హామీ ప్రకారం గ్యారంటీల అమలు | Komatireddy Venkat Reddy Comments on BRS | Sakshi
Sakshi News home page

హామీ ప్రకారం గ్యారంటీల అమలు

Published Mon, Mar 4 2024 4:32 AM | Last Updated on Mon, Mar 4 2024 4:32 AM

Komatireddy Venkat Reddy Comments on BRS - Sakshi

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

పదేళ్లలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదు 

అలాంటి పార్టీ నాయకులు మాపై విమర్శలు చేయడం విడ్డూరం

నల్లగొండ: కాంగ్రెస్‌ ప్రభుత్వ గృహజ్యోతి పథకం ఫేమస్‌ అని, కేసీఆర్‌ ప్రభుత్వ 24 గంటల కరెంట్‌ మొత్తం బోగస్‌ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన నల్లగొండలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు. ఇ చ్చిన హామీ ప్రకారం 90 రోజుల్లోపే నాలుగు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తున్నామన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ధ్వజమెత్తారు. పదేళ్ల కాలంలో ఒక్క రేషన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వని బీఆర్‌ఎస్‌.. నేతలు నేడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 25 వేల మంది నిరుద్యోగులకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చామని, డీఎస్సీ, గ్రూప్‌–1 నోటిఫికేషన్లు ఇచ్చామని వివరించారు. రాబోయే రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేసి నల్లగొండ జిల్లాకు తాగు, సాగు నీటి కష్టాలు లేకుండా చేస్తామన్నారు. 

11 నుంచి ఇందిరమ్మ ఇళ్లు.. 
ఈనెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని.. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వమే మామిల్లగూడెంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు. రూ. వేల కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని తెలిపారు.  

బైక్‌ నడిపిన మంత్రి కోమటిరెడ్డి.. 
నల్లగొండలో ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా బైక్‌ నడిపి హల్‌చల్‌ చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని బైక్‌పై ఎక్కించుకుని పట్టణంలోని పలు వార్డుల్లో తిరిగారు. హైదర్‌ఖాన్‌గూడ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో కలెక్టర్‌ హరిచందనతో కలసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన తిప్పర్తి మండలం మర్రిగూడ, కనగల్‌ మండలాల్లోని పలువురు గృహజ్యోతి లబి్ధదారుల ఇళ్లకు వెళ్లి బిల్లుల గురించి అడిగి తెలుసుకున్నారు.  

కేటీఆర్‌ బచ్చా.. ఆయనతో పోటీ ఏంటి! 
‘కేటీఆర్‌ ఒక బచ్చా.. ఆయన తండ్రి చాటు కొడుకు. ఆయనతో నాకు, సీఎం రేవంత్‌కు పోటీ ఏంటి’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి నల్లగొండ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా.. కేటీఆర్‌పై పోటీ చేస్తున్నారా? అని మీడియా అడగ్గా పైవిధంగా స్పందించారు. ‘కేటీఆర్‌.. కేసీఆర్‌ సీఎం అయి, టికెట్‌ ఇస్తే అమెరికా నుంచి వచ్చి ఎమ్మెల్యే అయిండు. మా లెక్క కష్టపడి రాలేదు’అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జెడ్పీటీసీగా ఇండిపెండెంట్‌గా గెలిచి అక్కడ నుంచి ఎమ్మెల్యే, ఎంఎల్‌సీగా, ఎంపీగా అయి, ముఖ్యమంత్రి వరకు ఎదిగారన్నారు. తాను కూడా ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో కొట్లాడి ఎమ్మెల్యే అయ్యానని, తమది వ్యవసాయ కుటుంబమని.. కేటీఆర్‌ తండ్రి వ్యవసాయం చేయడం లేదని స్పష్టం చేశారు. అలాంటి బచ్చాతో మాకు పోటీయా? అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ టికెట్ల విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని, నల్లగొండ, భువనగిరిలో తమ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థులే మోదీ కంటే అత్యధిక మెజారీ్టతో విజయం సాధిస్తారని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement