గొర్లె శ్రీదేవికి మంజూరు చేసిన కార్డు
‘విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని ఎస్‌బీఐ కాలనీకి చెందిన గొర్లె శ్రీదేవి ఈ నెల 10న రైస్ కార్డు కోసం స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసింది. వార్డు వలంటీర్, గ్రామ రెవెన్యూ అధికారి దరఖాస్తును పరిశీలించి.. ప్రజాసాధికార సర్వే వివరాలతో సరిచూశారు. అర్హురాలిగా గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అంతే... ఆమె పేరుతో ఈ నెల 18న పౌర సరఫరాలశాఖ కమిషనర్ రైస్ కార్డును మంజూరు చేశారు. ప్రింట్ కాపీని సచివాలయ సిబ్బంది అందజేశారు. వచ్చేనెల నుంచి ఆమెకు రేషన్ సరుకులు అందనున్నాయి’.
విజయనగరం గంటస్తంభం: రైస్ కార్డు... పేదవారి బతుకుకు ఆధారపత్రం. అందుకే కార్డు పొందేందుకు ఆరాట పడతారు. చేతికందాక సంతోషపడతారు. గతంలో ఏళ్ల తరబడి తిరిగినా అందని కార్డు... ఇప్పుడు దరఖాస్తు చేసిన పది రోజుల్లోనే చేతికందుతుండడంతో సంబరపడుతున్నారు. కార్డును పదేపదేసార్లు చూస్తూ మురిసిపోతున్నారు. సచివాలయ వ్యవస్థతో చక్కని పాలన అందిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని మనసారా అభినందిస్తున్నారు.
ప్రక్రియ అంతా పదిరోజులే..
సచివాలయాలు రావడం, సిబ్బందికి అధికారాలు ఇవ్వడంతో రైస్ కార్డులకు సంబంధించిన పక్రియ సులభతరమైంది. పదిరోజుల్లోనే పరిశీలన పూర్తవుతోంది. కుటుంబ యజమాని దరఖాస్తు చేసుకున్న రోజే వీఆర్వో లాగిన్‌లోకి వెళ్తుంది. వీఆర్వో ఆ వివరాలు వలంటీర్‌కు ఇస్తే వారు వెంటనే ఈకేవైసీ చేసి తిరిగి వీఆర్వోకు అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఆ డేటా సిక్స్‌స్టెప్ వాల్యూడేషన్‌కు వెళ్తుంది. ప్రజాసాధికార సర్వే, ఇతర డేటాతో దరఖాస్తుదారుని కుటుంబ డేటాను పరిశీలించి అర్హత ఉంటే రైస్‌కార్డు మంజూరు చేసి డిజిటల్ సంతకం కోసం తహసీల్దార్‌కు వెళ్తుంది. అనంతరం ఆ డేటా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు చేరుతుంది. ఆయన రేషన్‌కార్డు పీడీఎఫ్ ఫైల్‌లో డీఎస్వోకు పంపిస్తారు. వెంటనే డీఎస్వో కార్డు ముద్రించి సీఎస్‌డీటీ, వీఆర్వో ద్వారా సచివాలయానికి పంపిస్తే వలంటీరు నేరుగా లబ్ధిదారుకు అందజేస్తారు. ఈ పక్రియ మొత్తం పదిరోజుల్లో పూర్తి అవుతుండడం.. ఎవరినీ ప్రాథేయపడకుండా చేతికి నేరుగా కార్డు అందుతుండడంతో లబి్ధదారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
ఇప్పటికే వేలాది కార్డులు మంజూరు
జిల్లాలో జూన్ నెల ఆరంభం నుంచి సచివాలయాల నుంచి రైస్‌కార్డుల జారీ సాగుతోంది. కార్డుల కోసం జిల్లాలోని సుమారు 13,500 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో ఇప్పటికే అన్ని రకాల పరిశీలన, విచారణ పూర్తిచేసి 7,150 దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించి పౌరసరఫరాలశాఖ కమిషనర్ కార్డులు మంజూరు చేశారు. కార్డుల డేటా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి లాగిన్‌లోకి వచ్చింది. ఇందులో 4,100 కార్డులను డీఎస్వో విశాఖపట్నంలో ముద్రించి సంబంధిత సచివాలయాలకు పంపించారు. వీటిని వార్డు, గ్రామ వలంటీర్లు ద్వారా పంపిణీ చేస్తున్నారు. మిగతా కార్డుల ముద్రణ జరుగుతోంది.
నిరంతర పక్రియ
అర్హులకు పది రోజుల్లోనే రైస్‌కార్డు జారీ అవుతుంది. ఇప్పటికే కొందరికి కార్డులు పంపిణీ చేశాం. కొన్ని కార్డులు ముద్రణలో ఉన్నాయి. ఇది నిరంత పక్రియ. ఎవరైనా కార్డులు లేనివారు ఇకపై సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. గతంలో వలే వ్యయప్రయాసలకు గురికావాల్సిన అవసరం లేదు.
– ఎ.పాపారావు, డీఎస్వో, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment