారంభించిన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నెలకు 5 కిలోల ఆహారధాన్యా లను ఉచితంగా అందిస్తోంది. సాధారణ కోటా కంటే ఎక్కువగా అదనపు ఉచిత ధాన్యాన్ని జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద అందించడం జరుగుతోంది. కిలోగ్రాముకు రూ. 2 నుంచి రూ.3 వరకూ అధిక సబ్సిడీ రేటుతో ఈ ప్రయోజనాన్ని పేదలకు కేంద్రం అందిస్తోంది. 2022 సెప్టెంబర్ వరకూ ఈ పథకాన్ని పొడిగించడం సానుకూల పరిణామం. ► 2019–20 మహమ్మారికి ముందు సంవత్సరంలో భారతదేశంలో పేదరికం 14.8 శాతంగా ఉంటే, తీవ్ర పేదరికం శాతం 0.8 శాతంగా ఉంది. ►ఏదు దశాబ్దాల్లో మొట్టమొదటిసారి ప్రపంచ వ్యాప్తంగా 2020 మహమ్మారి సమయంలో పేదరికం (రోజుకు 1.9 డాలర్లకన్నా తక్కువ ఆర్జన) తీవ్రంగా పెరిగింది. ► మహమ్మారి సమయంలో భారత్ ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల వల్ల పేదరికం తీవ్రత కట్టడిలో ఉంది. 2013లో ఆహార భద్రతా చట్టం (ఎఫ్ఎస్ఏ) అమలులోకి వచ్చినప్పటి నుండి ఆహార సబ్సిడీలు పేదరికాన్ని స్థిరంగా తగ్గించాయి. ప్రయోజనాలు అసలైన లబ్దిదారులకు చేరడం ఆధార్ ద్వారా సాధ్యపడుతోంది. లబ్దిదారునికి సబ్బిడీ పథకాలు చేరేలా తీసుకువచ్చిన చర్యలు, చొరవలు పేదరికం తగ్గడంలో మంచి ప్రభావాన్ని పోషించాయి. ►గిని కోఎఫీషియంట్ విధానం ద్వారా మదింపుచేసే గణాంకాల ప్రకారం, గత నలభై సంవత్సరాలలో ‘‘వాస్తవిక అసమానత’’ కనిష్ట స్థాయికి చేరుకుంది. 1993–94లో అసమానతల నివారణా సూచీ 0.284 వద్ద ఉంటే, 2020–21లో 0.292కి చేరుకుంది. ఆహార సబ్సిడీల వల్ల మూడు సంవత్సరాలుగా తీవ్ర పేదరికం 1 శాతం కంటే తక్కువగా (లేదా సమానంగా) ఉంది. ►ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత 2020లో మొదటిసారి జనాభాలో మూడింట రెండు వంతుల మంది ప్రజలకు అవసరమైన ప్రాథమిక ఆహార రేషన్‌ను ప్రభుత్వం పూర్తి స్థాయిలో సరఫరా చేస్తోంది. ►తీవ్ర పేదరిక సమస్య వాస్తవంగా భారత్‌లో పోయిందనే చెప్పాలి. ఇందుకు సంబంధించి ప్రాతిపదికైన ఆర్జన ఇకపై 1.9 డాలర్ల నుంచి 3.2 డాలర్లకు పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకు అనుగుణంగా భారత్ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ అధికారికంగా దేశంలో దారిద్య్రరేఖ ప్రాతిపదికలను మార్చాలి. ►దేశంలో మహమ్మారి వల్ల తలెత్తిన తీవ్ర పేదరిక సమస్య ఆహార సబ్సిడీ విస్తరణ కార్యక్రమం వల్ల దాదాపు 50 శాతం మేర సమసిపోయింది. -
పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంపై ఐఎంఎఫ్ ప్రశంసలు..!
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ప్రశంసలు కురిపించింది . ఆహార భద్రత పథకం దేశంలో తీవ్ర పేదరికం పెరగకుండా నిరోధించిందని కితాబిచ్చింది. 2019లో భారత్‌లో తీవ్ర పేదరికం ఒక శాతం కంటే దిగువన ఉందని.. కరోనా సమయంలోనూ అది స్థిరంగానే కొనసాగిందని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది. పేదరిక స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కీలకంగా మారిందని ఐఎంఎఫ్ తెలిపింది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో దేశంలో పేదరికం అత్యంత వేగంగా క్షీణించిందని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది. కరోనా రాకతో ప్రజలంతా తమ ఇంటి వద్ద పరిమితమైన విషయం తెలిసిందే. వలస కూలీలు, పేదలకు ఆహార భద్రతను అందించేందుకుగాను...కేంద్ర ప్రభుత్వం 2020 మార్చిలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని తీసుకువచ్చింది. కాగా ఈ ఉచిత రేషన్ పథకాన్ని సెప్టెంబర్ 2022 వరకు పొడిగిస్తూ కేంద్రం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. చదవండి: ఇంధన ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..! -
రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: రేషన్ కార్డు గల 80 కోట్ల మందికి కేంద్రం శుభవార్త అందించింది. ఈ నెలలో మొదట్లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎంజీకెఎఈ)ను నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు పీఎం నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని నేడు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నెల ప్రారంభంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్రం ఉచిత ఆహార కార్యక్రమం పీఎంజీకెఎఈను దీపావళి వరకు ఐదు నెలల పాటు పొడిగించనున్నట్లు ప్రకటించారు. "పీఎంజీకెఎఈ (ఫేజ్ IV) కింద అదనపు ఆహార ధాన్యాలను మరో ఐదు నెలల కాలానికి అంటే 2021 జూలై నుంచి నవంబర్ వరకు కేటాయించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది" అని ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వల్ల కలిగే ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజల కష్టాలను తగ్గించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013(ఎన్ఎఫ్ఎస్ఎ) కింద కవర్ అయ్యే 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు పీఎంజీకెఎఈ కింద ప్రతి వ్యక్తికి నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఎన్ఎఫ్ఎస్ఎ కింద కవర్ చేయబడ్డ పేద లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు అందిస్తున్నారు. ఉచితంగా ఆహార ధాన్యాలను మరో ఐదు నెలల పాటు అందించడం వల్ల రూ.64,031 కోట్లు కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రవాణా, నిర్వహణ, రేషన్ దుకాణ డీలర్ల మార్జిన్లు మొదలైన వాటి కోసం ప్రభుత్వం సుమారు రూ.3,234.85 కోట్ల అదనపు ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపింది. "అందువల్ల, భారత ప్రభుత్వం భరించాల్సిన మొత్తం అంచనా వ్యయం రూ.67,266.44 కోట్లు" అని తెలిపింది. చదవండి: పీఎన్బీ స్కాం: నీరవ్ మోదీకి భారీ షాక్ -
పీఎం–జీకేవై పంపిణీ సజావుగా జరపాలి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎం–జీకేవై) మంజూరుచేసిన రూ.27,500 కోట్లను లబ్ధిదారులకు సజావుగా పంపిణీ అయ్యేలా చూడాలని కేంద్రం కోరింది. హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు లేఖ రాశారు. శుక్రవారం నుంచి బ్యాంకుల్లో మొదలయ్యే నగదు పంపిణీ సమయంలో ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు గుమికూడకుండా వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని బ్యాంకుల శాఖలు, ఏటీఎంల వద్ద శాంతిభద్రతల నిర్వహణకు అవసరమైన భద్రతా సిబ్బందిని నియమించాలన్నారు. -
కౌంట్ డౌన్: బ్లాక్ మనీ హోల్డర్స్‌కు వార్నింగ్స్
న్యూఢిల్లీ : బ్లాక్‌మనీ హోల్డర్స్‌కు ఆదాయపు పన్ను శాఖ హెచ్చరికలు జారీచేసింది. బ్లాక్‌మనీ హోల్డర్స్ కోసం అందుబాటులో ఉంచిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) గడువు ముగుస్తుందని.. ఇదే ఆఖరి అవకాశమని హెచ్చరించింది. మార్చి 31 ముగియనున్న డెడ్ లైన్‌కు కౌంట్ డౌన్ ప్రారంభించినట్టు అన్ని రకాల న్యూస్ డైలీస్లో ప్రకటించింది. ఈ గడువు ముగిసే లోపలే బ్లాక్ మనీ వివరాలు వెల్లడించాలని, లేని పక్షంలో బినామీ చట్టాల కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. డిఫాల్డర్ల పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ లాంటి కేంద్ర విచారణ సంస్థలకు షేర్ చేస్తామని, పన్ను, జరిమానాలు భారీగా ఉంటాయని వెల్లడించింది. పీఎంజీకేవైను సద్వినియోగం చేసుకోలేని వారి నగదు డిపాజిట్లకు 137 శాతం కంటే ఎక్కువ పన్ను, జరిమానాలే ఉండనున్నాయని సీనియర్ అధికారి చెప్పారు. డిపాల్టర్లకు వ్యతిరేకంగా బినామి చట్టాలను ప్రయోగించడంలో అసలు వెనక్కు తగ్గబోమని హెచ్చరించారు. పీఎంజీకేవైను సద్వినియోగం చేసుకునే బ్లాక్ మనీ హోల్డర్స్ వివరాలను బయటపెట్టమని, కానీ వారి ఆదాయంపైన 49.9 శాతం పన్ను ఉంటుందన్నారు. ఈ స్కీమ్ ను వాడుకోకుండా... ఆదాయపు పన్ను రిటర్న్స్ లో నల్లధన వివరాలు తెలిపితే వారికి పన్ను, పెనాల్టి కింద 77.25 శాతం విధించనున్నారు. ఒకవేళ, తనిఖీల సమయంలో లెక్కల్లో చూపని ఆదాయం ఉన్నట్లు అంగీకరించడంతో పాటు దానికి సంబంధించి సరైన వివరణ ఇచ్చిన పక్షంలో 107.25 శాతం దాకా పన్నులు, జరిమానా ఉండగలవని ఆదాయ పన్ను విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తనిఖీల్లో దొరికిన నల్లధనాన్ని సరెండర్ చేయని వారికి ఏకంగా 137.25 శాతం పన్ను విధించేస్తామని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్లాక్ మనీ హోల్డర్స్ కోసం ప్రభుత్వం ఈ పీఎంజీకేవై పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే తుది అవకాశంగా ప్రభుత్వం హెచ్చరించింది.