జ్యోతి వెలిగించి సభను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వేదికపై మంత్రులు బోస్, రామచంద్రారెడ్డి, కన్నబాబు, విశ్వరూప్, విప్ రాజా, ఎమ్మెల్యేలు
సాక్షి, కాకినాడ: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. గాంధీ జయంతి రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప గ్రామంలో గ్రామ సచివాలయాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించడం చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ఈ సందర్భంగా కరప జెడ్పీ హైస్కూ ల్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించిన తీరు ప్రజల్లో ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెంచేలా చేసింది. సచివాలయ ప్రారంభోత్స కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం తొలుత పైలాన్, సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సభాస్థలికి చేరే మధ్యలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో సీఎం ఉద్యోగులతో ముచ్చటించారు. ‘మా నాన్న.. దివంగ ముఖ్యమంతి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెలకొల్పిన ట్రిపుల్ ఐటీలో చదువుకున్నారు. నేను ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు పూర్తి పారదర్శకంగా, అంకితభావంతో పనిచేయాలి.
ఏదైనా సమస్యతో సచివాలయానికి వస్తే 72 గంటల్లో పరిష్కరించి వారి మోములో చిరునవ్వులు ఉండేలా చూడాలి తల్లీ, తమ్ముడూ.’ అంటూ తలపై చెయ్యి వేసి ఆప్యాయంగా పలకరిస్తుంటే.. ఉద్యోగులు సంబరపడిపోయారు. ‘ఏం ఉద్యోగం చేస్తున్నావు? ఏ ఊరు మీది? బాగున్నావా తమ్ముడూ, తల్లీ? అని తోడబుట్టిన అన్నగా సీఎం హోదాను పక్కనబెట్టి యోగ క్షేమాలు తెలుసుకోవడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ప్రకృతి వ్యవసాయం, దేశీయ ఆవు మూత్రం, ఆవుపేడ, సేంద్రియ ఎరువుల వినియోగం తదితర లాభాలు, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని సచివాలయ ఉద్యోగులకు సూచిస్తూంటే వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన కనిపిస్తోందని ఉద్యోగులు భావించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు నాణ్యమైన మందులు అందుతున్నాయా? ఆరోగ్య సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయా? గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సేవలు సక్రమంగా అందుతున్నాయా? దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నారా? అనే అంశాలను స్వయంగా సీఎం అడిగి తెలుసుకునే తీరును చూస్తుంటే ప్రజారోగ్యం, పారిశుద్ధ్య నిర్వహణపై ఆయనకు ఉన్న శ్రద్ధ ఆవిష్కృతమవుతోంది. ఇలా ప్రతి శాఖకు సంబంధించిన విషయాలను ఆ శాఖ సిబ్బంది ద్వారా తెలుసుకుని, ప్రజలకు మెరుగైన, అవినీతి రహిత, పారదర్శక, రాజకీయాలకు అతీతంగా సేవలు అందించాలని సూచించిన తీరు ఉద్యోగుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది.
ఆత్మీయ స్వాగతం
సీఎం వైఎస్ జగన్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎంపీలు వంగా గీత, అనురాధ, భరత్‌రామ్, కరప గ్రామ ప్రజలు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఘన స్వాగతం పలికారు. హెలీప్యాడ్ నుంచి గ్రామ సచివాలయం, సభా స్థలి వద్దకు సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సచివాలయ వ్యవస్థను జిల్లాను నుంచి ప్రారంభించడం జిల్లాకే గర్వకారణమని నేతలు అభివర్ణించారు.
అనుకున్న సమయానికే కార్యక్రమం...
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాదిరి ప్రజలను గంటల తరబడి వేచి ఉండేలా చేయడం, సభకు సీఎం ఆలస్యంగా రావడం లాంటి వాటికి స్వస్తి చెప్పారు. సీఎం టూర్‌లో నిర్దేశించిన సమయానికి కచ్చితంగా సభా స్థలికి రావడం, జ్యోతి వెలిగించడం, స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ, మంత్రుల ప్రసంగాలు సైతం క్లుప్తంగా చేయడం చకచకా జరిగిపోయింది. గత ప్రభుత్వంపై బురదజల్లేలా కాకుండా..గతంలో జరిగిన తప్పులు ప్రస్తుత ప్రభుత్వంలో జరగవని చెప్పడం..వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలపై విశ్లేషించారు. కేవలం గంట వ్యవధిలోనే సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.
కరతాళ ధ్వనులు
ఉద్యోగులు, ప్రజల కరతాళ ధ్వనులు, అభిమానుల ఈలల మధ్య కార్యక్రమం ఆద్యంత్యం ఉత్సాహంగా సాగింది. జనవరి నుంచి పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని, 35 శాఖలకు చెందిన 500 రకాల సేవలు కేవలం 72 గంటల్లోనే మీ ముందు ఉంచుతామని సీఎం ప్రకటించడంతో సభా ప్రాంగణంలో ప్రజలు, అభిమానులు పైకి లేచి ఒక్కసారిగా ఈలలు వేశారు. కరతాళ ధ్వనులతో సీఎంను అభినందించారు. ఉద్యోగులంటే ప్రజలపై పెత్తనం చెలాయించడం కాదు.. సేవకులుగా పనిచేయాలని నూతనంగా ఎన్నికైన సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ఏదైనా సమస్యతో ప్రజలు జన్మభూమి కమిటీల వద్దకు వెళ్తే మొట్టమొదటగా ‘నువ్వు ఏ పార్టీకి ఓటు వేశావు’ అని ప్రశ్నించేవారని.. ప్రస్తుతం అలాంటి వాటికి స్వస్తి పలకాలని, పార్టీలకతీతంగా సేవలు అందించి వారి హృదయాలు గెలవాలని ముఖ్యమంత్రి చెబుతుంటే అక్కడున్నవారు ‘అన్న, అక్క, చెల్లెమ్మ, అవ్వ, తాత, నేను మీ బిడ్డను.. నన్ను సేవ చేసే భాగ్యం కల్పించారు. మీకు నేను ఉన్నాను.. అని సంబోధిస్తుంటే తమ సొంత మనిషిగా భావించి చప్పట్లతో అభినందించారు.
సీఎంకు ఎడ్లబండి జ్ఞాపికను బహూకరించిన కన్నబాబు
జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు. జిల్లాలో 60 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. సచివాలయ ప్రారంభోత్సవం తన నియోజకవర్గంలోని కరప కేంద్రంలో జరగడం, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వ్యవసాయశాఖ మంత్రి కూడా అయిన కురసాల కన్నబాబు ఇందుకు సూచికగా ఎడ్లబండితో కూడిన జ్ఞాపికను సీఎంకు బహూకరించారు. సభావేదికపై సీఎంను శాలువాతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు.
పర్యటన విజయవంతం
ముఖ్యమంత్రి జిల్లా పర్యటన విజయవంతం కావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అధికార యంత్రాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి రావడమే కాకుండా సీఎం ప్రసంగం పూర్తయ్యే వరకూ ఎవరూ కదలకుండా ఆద్యంతం ఆసక్తిగా ఆలకించారు.
Comments
Please login to add a commentAdd a comment