
ఆంజనేయులుకు రేషన్ కార్డు అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ నేత శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది
కొత్తపేట/ఆలమూరు: కేవలం ఒక్క రోజులోనే రేషన్ కార్డు మంజూరు చేసిన సరికొత్త రికార్డు తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలో నమోదైంది. వివరాల్లోకి వెళితే.. మడికి పంచాయతీ సచివాలయం–2 పరిధిలో నివాసం ఉంటున్న కుడిపూడి ఆంజనేయులు, వరలక్ష్మి దంపతులు గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకపోయింది. చివరకు గ్రామ వలంటీర్ సీహెచ్ శివరామకృష్ణను కలవగా.. మంగళవారం గ్రామ సచివాలయానికి తీసుకెళ్లి వివరాలు నమోదు చేయించాడు. దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా తహసీల్దార్ జి.లక్ష్మీపతికి సమర్పించగా.. ఆయన వెంటనే లబ్ధిదారుని అర్హతల్ని గుర్తించి బుధవారం రేషన్ కార్డు మంజూరు చేశారు. దీంతోపాటు అదే గ్రామానికి చెందిన పిల్లి లక్ష్మి అనే ఒంటరి మహిళకు కూడా ఒక్క రోజులోనే రేషన్ కార్డు మంజూరు చేశారు.
గతంలో ఎన్ని అవస్థలో..
► గత ప్రభుత్వ హయాంలో అన్ని అర్హతలున్నా రేషన్ కార్డు రావాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. టీడీపీ నాయకుల్ని ప్రసన్నం చేసుకుంటే తప్ప కార్డు వచ్చేది కాదు.
► వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామ వలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థల్ని తీసుకొచ్చి ప్రజల గుమ్మం వద్దకే అన్ని పథకాలూ అందజేస్తోంది.
► అర్హతలున్న వారు వలంటీర్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే గ్రామ సచివాలయం ద్వారా పది రోజుల్లో కార్డు అందజేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
చాలా ఆనందంగా ఉంది
రేషన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూశాం. అయినా మంజూరు కాని కార్డు కేవలం ఒక్క రోజులో మంజూరు కావడం ఆనందంగా ఉంది. ఇది సీఎం జగన్ పుణ్యం. ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనం.
– ఆంజనేయులు, వరలక్ష్మి, మడికి
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా
రేషన్‌కార్డు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాను. గత ప్రభుత్వ హయాంలో ఆ సభలో ఇస్తాం.. ఈ సభలో ఇస్తాం అన్నారు. చివరకు మొండిచెయ్యి చూపారు. జగన్‌బాబు ముఖ్యమంత్రి అయ్యాక అందరికీ మంచి రోజులొచ్చాయి. ఒకే రోజులో కార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది.
– పిల్లి లక్ష్మి, మడికి
Comments
Please login to add a commentAdd a comment