నల్లగొండపై విషం చిమ్ముతున్న బీఆర్‌ఎస్‌ | Komati Reddy Venkat Reddy fires on brs | Sakshi
Sakshi News home page

నల్లగొండపై విషం చిమ్ముతున్న బీఆర్‌ఎస్‌

Published Wed, Oct 2 2024 4:48 AM | Last Updated on Wed, Oct 2 2024 4:48 AM

Komati Reddy Venkat Reddy fires on brs

కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకుజిల్లా ప్రజలంటే ఎందుకు అంత కోపం? 

వీరిలో ఎవరైనా ఒకరు మూసీ ఒడ్డున నెలరోజులు ఉంటే తెలుస్తుంది

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేతలు నల్లగొండ జిల్లాపై విషం చిమ్ముతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మాది బుల్డోజర్‌ పాలన కాదు.. ప్రజాపాలన. మూసీ సుందరీకరణతోపాటు శుద్ధీకరణ చేస్తున్నాం. నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌ ప్రజలు నరకయాతన పడుతుంటే.. కేసీఆర్‌ కుటుంబసభ్యులు రాక్షసానందం పొందుతున్నారు. నల్లగొండ జిల్లా పోరాటాల గడ్డ. రజాకార్లు, సీమాంధ్రులతో పోరాడినట్టే మూసీ వ్యతిరేకులతో పోరాడాల్సి వస్తోంది. 

ఈసారి అసెంబ్లీకి కేసీఆర్‌ వస్తే నల్లగొండ సమస్యలపై నిలదీస్తాం. మూసీ ప్రక్షాళన పేరుతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, కాంగ్రెస్‌ శాసన సభ్యుడిని చైర్మన్‌ చేసిన కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. నేను రెండు దశాబ్దాలుగా ఫ్లోరైడ్, మూసీ శుద్ధీకరణ మీద పోరాటం చేస్తున్నా. ప్రధానితోపాటు కేంద్రంలో ఎందరో మంత్రులను కలిసి మూసీ శుదీ్ధకరణకు నిధులు కేటాయించాలని వినతులు ఇచ్చా. వారు మూసీ బాధితులను తెలంగాణభవన్‌కు పిలిపించుకొని జనతా గ్యారేజీ అని సోషల్‌ మీడియాలో తిప్పుకుంటున్నారు. 

మీది జనతా గ్యారేజ్‌ కాదు.. జనాన్ని ముంచే గ్యారేజీ, జనాల్ని వంచించే గ్యారేజీ.. అందుకే మీ కారు గ్యారేజీకి పరిమితమైంది’అని ఆరోపించారు. ‘నల్లగొండ ఫ్లోరైడ్‌ కష్టం చెప్పుకుంటే తీరేది కాదు..ఇక్కడ భూగర్భ జలాలను కాకుండా భూఉపరితలంపై ప్రవహించే జలాలను మాత్రమే శుద్ధి చేసి వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర జలశక్తి సంస్థ చెప్పింది. కానీ గత ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. ఇది అత్యంత బాధాకరం. 

ఉమ్మడి ఏపీలోనే తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే.. ఈ పదేళ్లలోనూ నల్లగొండకు తీరని అన్యాయం జరిగింది. మూసీ పరీవాహక ప్రాంత పరిధిలో వివిధ కంపెనీలు రసాయన వ్యర్థాలను వదిలిపెడుతుండటంతో నది అంతా కాలుష్యంగా మారి నల్లగొండ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది’అని కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.  

నిరాశ్రయులయ్యే వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది 
మూసీ శుద్ధిపేరు చెప్పి రూ.వెయ్యి కోట్లు మింగిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు నీతులు చెబుతోందని కోమటిరెడ్డి విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులలో ఒకరు మూసీనది ఒడ్డున నెల రోజుల పాటు నివాసం ఉంటే.. ఆ బాధ ఏంటో తెలుస్తుందన్నారు. మూసీ కాలకూట విషం మీద వాస్తవాలు కావాలనుకుంటే.. సీఎం కేసీఆర్‌కు ఓఎస్డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్‌ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఆమె ఇటీవల మూసీపై పీహెచ్‌డీ చేసిందన్నారు. 

మూసీ అంటే.. ఒకప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు జీవనాడి, కానీ ఇప్పుడు మూసీ అంటే ఓ విషమని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు కమిటీ వేస్తామని, అందులో బీఆర్‌ఎస్‌ నేతలకు కూడా చోటు కలి్పస్తామన్నారు. ఎస్టీపీలు కట్టామని ప్రచారం చేస్తున్నారు.. కానీ కేవలం ప్రతిపాదనలు మాత్రమే తయారు చేసి కాలక్షేపం చేశారని చెప్పారు. అగ్గిపెట్టె హరీశ్‌రావు మళ్లీ రెచ్చగొట్టే పనులకు దిగుతున్నాడని ఆరోపించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement