
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎం–జీకేవై) మంజూరుచేసిన రూ.27,500 కోట్లను లబ్ధిదారులకు సజావుగా పంపిణీ అయ్యేలా చూడాలని కేంద్రం కోరింది. హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు లేఖ రాశారు. శుక్రవారం నుంచి బ్యాంకుల్లో మొదలయ్యే నగదు పంపిణీ సమయంలో ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు గుమికూడకుండా వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని బ్యాంకుల శాఖలు, ఏటీఎంల వద్ద శాంతిభద్రతల నిర్వహణకు అవసరమైన భద్రతా సిబ్బందిని నియమించాలన్నారు.