గ్రామాల్లో రైస్ కార్డు వివరాలను ఈకేవైసీ చేస్తున్న వలంటీర్
కాకినాడ సిటీ: గతంలో రైస్‌కార్డు (రేషన్‌కార్డు) పొందాలన్నా, అందులో తప్పొప్పులను సరి చేసుకోవాలన్నా పెద్ద ప్రహసనంగా ఉండేది. పనులు మానుకుని ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. నెలలు గడిచినా సమస్య పరిష్కారమయ్యేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జిల్లాలో నవశకం సర్వే ఆధారంగా కొత్త బియ్యం కార్డులను పంపిణీ చేశారు. ఆ కార్డుల్లో ప్రింటింగ్ తప్పొప్పులను సరి చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా సాగుతోంది. ఇళ్లకు వచ్చే వలంటీర్లకు ప్రజలు సరైన సమాచారాన్ని ఇస్తే ప్రత్యేక యాప్ ద్వారా తప్పొప్పులను సరి చేస్తున్నారు.
41.08 లక్షల మంది వివరాలు నమోదు చేయాలి
జిల్లాలో 14,67,777 కుటుంబాలకు రైస్ కార్డులు అందజేశారు. వాటిలో దాదాపు 41,08,299 మందికి ఈకేవైసీ (ఎలాక్ట్రానిక్ నో యువర్ క్లయింట్) వివరాలు నమోదు చేయాలి. ప్రతి ఒక్కరి ఈకేవైసీ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వలంటీర్లు వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఈకేవైసీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 9,51,702 కుటుంబాలకు చెందిన 21,54,158 మంది వివరాలు సేకరించారు. మిగిలిన 5,16,070 కుటుంబాలకు సంబంధించి 19,54,141 మంది ఈకేవైసీని తీసుకోనేందుకు వలంటీర్లు సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం అందజేసిన 14,67,777 కార్డుల్లో చాలా వరకు కుటుంబ పెద్ద (కార్డు హోల్డర్), కార్డులోని ఇతరుల సంబంధాలు తికమకగా ఉన్నాయి. వీటిని సరి చేస్తున్నారు. కొన్ని కార్డుల్లో సంబంధం లేని వారి పేర్లు ఉండడంతో తొలగింపు, చేర్పుల ప్రక్రియ మొదలైంది. తొలగింపు విషయంలో కేవలం మృతుల పేర్లు, కుటుంబానికి సంబంధం లేని వ్యక్తుల వివరాలను తొలగిస్తున్నారు. చేర్పులు విషయంలో కొత్తగా పెళ్లయిన కోడళ్లు, ఏ కార్డులోనూ లేని వారిని వారి కుటుంబానికి ఉండే కార్డులో చేర్చుతారు.
కొత్తగా 49,791 రైస్ కార్డులు
జిల్లాలో కొత్తగా బియ్యం కార్డు కోసం ‘స్పందన’లో దరఖాస్తు చేసుకున్న వారిలో 49,791 మంది రేషన్‌కార్డుల పొందేందుకు అర్హత పొందారు. వీరు ఇప్పటి వరకు ఎలాంటి రేషన్ కార్డు పొందలేదు. వీరికి కొత్తగా కార్డులు మంజూరు చేసే ప్రక్రియ మొదలైంది. కార్డు మంజూరు ఉత్తర్వులు రావడంతో ఆధార్ కార్డు ఆధారంగా రేషన్ సరుకులను ఇప్పటికే వీరు పొందుతున్నారు.
పెండింగ్‌లో ఆధార్ సీడింగ్
రేషన్‌కార్డులోని ప్రతి సభ్యుడి ఆధార్ వివరాలు అందులో ఉన్నాయి. అయితే కొంతమందికి సంబంధించి తప్పుడు ఆధార్ నంబర్లు ప్రింట్ కావడంతో తీవ్ర ఇబ్బంది నెలకొంది. దీంతో వారికి రేషన్ అందడంలేదు. అయితే ఆధార్ సీడింగ్ తప్పొప్పులను సరి చేయడాన్ని ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచారు. త్వరలోనే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయని అంటున్నారు.
వలంటీర్లే వివరాలు సరి చేస్తారు
కొన్ని కార్డుల్లో వివరాలు తప్పుగా నమోదయ్యాయి. ముఖ్యంగా కుటుంబ పెద్దతోపాటు ఇతరుల వివరాలు తికమకగా ఉన్నాయి. కొందరికి ఈకేవైసీ లేదు. చనిపోయిన వారి పేర్లు తీసివేయడం, కొత్తగా పెళ్లి అయిన వారు, కార్డుల్లో లేని వారిని చేర్చడం తదితర వివరాలను వలంటీర్ల ద్వారా ప్రత్యేక యాప్‌తో సర్వే చేయిస్తున్నాం. ఇంటికి వచ్చిన వలంటీర్‌కు సరైన సమాచారం ఇచ్చి తప్పొప్పులను సరి చేసుకోవచ్చు. అర్హత ఉండి కొత్త రేషన్‌కార్డు కావాల్సిన వ్యక్తులు గ్రామ/వార్డు సచివాలయంలోనే దరఖాస్తులు ఇవ్వాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఈకేవైసీ కార్యక్రమం రెండు రోజుల్లో పూర్తి చేయాలని వలంటీర్లకు ఆదేశాలిచ్చాం. ఎంపీడీవోలు/ మున్సిపల్ కమిషనర్లు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరాం.– పి.ప్రసాదరావు,జిల్లా పౌరసరఫరాల అధికారి
Comments
Please login to add a commentAdd a comment