హరిశ్చంద్ర ఘాట్‌లో చనిపోయిన వారి కోసం కట్టెలు పేరుస్తున్న కాటికాపరి ద్వారకానాథ్
ప్రపంచమంతా కరోనాతో చిగురుటాకులా వణికిపోతోంది. ఈ మాయదారి వైరస్ మన జిల్లాలోనూ కోరలు చాస్తోంది. ఎందరినో కబళిస్తోంది. ఎన్నో కుటుంబాలను దిక్కులేని వారిని చేస్తోంది. సాటి మనిషికి సాయం చేయాల్సిన ఈ విపత్కర పరిస్థితుల్లో కొన్ని శ్మశాన వాటికల నిర్వాహకులు, కమిటీ సభ్యులు డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎవరైనా చనిపోతే కాసులకే ప్రాధాన్యమిస్తూ కాల్చుకుతింటున్నారు. అంత్యక్రియల నిర్వహణకు రూ.వేలల్లో డిమాండ్ చేస్తూ మానవత్వానికి సమాధి కడుతున్నారు.
♦ అనంతపురంలోని కోవూరునగర్‌కు చెందిన ఓ వృద్ధుడు రెండ్రోజుల కిందట మరణించారు. ఆయనది సాధారణ మరణమే. అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. శ్మశాన వాటిక నిర్వాహకులతో పాటు కమిటీ సభ్యుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తే.. వారు రూ.లక్ష డిమాండ్ చేశారు. చివరకు వారిని బతిమలాడి రూ.80 వేలకు ఒప్పందం కుదిరాక గానీ అంత్యక్రియలు చేయలేకపోయారు.
♦ కొన్ని వారాల కిందట ఆర్యవైశ్య సంఘానికి చెందిన ప్రముఖుడు కరోనాతో మరణిస్తే దహన సంస్కారాలకు ఏకంగా రూ.లక్ష వరకూ వసూలు చేశారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరిగినట్లు బంధువులు వాపోయారు. ఈ రెండు ఘటనలు ప్రస్తుత పరిస్థితికి, మనుషుల్లో దిగజారి పోతున్న విలువలకు అద్దం పడుతున్నాయి.
అనంతపురం సిటీ : బతికుండగా నరకం చూపుతున్న కరోనా మహమ్మారి.. మనిషి చచ్చాక కూడా అంత్యక్రియలపై ప్రభావం చూపుతోంది. కరోనా కలకలం నేపథ్యంలో ప్రస్తుతం ఏ మతం వారు చనిపోయినా వారి అంత్యక్రియలు నిర్వహించడం కుటుంబీకులకు కష్టంగా మారింది. సాధారణ మరణమే అయినా శ్మశాన వాటికి అభివృద్ధి కమిటీ సభ్యులు, నిర్వాహకులు, కాటి కాపరులు కష్టసమయంలోనూ కాసులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దహన సంస్కారాలకు వేలల్లో డిమాండ్ చేస్తున్నారు.
కాసులకు కక్కుర్తి
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఎందరినో కబళిస్తోంది. గత ఏడాదితో పోల్చితే లాక్‌డౌన్ విధించిన మార్చి–25 నుంచి మరణాల సంఖ్య క్రమంగా పెరిగిందని రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. 2019–20 సంవత్సరంలో అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో చేరి 2,194 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 109 మంది మరణించగా, మే నెలలో 211 మంది, జూన్‌లో 163 మంది, ఈ నెల 13 నాటికి 85 మంది మరణించినట్లు ఆస్పత్రి రికార్డుల్లో నమోదయ్యాయి. అదే అనంతపురం నగర పాలక సంస్థలోని రికార్డుల ప్రక్రారం.. 2019 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు 1,205 మంది మరణించినట్లు వెల్లడైంది. ఈ ఏడాది జనవరిలో 132 మంది, ఫిబ్రవరిలో 64 మంది చనిపోయారు. మార్చిలో 50 మంది, ఏప్రిల్‌లో 43 మంది, మేలో 69 మంది, జూన్‌లో 105 మంది, ఈ నెల 13 వరకు 25 మంది చనిపోయినట్లు రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే వీటి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరు ఏ విధంగా చనిపోయినా... కొన్ని శ్మశానాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు అంత్యక్రియల ఖర్చు పేరుతో ఇష్టారాజ్యంగా గుంజుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అంత్యక్రియల ఖర్చు ఎవరికీ పట్టదా?
అంత్యక్రియలకు కొన్ని మత, కుల సంఘాల వారు తమకు ఇష్టమొచ్చిన రీతిలో డబ్బులు గుంజుతున్నా.. నియంత్రించే వారే లేకుండాపోయారు. నగరంలోని చాలా శ్మశాన వాటికల్లో అంత్యక్రియలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరినడిగినా రూ. 2 వేలు లేదా రూ.3 వేలు అని మాత్రమే చెబుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంతో కమిటీ పెద్దల ముసుగులో కొందరు బరితెగిస్తున్నారు. మనిషిని పోగొట్టుకున్న బాధలో ఉన్న వారిని మరింత శోకంలోకి నెట్టేస్తున్నారు. కరోనా నేపథ్యంలో చేసేందుకు పని లేక, ఆదాయ మార్గాలు కాన రాక.. దిక్కులు చూస్తున్న వేళ.. కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఇక వారి సంగతి దేవుడికెరుక. వీటిపై యంత్రాంగం దృష్టి సారించాలని జనం కోరుతున్నారు. కోరారు.
మనుషుల్లేరంటూ.. మనీ బేరం
అనంతపురంలోని పాత ఊరు(గుత్తి రోడ్డు)లోని ఓ శ్మశాన వాటికను ఓ కుల సంఘానికి అనుబంధంగా నిర్వహిస్తున్నారు. సదరు సంఘం కార్యాలయానికి వెళ్తే అక్కడ ఓ పే..ద్ద బ్యానర్ కనిపిస్తుంది. అందులో ‘దహన వాటికలో పార్థివ దేహాలు దహనం చేసేందుకు సిబ్బంది లేని కారణంగా దహన వాటిక తాత్కాలికంగా నిలిపివేయడమైనది’ అంటూ పాలక వర్గం, సంఘం పేరు బ్యానర్ కనిపిస్తుంది. దీంతో మనిషి పోయిన బాధకంటే.. బ్యానర్‌లోని అంశమే బాధిత కుటుంబీకులను కుంగదీస్తోంది. కానీ దహన సంస్కారానికి సిబ్బంది లేరని బ్యానర్ వేసిన పెద్దలు, నిర్వాహకులే.. మళ్లీ ఆ తంతు పూర్తి చేస్తున్నారు. దీని వెనుక మనీ బేరం భారీగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కాస్త ఖర్చు ఎక్కువే
కరోనాతో చనిపోయే వారికంటే దానికి భయపడి చనిపోతున్న వారిలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణ మరణమైతే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు 20 మందిని అనుమతిస్తాం. కానీ కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, ఇతరులెవరూ రావడం లేదు. దీంతో జేసీబీతో పది అడుగుల మేర గుంత తీసి మృతదేహాలను పూడ్చిపెడుతున్నాం. కరోనాతో చనిపోయిన వారికైతే ప్రత్యేక దుస్తులు, మాస్క్, శానిటైజర్ వాడాలి. అందుకు కొంచెం ఎక్కువ ఖర్చు వస్తోంది.– బాబావలి, కేర్ టేకర్,జామియా మస్జీద్ అనుబంధ నూరానీ కబరస్తాన్
రూ.5 వేలు తీసుకుంటాం
ఒక్కో వ్యక్తి అంత్యక్రియలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటాం. ఇదే వృత్తిపై ఆధారపడి 10 కుటుంబాల వారం బతుకుతున్నాం. మాకు మరే మార్గం లేదు. గతంలో నెలకు 10 నుంచి 12 కేసులు వచ్చేవి. ఈ మూడు నెలలుగా వాటి సంఖ్య కొంచెం పెరిగింది. డబ్బులు ఇంతే ఇవ్వాలంటూ ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు. ఆర్థికంగా ఉన్నవారైతే రూ.2 వేల నుంచి రూ. 3 వేలు ఎక్కువగా ఇస్తారు. పేదోళ్లయితే ఎంతిచ్చినా తీసుకుంటున్నాం. అనాథ మృతదేహాలను ఉచితంగానే పూడ్చిపెడుతున్నాం. – కుళ్లాయప్ప, హిందూ శ్మశాన వాటిక కాటి కాపరి,జేఎన్‌టీయూ రోడ్డు
సహకరించే వారేరీ
కరోనాకు ముందు రోజుల్లో ఎవరైనా మృత్యువాత పడితే.. అరగంటలో వైకుంఠ రథాలు ఇంటి ముందుకు వచ్చేవి. కానీ ఇప్పుడు వారు కూడా కాఠినంగా మారిపోయారు. కరోనా భయంతో వైకుంఠ రథం రావడం కష్టసాధ్యమైపోయింది. ఇక శ్మశాన వాటికల ప్రతినిధులయితే కరోనా లేదని సర్టిఫికెట్ తెచ్చి ఇవ్వాలని డిమాండు చేస్తున్నారు. ఇన్ని చేసినా అక్కడ పనిచేసే కాటి కాపర్లు సహకారమందించకపోవడంతో ఎక్కువ మొత్తాన్ని ఇచ్చి ప్రయివేటు వ్యక్తులతో అంత్యక్రియలు జరిపించుకుంటున్నారు. ఇక కరోనా ప్రభావంతో చనిపోతున్న వారు దహన సంస్కారాల కోసం పడే ఇబ్బందులు గ్రహించిన కొందరు స్వార్థపరులు దానిని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఇటీవల ఓ వృద్ధురాలి వంటిపై ఉన్న నగలు కూడా కాజేసిన సంఘటన చర్చనీయాంశంగా మరింది. కరోనా లక్షణాలు లేకుండా మరణించినా అంతిమ సంస్కారాలు చేసేందుకు రూ.40 వేలు డిమాండు చేస్తున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
♦ కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి అమలు పరిచే బాధ్యత స్థానిక అధికారులపై ఉంచింది.
♦ ఎవరైనా చనిపోతే మృతదేహం వద్ద ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలి.
♦ అంత్యక్రియలకు హాజరైనా వారు కూడా చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ విధిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి.
♦ 20 మంది కంటే ఎక్కువ సంఖ్యలో జనం హాజరు కాకుండా చూడాలి. వారంతా కోవిడ్ నిబంధనలన్నీ పాటించేలా చర్యలు తీసుకోవాలి.
♦ ఎవరైనా కరోనాతో మరణిస్తే వారిని ఖననం చేయాల్సి ఉంటుంది. ఇందుకు పది నుంచి పదిహేను అడుగుల మేర గుంత తీయాలని కరోనా మృతుల అంత్యక్రియల మార్గదర్శకాలు చెబుతున్నాయి.
జరుగుతున్నదేమిటంటే..
♦ నిబంధనలకంటే ఎక్కువ మంది హాజరవుతున్నా నిలువరించలేకపోవడం.
♦ మాస్క్‌లు, శానిటైజర్లు కొందరు వాడకపోయినా... కమిటీ సభ్యులు గానీ, శ్మశాన నిర్వాహకులు గానీ పట్టించుకోకపోవడం.
♦ భౌతిక దూరం పాటించకపోయినా.. వదిలేయడం వంటి అంశాలు అనేక సమస్యలను సృష్టిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment