వివరాలు సేకరిస్తున్న సచివాలయ సిబ్బంది
శ్మశానంలో కాటికాపరిగా బతుకును వెళ్లదీస్తూ.. మరొకరికి జీవం పోస్తున్న ఆమె పట్ల కలెక్టర్ పెద్ద మనసు చూపారు. కడప నగరం నడిబొడ్డున ఉన్నా.. సంక్షేమ పథానికి దూరంగా ఉన్న జయమ్మకు అండగా నిలిచారు. ఈనెల 9వ తేదిన సాక్షిలో మరుభూమే అమ్మ ఒడి శీర్షికన ప్రచురితమైన కథనం కలెక్టర్ హరికిరణ్‌ను కదిలించింది. ఆమె పడుతున్న వేదన.. మస్తాన్ ఆవేదనను సాక్షి అక్షరీకరించింది. అధికారులను శ్మశానం వైపు అడుగులు వేసేలా చేసింది.
సాక్షి కడప: కడపలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న హిందూ శ్మశాన వాటికలో జయమ్మ కాపరిగా ఉంటోంది. ఈమెతోపాటు పాతికేళ్ల కిందట దొరికిన మస్తాన్‌ను కూడా ఆమె పోషిస్తోంది. మస్తాన్ మానసిక వికలాంగుడు.కాళ్లు కదపలేక...చేతులు ఎత్తలేక...మాటలు సక్రమంగా రాక నరకయాతన అనుభవిస్తున్నాడు.ఇతని ఆలనాపాలనా కూడా జయమ్మే చూస్తూ శ్మశానంలోని సత్రంలో జీవనం సాగిస్తున్నారు. వీరికి సంబంధించి గతంలో కుమార్తె వద్ద ఉన్నప్పుడు రేషన్‌కార్డు ఉన్నా చాలా ఏళ్ల క్రితమే తొలగిపోయింది. దీంతో ఎలాంటి పెన్షన్ అందలేదు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో కలెక్టర్ హరికిరణ్ స్పందించారు. కిందిస్థాయి అధికారులను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీంతో సచివాలయ వలంటీర్, మరికొంతమంది సిబ్బంది నేరుగా శ్మశాన వాటికకు వెళ్లి వివరాలు నమోదు చేశారు. జయమ్మ, మస్తాన్‌ల ఫొటోలను తీసుకుని ప్రభుత్వ పథకాలు అందని వైనంపై వివరాలను సేకరించారు.
రేషన్‌కార్డు, పెన్షన్లకు చర్యలు
ప్రస్తుతం శ్మశానంలో నివాసముంటున్న జయమ్మ, మస్తాన్‌లకు కొత్త రేషన్‌కార్డును వారం రోజుల్లోగా అందించాలని కలెక్టర్ ఆదేశించారు.అంతేకాకుండా జయమ్మకు ఒంటరి మహిళ కింద, మస్తాన్‌కు కూడా దివ్యాంగుల కోటాలో పెన్షన్ అందించేందుకు సచివాలయం ద్వారా దరఖాస్తులను పంపించారు. సాక్షిలో ప్రచురితమైన కథనంతో మరుభూమిలో నివాసముంటున్న కుటుంబానికి అధికార యంత్రాంగం అండగా నిలవడంపై పలువురు అభినందనలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment