funeral home
-
షాకింగ్: 560 మంది శరీర భాగాలను అమ్ముకున్న తల్లీకూతుళ్లు!
వాషింగ్టన్: అమెరికాలోని కొలొరాడో రాష్ట్రంలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. శ్మశన వాటిక మాజీ ఓనర్ అయిన ఓ 46 ఏళ్ల మహిళకు ఫెడరల్ కోర్టు మంగళవారం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అంత్యక్రియల కోసం తీసుకొచ్చిన 560 మృతదేహాలకు చెందిన వివిధ అవయవాలను బంధువులకు తెలియకుండానే అమ్ముకున్నట్లు నేరం నిరూపణ అయిన క్రమంలో ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మృతుల బంధువులను మోసం చేసి ఫోర్జరీ డోనార్ పత్రాల సాయంతో ‘మేగన్ హెస్’ అనే మహిళ శరీర భాగాలను విక్రయించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. గత జులై నెలలో తను చేసిన నేరాన్ని అంగీకరించిందని, ఈ క్రమంలోనే కోర్టు 20 ఏళ్ల శిక్ష విధించినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఆమెకు సహకరించిన తల్లి షిర్లే కొచ్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష పడినట్లు తెలిపింది. ఇదీ జరిగింది.. కొలొరాడో రాష్ట్రంలోని మోంట్రోస్‌లో ‘సన్‌సెట్ మెసా’ అనే శశ్మాన వాటిక, అవయవదాన సేవలను నిర్వహించేది మేగన్ హెస్. 69 ఏళ్ల తల్లి షిర్లే కొచ్ ఆమెకు ఈ కార్యక్రమాల్లో సహకరించేది. ఈ క్రమంలోనే ఇరువురు అక్రమంగా మృతదేహాల అవయవాలను విక్రయిస్తూ డబ్బులు సంపాదించటం మొదలు పెట్టారు. బంధువులే అవయవాలను దానం చేస్తున్నట్లుగా నకిలీ పత్రాలను సృష్టించి తమ చీకటి కార్యాన్ని నిర్విగ్నంగా కొనసాగించారు. ఇలా 560 మంది శరీర భాగాలను విక్రయించారు. 2016-2018 మధ్య అమెరికాలో అవయవాల విక్రయాలపై రాయిటర్స్ పరిశోధనాత్మక కథనాలు వెలువడిన క్రమంలో మేగన్ హెస్, ఆమె తల్లి షిర్లే చేసిన దందా బయటపడింది. తల్లీకూతుళ్ల విషయాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)కి రాయిటర్స్ సమాచారం అందించడంతో వారి బిజినెస్ కేంద్రాలపై దాడులు చేసింది. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన కేసుగా పోలీసులు అభివర్ణించారు. ఇరువురిని అరెస్ట్ చేసి విచారించగా గత జులై నెలలో నేరం అంగీకరించారు. ఈ క్రమంలోనే మేగన్ హెస్కు 20 ఏళ్లు, ఆమె తల్లి షిర్లే కొచ్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఫెడరల్ కోర్టు. నిందితురాలి తల్లి షిర్లే ప్రధానంగా అవయవాలను శరీరం నుంచి వేరు చేసి భద్రపరిచే పనిలో సహకరించేదని తేల్చింది. తల్లీకూతుళ్ల ఆపరేషన్‌కు 200లకుపైగా కుటుంబాలు బాధితులుగా మారినట్లు తెలిసింది. మరోవైపు.. హెస్ చేసిన చర్యలను సమర్థించారు ఆమె న్యాయవాది. నిందితురాలికి 18 ఏళ్ల వయసులో మెదడు దెబ్బతిన్నదని అందుకే ఇలా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు. కోర్టులో సాక్ష్యం చెప్పిన ఓ బాధితుడు వారి నేరాలపై కీలక విషయాలు బయటపెట్టాడు. తన తల్లికి చెందిన భుజాలు, మోకాళ్లు, పాదాలు విక్రయించారని ఆరోపించారు. అమెరికాలో అవయవాల మార్పిడి కోసం గుండె, కిడ్నీలు వంటి వాటిని విక్రయించడం నేరం. వాటిని ఎవరైనా దానం చేస్తేనే మార్పిడికి ఉపయోగించాలి. చట్టం పరిధిలో లేని తల, భుజాలు, వెన్నెముఖలను సైతం వారు విక్రయించేవారని తేలింది. ఇదీ చదవండి: దేశం విడిచి వెళ్లమని బెదిరింపులు.. నెలకి రూ.1కోటి ఆఫర్: మహిళా కోచ్ -
శ్మశానాల్లో రాబందులు
ప్రపంచమంతా కరోనాతో చిగురుటాకులా వణికిపోతోంది. ఈ మాయదారి వైరస్ మన జిల్లాలోనూ కోరలు చాస్తోంది. ఎందరినో కబళిస్తోంది. ఎన్నో కుటుంబాలను దిక్కులేని వారిని చేస్తోంది. సాటి మనిషికి సాయం చేయాల్సిన ఈ విపత్కర పరిస్థితుల్లో కొన్ని శ్మశాన వాటికల నిర్వాహకులు, కమిటీ సభ్యులు డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎవరైనా చనిపోతే కాసులకే ప్రాధాన్యమిస్తూ కాల్చుకుతింటున్నారు. అంత్యక్రియల నిర్వహణకు రూ.వేలల్లో డిమాండ్ చేస్తూ మానవత్వానికి సమాధి కడుతున్నారు. ♦ అనంతపురంలోని కోవూరునగర్‌కు చెందిన ఓ వృద్ధుడు రెండ్రోజుల కిందట మరణించారు. ఆయనది సాధారణ మరణమే. అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. శ్మశాన వాటిక నిర్వాహకులతో పాటు కమిటీ సభ్యుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తే.. వారు రూ.లక్ష డిమాండ్ చేశారు. చివరకు వారిని బతిమలాడి రూ.80 వేలకు ఒప్పందం కుదిరాక గానీ అంత్యక్రియలు చేయలేకపోయారు. ♦ కొన్ని వారాల కిందట ఆర్యవైశ్య సంఘానికి చెందిన ప్రముఖుడు కరోనాతో మరణిస్తే దహన సంస్కారాలకు ఏకంగా రూ.లక్ష వరకూ వసూలు చేశారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరిగినట్లు బంధువులు వాపోయారు. ఈ రెండు ఘటనలు ప్రస్తుత పరిస్థితికి, మనుషుల్లో దిగజారి పోతున్న విలువలకు అద్దం పడుతున్నాయి. అనంతపురం సిటీ : బతికుండగా నరకం చూపుతున్న కరోనా మహమ్మారి.. మనిషి చచ్చాక కూడా అంత్యక్రియలపై ప్రభావం చూపుతోంది. కరోనా కలకలం నేపథ్యంలో ప్రస్తుతం ఏ మతం వారు చనిపోయినా వారి అంత్యక్రియలు నిర్వహించడం కుటుంబీకులకు కష్టంగా మారింది. సాధారణ మరణమే అయినా శ్మశాన వాటికి అభివృద్ధి కమిటీ సభ్యులు, నిర్వాహకులు, కాటి కాపరులు కష్టసమయంలోనూ కాసులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దహన సంస్కారాలకు వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఎందరినో కబళిస్తోంది. గత ఏడాదితో పోల్చితే లాక్డౌన్ విధించిన మార్చి–25 నుంచి మరణాల సంఖ్య క్రమంగా పెరిగిందని రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. 2019–20 సంవత్సరంలో అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో చేరి 2,194 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 109 మంది మరణించగా, మే నెలలో 211 మంది, జూన్‌లో 163 మంది, ఈ నెల 13 నాటికి 85 మంది మరణించినట్లు ఆస్పత్రి రికార్డుల్లో నమోదయ్యాయి. అదే అనంతపురం నగర పాలక సంస్థలోని రికార్డుల ప్రక్రారం.. 2019 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు 1,205 మంది మరణించినట్లు వెల్లడైంది. ఈ ఏడాది జనవరిలో 132 మంది, ఫిబ్రవరిలో 64 మంది చనిపోయారు. మార్చిలో 50 మంది, ఏప్రిల్‌లో 43 మంది, మేలో 69 మంది, జూన్‌లో 105 మంది, ఈ నెల 13 వరకు 25 మంది చనిపోయినట్లు రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే వీటి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరు ఏ విధంగా చనిపోయినా... కొన్ని శ్మశానాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు అంత్యక్రియల ఖర్చు పేరుతో ఇష్టారాజ్యంగా గుంజుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంత్యక్రియల ఖర్చు ఎవరికీ పట్టదా? అంత్యక్రియలకు కొన్ని మత, కుల సంఘాల వారు తమకు ఇష్టమొచ్చిన రీతిలో డబ్బులు గుంజుతున్నా.. నియంత్రించే వారే లేకుండాపోయారు. నగరంలోని చాలా శ్మశాన వాటికల్లో అంత్యక్రియలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరినడిగినా రూ. 2 వేలు లేదా రూ.3 వేలు అని మాత్రమే చెబుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంతో కమిటీ పెద్దల ముసుగులో కొందరు బరితెగిస్తున్నారు. మనిషిని పోగొట్టుకున్న బాధలో ఉన్న వారిని మరింత శోకంలోకి నెట్టేస్తున్నారు. కరోనా నేపథ్యంలో చేసేందుకు పని లేక, ఆదాయ మార్గాలు కాన రాక.. దిక్కులు చూస్తున్న వేళ.. కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఇక వారి సంగతి దేవుడికెరుక. వీటిపై యంత్రాంగం దృష్టి సారించాలని జనం కోరుతున్నారు. కోరారు. మనుషుల్లేరంటూ.. మనీ బేరం అనంతపురంలోని పాత ఊరు(గుత్తి రోడ్డు)లోని ఓ శ్మశాన వాటికను ఓ కుల సంఘానికి అనుబంధంగా నిర్వహిస్తున్నారు. సదరు సంఘం కార్యాలయానికి వెళ్తే అక్కడ ఓ పే..ద్ద బ్యానర్ కనిపిస్తుంది. అందులో ‘దహన వాటికలో పార్థివ దేహాలు దహనం చేసేందుకు సిబ్బంది లేని కారణంగా దహన వాటిక తాత్కాలికంగా నిలిపివేయడమైనది’ అంటూ పాలక వర్గం, సంఘం పేరు బ్యానర్ కనిపిస్తుంది. దీంతో మనిషి పోయిన బాధకంటే.. బ్యానర్లోని అంశమే బాధిత కుటుంబీకులను కుంగదీస్తోంది. కానీ దహన సంస్కారానికి సిబ్బంది లేరని బ్యానర్ వేసిన పెద్దలు, నిర్వాహకులే.. మళ్లీ ఆ తంతు పూర్తి చేస్తున్నారు. దీని వెనుక మనీ బేరం భారీగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాస్త ఖర్చు ఎక్కువే కరోనాతో చనిపోయే వారికంటే దానికి భయపడి చనిపోతున్న వారిలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణ మరణమైతే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు 20 మందిని అనుమతిస్తాం. కానీ కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, ఇతరులెవరూ రావడం లేదు. దీంతో జేసీబీతో పది అడుగుల మేర గుంత తీసి మృతదేహాలను పూడ్చిపెడుతున్నాం. కరోనాతో చనిపోయిన వారికైతే ప్రత్యేక దుస్తులు, మాస్క్, శానిటైజర్ వాడాలి. అందుకు కొంచెం ఎక్కువ ఖర్చు వస్తోంది.– బాబావలి, కేర్ టేకర్,జామియా మస్జీద్ అనుబంధ నూరానీ కబరస్తాన్ రూ.5 వేలు తీసుకుంటాం ఒక్కో వ్యక్తి అంత్యక్రియలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటాం. ఇదే వృత్తిపై ఆధారపడి 10 కుటుంబాల వారం బతుకుతున్నాం. మాకు మరే మార్గం లేదు. గతంలో నెలకు 10 నుంచి 12 కేసులు వచ్చేవి. ఈ మూడు నెలలుగా వాటి సంఖ్య కొంచెం పెరిగింది. డబ్బులు ఇంతే ఇవ్వాలంటూ ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు. ఆర్థికంగా ఉన్నవారైతే రూ.2 వేల నుంచి రూ. 3 వేలు ఎక్కువగా ఇస్తారు. పేదోళ్లయితే ఎంతిచ్చినా తీసుకుంటున్నాం. అనాథ మృతదేహాలను ఉచితంగానే పూడ్చిపెడుతున్నాం. – కుళ్లాయప్ప, హిందూ శ్మశాన వాటిక కాటి కాపరి,జేఎన్టీయూ రోడ్డు సహకరించే వారేరీ కరోనాకు ముందు రోజుల్లో ఎవరైనా మృత్యువాత పడితే.. అరగంటలో వైకుంఠ రథాలు ఇంటి ముందుకు వచ్చేవి. కానీ ఇప్పుడు వారు కూడా కాఠినంగా మారిపోయారు. కరోనా భయంతో వైకుంఠ రథం రావడం కష్టసాధ్యమైపోయింది. ఇక శ్మశాన వాటికల ప్రతినిధులయితే కరోనా లేదని సర్టిఫికెట్ తెచ్చి ఇవ్వాలని డిమాండు చేస్తున్నారు. ఇన్ని చేసినా అక్కడ పనిచేసే కాటి కాపర్లు సహకారమందించకపోవడంతో ఎక్కువ మొత్తాన్ని ఇచ్చి ప్రయివేటు వ్యక్తులతో అంత్యక్రియలు జరిపించుకుంటున్నారు. ఇక కరోనా ప్రభావంతో చనిపోతున్న వారు దహన సంస్కారాల కోసం పడే ఇబ్బందులు గ్రహించిన కొందరు స్వార్థపరులు దానిని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఇటీవల ఓ వృద్ధురాలి వంటిపై ఉన్న నగలు కూడా కాజేసిన సంఘటన చర్చనీయాంశంగా మరింది. కరోనా లక్షణాలు లేకుండా మరణించినా అంతిమ సంస్కారాలు చేసేందుకు రూ.40 వేలు డిమాండు చేస్తున్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ♦ కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి అమలు పరిచే బాధ్యత స్థానిక అధికారులపై ఉంచింది. ♦ ఎవరైనా చనిపోతే మృతదేహం వద్ద ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలి. ♦ అంత్యక్రియలకు హాజరైనా వారు కూడా చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ విధిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. ♦ 20 మంది కంటే ఎక్కువ సంఖ్యలో జనం హాజరు కాకుండా చూడాలి. వారంతా కోవిడ్ నిబంధనలన్నీ పాటించేలా చర్యలు తీసుకోవాలి. ♦ ఎవరైనా కరోనాతో మరణిస్తే వారిని ఖననం చేయాల్సి ఉంటుంది. ఇందుకు పది నుంచి పదిహేను అడుగుల మేర గుంత తీయాలని కరోనా మృతుల అంత్యక్రియల మార్గదర్శకాలు చెబుతున్నాయి. జరుగుతున్నదేమిటంటే.. ♦ నిబంధనలకంటే ఎక్కువ మంది హాజరవుతున్నా నిలువరించలేకపోవడం. ♦ మాస్క్‌లు, శానిటైజర్లు కొందరు వాడకపోయినా... కమిటీ సభ్యులు గానీ, శ్మశాన నిర్వాహకులు గానీ పట్టించుకోకపోవడం. ♦ భౌతిక దూరం పాటించకపోయినా.. వదిలేయడం వంటి అంశాలు అనేక సమస్యలను సృష్టిస్తున్నాయి. -
మరుభూమిలో కాటి కాపరి.. స్పందించిన కలెక్టర్
శ్మశానంలో కాటికాపరిగా బతుకును వెళ్లదీస్తూ.. మరొకరికి జీవం పోస్తున్న ఆమె పట్ల కలెక్టర్ పెద్ద మనసు చూపారు. కడప నగరం నడిబొడ్డున ఉన్నా.. సంక్షేమ పథానికి దూరంగా ఉన్న జయమ్మకు అండగా నిలిచారు. ఈనెల 9వ తేదిన సాక్షిలో మరుభూమే అమ్మ ఒడి శీర్షికన ప్రచురితమైన కథనం కలెక్టర్ హరికిరణ్‌ను కదిలించింది. ఆమె పడుతున్న వేదన.. మస్తాన్ ఆవేదనను సాక్షి అక్షరీకరించింది. అధికారులను శ్మశానం వైపు అడుగులు వేసేలా చేసింది. సాక్షి కడప: కడపలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న హిందూ శ్మశాన వాటికలో జయమ్మ కాపరిగా ఉంటోంది. ఈమెతోపాటు పాతికేళ్ల కిందట దొరికిన మస్తాన్‌ను కూడా ఆమె పోషిస్తోంది. మస్తాన్ మానసిక వికలాంగుడు.కాళ్లు కదపలేక...చేతులు ఎత్తలేక...మాటలు సక్రమంగా రాక నరకయాతన అనుభవిస్తున్నాడు.ఇతని ఆలనాపాలనా కూడా జయమ్మే చూస్తూ శ్మశానంలోని సత్రంలో జీవనం సాగిస్తున్నారు. వీరికి సంబంధించి గతంలో కుమార్తె వద్ద ఉన్నప్పుడు రేషన్‌కార్డు ఉన్నా చాలా ఏళ్ల క్రితమే తొలగిపోయింది. దీంతో ఎలాంటి పెన్షన్ అందలేదు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో కలెక్టర్ హరికిరణ్ స్పందించారు. కిందిస్థాయి అధికారులను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీంతో సచివాలయ వలంటీర్, మరికొంతమంది సిబ్బంది నేరుగా శ్మశాన వాటికకు వెళ్లి వివరాలు నమోదు చేశారు. జయమ్మ, మస్తాన్ల ఫొటోలను తీసుకుని ప్రభుత్వ పథకాలు అందని వైనంపై వివరాలను సేకరించారు. రేషన్‌కార్డు, పెన్షన్లకు చర్యలు ప్రస్తుతం శ్మశానంలో నివాసముంటున్న జయమ్మ, మస్తాన్‌లకు కొత్త రేషన్‌కార్డును వారం రోజుల్లోగా అందించాలని కలెక్టర్ ఆదేశించారు.అంతేకాకుండా జయమ్మకు ఒంటరి మహిళ కింద, మస్తాన్‌కు కూడా దివ్యాంగుల కోటాలో పెన్షన్ అందించేందుకు సచివాలయం ద్వారా దరఖాస్తులను పంపించారు. సాక్షిలో ప్రచురితమైన కథనంతో మరుభూమిలో నివాసముంటున్న కుటుంబానికి అధికార యంత్రాంగం అండగా నిలవడంపై పలువురు అభినందనలు తెలియజేశారు. -
జంతువులకూ దహనవాటికలు
సాక్షి, సిటీబ్యూరో: జంతు కళేబరాలను నగరంలో ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుండడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. నగరంలో జంతువుల దహనక్రియలకు ఎలాంటి సదుపాయాల్లేవు. కుక్కలతో సహా పలు రకాల జంతువులు మరణించినప్పుడు వాటిని శాస్త్రీయంగా అంతం చేసే సదుపాయాల్లేవు. దీంతో జంతు కళేబరాల దుర్గంధంతో పరిసరాల ప్రజలు అల్లాడుతున్నారు. అంతే కాకుండా తాము ప్రాణప్రదంగా పెంచుకున్న జంతువుల అంత్యక్రియలకూ తగిన సదుపాయాలుండాలని శునక ప్రేమికులు, జంతువుల దహనానికి శాస్త్రీయ పద్ధతులుండాలని సామాజికవేత్తల నుంచి ఎంతో కాలంగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో విగతజీవులైన జంతువులను శాస్త్రీయ పద్ధతిలో దహనం చేయడానికి మూడు ప్రాంతాల్లో జంతు శ్మశానవాటికల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇందుకుగాను విద్యుత్ దహనవాటికలు ఏర్పాటు చేయాలనుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఆయా నగరాల్లోని విద్యుత్ దహనవాటికల తీరును పరిశీలించారు. ఈ నేపథ్యంలో గ్యాస్ ఆధారిత దహనవాటికలతో పాటు బ్లాక్ హోల్ టెక్నాలజీతో మంచి ఫలితాలుంటాయని కొన్ని ఏజెన్సీలు జీహెచ్ఎంసీని సంప్రదించాయి. ప్లాస్మా టెక్నాలజీతో తాము ఏర్పాటు చేస్తామని, అది అన్ని విధాలా మేలైనదని మరో ఏజెన్సీ ముందుకొచ్చింది. బ్లాక్‌హోల్ టెక్నాలజీలో మ్యాగ్నటిక్ పవర్‌తో కాలుస్తారని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీవీ కృష్ణారావు తెలిపారు. వ్యర్థాల్లోని ప్లాస్టిక్ బాటిళ్లు తదితరమైన వాటిని కాల్చడం ద్వారా వెలువడే ద్రావణాలు, వ్యర్థాల నుంచి వెలువడే ఆయిల్స్ తదితరమైన వాటితో మండించడం ప్లాస్మా టెక్నాలజీలో ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఏ టెక్నాలజీతో మేలైన ఫలితాలుంటే ఆ టెక్నాలజీని వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ భావించింది. అందుకుగాను తమను సంప్రదించిన ఏజెన్సీలే కాకుండా పేరెన్నికగన్న ఏ ఏజెన్సీ అయినా వాటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్(ఆర్ఎఫ్క్యూ)లను ఆహ్వానించింది. నగరంలో నిత్యం మృతి చెందుతున్న జంతువులను పరిగణనలోకి తీసుకొని మొత్తం మూడు ప్రాంతాల్లో 10 టన్నుల మేర మృత కళేబరాలను శాస్త్రీయంగా దహనం చేసేందుకు రూ.3.82 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ఎఫ్క్యూలను ఆహ్వానించింది. ఈ దహనవాటికలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) నిబంధనల కనుగుణంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దహనక్రియల అనంతరం వెలువడే బూడిద తదితరమైన వాటిని సైతం ల్యాబ్‌లలో పరీక్షిస్తారు. తొలుత మూడు ప్రాంతాల్లో... జీహెచ్ఎంసీలో తొలి దశలో నాలుగుదిక్కులా నాలుగు జంతు దహన వాటికలను ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ, తొలుత మూడు చోట్ల మాత్రం ఏర్పాటు చేసేందుకు ఆర్ఎఫ్క్యూ(టెండరు) ఆహ్వానించారు. జవహర్‌నగర్, గాజులరామారం, ఫతుల్లాగూడల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం జంతువుల మృత కళేబరాలను జవహర్‌నగర్, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో పూడ్చివేస్తున్నారు. దీంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రీయంగా జంతువుల మృత కళేబరాలను దహనం చేసేందుకు అన్ని విధాలా అర్హతలున్న ఏజెన్సీని జీహెచ్ఎంసీ ఎంపిక చేయనుంది. 10 టన్నుల సామర్థ్యంతో... నగరంలో నిత్యం మృతి చెందుతున్న జంతువుల్లో 20 వరకు ఎద్దులు, ఆవులు, బర్రెలు వంటి పెద్ద జంతువులుంటున్నాయి. కుక్కలు తదితర చిన్న జంతువులు దాదాపు 60 వరకు ఉంటున్నట్లు అంచనా. వీటిల్లో పెద్ద జంతువులు ఒక్కొక్కటి దాదాపు 400 కేజీలు, చిన్నవి దాదాపు 20 కేజీలు ఉంటాయని అంచనా. ప్రస్తుతం నగరంలో రోజుకు సగటున దాదాపు 9టన్నుల బరువైన మృత కళేబరాల్ని తరలిస్తున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మూడు చోట్లా వెరసి రోజుకు 10టన్నుల మేర దహనం చేయగల సామర్ధ్యం ఉండేలా ఏర్పాటుకు టెండరును ఆహ్వానించారు. నిర్వహణ ఇలా.. ♦ లొకేషన్‌తో సహ మృతకళేబరం ఎక్కడ ఉందో తెలియగానే టోకెన్ నెంబర్ కేటాయిస్తారు. ♦ సంబంధిత క్షేత్రస్థాయి జీహెచ్ఎంసీ సిబ్బంది కి సమాచారం చేరవేస్తారు. ♦ జంతువులను తరలించే వాహనం అక్కడకు చేరుకుంటుంది. వీటికి జీపీఎస్ అమర్చుతారు. ♦ మృతకళేబరంతో వాహనం శ్మశానవాటికకు చేరుకుంటుంది. ♦ దహన క్రియలు పూర్తి చేస్తారు. విషయాన్ని నమోదు చేసి టోకెన్ పరిష్కారమైనట్లు పేర్కొంటారు. జోన్ల వారీగా మృతకళేబరాలు (బరువు కిలోల్లో) జోన్ పెద్ద జంతువులు చిన్నవి మొత్తం బరువు వెస్ట్‌జోన్ 400 120 520 నార్త్‌జోన్ 800 220 1020 సెంట్రల్‌జోన్ 1600 300 1900 ఈస్ట్‌జోన్ 1200 300 1500 సౌత్‌జోన్ 4000 200 4200 మొత్తం 8000 1140 9140 -
అలజడి రేపుతున్న ఆకతాయిలు
♦ అక్టోబర్ 30వ తేదీ అశోక్‌నగర్ శివారులోని ముస్లింల శ్మశానవాటికలో వందలాది సంఖ్యలో సమాధుల బోర్డులను పగులగొట్టారు. ♦ అంతకు ముందుకు రోజు సైఫుల్లా బ్రిడ్జిపై పూలకుండీలు, తొట్టెలు ధ్వంసం చేశారు. దీనిపై పలువురు కార్పొరేటర్లు త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయినా ఇంతవరకూ నిందితులను పోలీసులు గుర్తించకపోవడం గమనార్హం. అనంతపురం సెంట్రల్: అనంతపురం నగరంలో ఆకతాయిలు అలజడి సృష్టిస్తున్నారు. అర్ధరాత్రి వరకు తాగి తందనాలు ఆడటమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. రాత్రి వేళ పోలీసుల గస్తీ నిద్రావస్థలో ఉండటం వల్లే వీరి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా యువతలో చాలా మంది పెడదారి పడుతున్నారు. తమ కుమారులు ఏమి చేస్తున్నారో కూడా కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అతిగారాబంతో రూ.లక్షలు విలువజేసే రాయల్ ఎన్ఫీల్డ్ తదితర అధునాతన ద్విచక్రవాహనాలను కొనిస్తున్నారు. పాకెట్ మనీ కోసం రూ. వందలు, వేలు ఇస్తున్నారు. ఇంకేముంది అర్ధరాత్రి వరకు ఇళ్లకు వెళ్లకుండా స్నేహితులతో కలిసి షికార్లు కొడుతున్నారు. పూటుగా మద్యం తాగి చిందులేస్తున్నారు. వారిలో వారే కొట్టుకొని పోలీసుస్టేషన్ల వరకు వెళ్తున్నారు. కొంతమంది చిల్లర ఘటనలపై పోలీస్స్టేషన్ల వరకు ఎందుకని నేరుగా ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ఆ బైక్‌ల శబ్దం వింటే గుండె గుబేల్.. పెడదారిన పెట్టిన యువకుల్లో ఎక్కువశాతం రూ. లక్షలు విలువజేసే ద్విచక్రవాహనాలను నడుపుతున్నారు. వీటికి పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేలా హారన్లు, సైలెన్సర్లు ఏర్పాటు చేసుకొని నగరంలో చక్కర్లు కొడుతున్నారు. ద్విచక్రవాహనం దగ్గరకు సమీపించిన తర్వాత భారీ శబ్దాలు వస్తుండడంతో సామాన్యులు అదురుకుంటున్నారు. ఓ మోస్తారు బాంబులు పేలినంతగా శబ్దాలు వస్తున్నాయి. అయితే ఇలాంటి వారిపై పోలీసుల నిఘా పూర్తిగా కొరవడిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అర్దరాత్రి వరకూ బార్లు ఉండడం, ఆపై హోటల్స్ కూడా నడస్తుండడం వలన వీరి ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. ఎంత సేపూ రోడ్డుపై తాగిన వ్యక్తులు ఎవరొస్తారా అని ఎదురు చూడడం తప్ప ఆకతాయిల అడ్డాలపై పోలీసులు నిఘా సారించడం లేదు. అతివేగంతో నగరంలో దూసుకుపోతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆకతాయిలను పట్టుకోవాలనే ఆలోచన కూడా వారికి పెద్దగా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆకతాయిలకు ముకుతాడు వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
శవాన్ని కూడా వదలని ఘరాన కిలాడి దొంగ
టెక్సాస్: అమెరికాలో ఓ మహిళా దొంగ మృతదేహాన్ని దోచుకుంది. అంత్యక్రియలకు తీసుకొచ్చిన ఓ 88 ఏళ్ల మహిళ మృతదేహం చేతికి ఉన్న బంగారపు ఉంగరాలను గుట్టుచప్పుడుకాకుండా దొంగిలించి కారులో పారిపోయింది. అయితే, ఆ దొంగతనం దృశ్యం మాత్రం దహన సంస్కారాలు పూర్తి చేసే భవనంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీని ప్రకారం పశ్చిమ టెక్సాస్ లోని ఒడెస్సాలో 88 ఏళ్ల మహిళ చనిపోయింది. అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని పెట్టెలో పెట్టి స్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఆ కార్యక్రమాలు పూర్తి చేసే భవనంలో పెట్టి వెళ్లారు. వారికి తెలియకుండానే వెనుక వచ్చిన ఓ మహిళ ఎవరూ లేనిది చూసి ఆ పెట్టెను తెరిచి ఆ మృతదేహం చేతి వేలి ఉంగరాలను దొంగిలించుకొని పారిపోయింది. తర్వాత వచ్చి చూసి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళను గుర్తించేందుకు ఫొటోలు, వీడియో విడుదల చేశారు. ఆ మహిళను తాము ఇంతవరకు చూడలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.