కొత్త బియ్యం కార్డుకు అర్హతలివే.. | Rice Cards List Available At Village Secretariats | Sakshi
Sakshi News home page

సచివాలయాల్లో కొత్త బియ్యం కార్డుల జాబితా

Published Fri, Dec 20 2019 7:49 AM | Last Updated on Fri, Dec 20 2019 7:59 AM

Rice Cards List Available At Village Secretariats - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అర్హులందరికీ బియ్యం కార్డులు జారీ చేసేందుకు జాబితా సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అర్హుల జాబితాను శుక్రవారం నుంచి మూడ్రోజుల పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచనున్నారు. వైఎస్సార్‌ నవశకంలో భాగంగా ప్రతి పథకానికి వేర్వేరు కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 1.47 కోట్ల తెల్ల రేషన్‌కార్డులతో పాటు అర్హత ఉండి కార్డులేని వారికి ప్రభుత్వం కొత్తగా బియ్యం కార్డులు జారీ చేస్తోంది. వీటిని జనవరిలో అందచేస్తారు. బియ్యం కార్డుల ప్రింటింగ్‌ కోసం నాలుగు రోజుల్లో టెండర్లు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసింది.  

కొత్త బియ్యం కార్డుకు అర్హతలివే.. 
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. 10 వేలు, పట్టణాల్లో రూ. 12 వేలలోపు ఆదాయం ఉన్న వారికి కార్డులు జారీ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. 5 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250 లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్‌ కార్డు అందేది. గతంలో 2.5 ఎకరాల్లోపు మాగాణి లేదా ఐదెకరాల్లోపు మెట్ట ఉన్నవారు రేషన్‌ కార్డుకు అర్హులు కాగా.. ఇప్పుడు మూడెకరాల మాగాణి లేదా పదెకరాల్లోపు మెట్ట ఉన్నవారికి, లేదా రెండూ కలిపి పదెకరాల్లోపు ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తున్నారు. గతంలో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ వినియోగిస్తే అర్హులు కాగా.. ప్రస్తుతం దీనిని 300 యూనిట్లకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రస్తుత ప్రభుత్వం బియ్యం కార్డులు ఇస్తోంది. టీడీపీ హయాంలో ట్యాక్సీలు మినహా 4 చక్రాల వాహనాలు ఏవి ఉన్నా రేషన్‌ కార్డులకు అనర్హులు. ఇప్పుడు ట్యాక్సీతో పాటు ఆటోలు, ట్రాక్టర్లు ఉన్న వారికీ ఈ పథకం వర్తిస్తుంది. బియ్యం కార్డు పొందేందుకు అర్హులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామ, వార్డు వలంటీర్లే ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు స్వీకరించారు.  

అర్హుల పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తాం
అర్హుల పేర్లు జాబితాలో లేకపోతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తాం. దరఖాస్తులు గ్రామ, వార్డు వలంటీర్‌కు లేదా సచివాలయాల్లో ఇస్తే మరోసారి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి అర్హతుంటే కార్డు జారీ చేస్తాం.  
– కోన శశిధర్, ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement