సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే నెల రోజులు పూర్తి అయిపోయాయి. నెల రోజుల పాలన పూర్తయినందుకు కాంగ్రెస్ నేతలు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్నా.. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజలకు చెప్పిన గడువు దగ్గరపడుతోందనే ఆందోళన కూడా వారిలో కనిపిస్తోంది.
ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రజలకిచ్చిన 14 హామీల్లో ఇప్పటివరకు కేవలం రెండు మాత్రమే అమలు కాగా మిగిలిన నాలుగు గ్యారంటీల్లోని 12 హామీల అమలు పెండింగ్‌లో ఉండటంతో.. మిగిలిన 70 రోజుల్లో ఇవి అమల్లోకి వస్తాయా అన్న సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎప్పుడైనా పార్లమెంటు ఎన్నికల కోడ్ (షెడ్యూల్) అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని, అదే జరిగితే ప్రభుత్వానికి నికరంగా మిగిలిన గడువు 40 రోజులే అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.
కోడ్ వస్తే కష్టమే!
ఎన్నికల కోడ్ వచ్చిందంటే గ్యారంటీల అమలు సాధ్యం కాదని, షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని ముందే తెలుసు కనుక, ఆ పేరిట గ్యారంటీల అమలును వాయిదా వేస్తే ప్రజలు హర్షించరనే భయం పార్టీ నేతలను వెంటాడుతోంది. ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీలు ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మరోవైపు అమలు చేయాల్సిన హామీల్లో మరికొన్నిటిని సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ప్రకటిస్తుందనే ఆశాభావంలో ప్రజలు ఉన్నారు.
అదే సమయంలో పింఛన్లు, రైతుబంధుకు సంబంధించిన డేటా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందని, ఈ సమాచారం ఆధారంగా వెంటనే చేయూత పింఛన్లు రూ.4 వేలకు (దివ్యాంగులకు రూ.6 వేలు) పెంచి ఇచ్చేందుకు, పెంచిన రైతుభరోసా మొత్తాన్ని జమ చేసేందుకు అవకాశం ఉన్నా ప్రజా పాలన పేరిట అన్ని పథకాలను ఒకేగాటన కట్టి తాత్సారం ఎందుకనే అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినవారి జాబితా కూడా సర్కారు వద్ద రెడీగానే ఉందని అంటున్నారు.
ఇప్పటికి దరఖాస్తుల ప్రక్రియే పూర్తి
100 రోజుల గడువు ప్రకారం చూస్తే మిగిలిన గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వానికి మార్చి 15వ తేదీ వరకు గడువుంది. అది లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకపోతే. లేదంటే ప్రకియ మొత్తాన్ని వేగవంతం చేసి ఎన్నికల కోడ్ వచ్చే నాటికే గ్యారంటీల్లో పేర్కొన్న అన్ని పథకాలను అమల్లోకి తేవాల్సి ఉంది. ప్రస్తుతం ప్రజాపాలన కింద దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మాత్రమే ముగిసింది. ఈ నెల 17 వరకు ఈ దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరణ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత మిగిలే కాలంలో 12 పథకాల అమలుకు మార్గదర్శకాలు ఖరారు చేయడంతో పాటు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ పథకాలను వర్తింపజేసినప్పుడే మొత్తం ఆరు గ్యారంటీలు అమలైనట్టని, కానీ మిగిలిన సమయం ఇందుకు సరిపోయే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీ లాంటి పథకాల అమలు పారదర్శకంగా చేయాల్సి ఉంటుందని, ఈ క్రమంలో వచ్చే సందేహాలు, సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుని ముందుకెళ్లడం అంత సులభమేమీ కాదని వారంటున్నారు. మరోవైపు ఆర్థికంగా ప్రభుత్వంపై భారీగా భారం పడే కొన్ని పథకాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రైతుబంధు అమలు కోసమే ప్రభుత్వం దగ్గర నిధుల్లేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పథకాల అమలుకు ఖజానా సహకరిస్తుందా? అనే అనుమానాలు ఇటు అధికార వర్గాలు, అటు పార్టీ వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నాయి.
మార్గదర్శకాలపై చర్చోపచర్చలు
ఆరు గ్యారంటీల అమలుతో పాటు వాటిని అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాల ఖరారు విషయంలో ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంభిస్తుందనేది రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రజలు, అధికార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మార్గదర్శకాల ఖరారు కూడా అంత సులభమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రధానంగా చర్చకు వస్తోంది. సాధారణంగా పేదలకు అమలు చేసే సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డునే గీటురాయిగా తీసుకుంటారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదు.
తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరించింది. ఆ మేరకు కొత్తగా కార్డులు ఇస్తారా? పాత కార్డుల ఆధారంగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటారా? అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ అంత సులభమేమీ కాదని, కేంద్ర ప్రభుత్వ పరిమితుల మేరకు ఈ కార్డులను జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. మిగిలిన గడువులోగా కొత్త కార్డులు కూడా జారీ చేయలేమని స్పష్టం చేస్తున్నారు. సోమవారం జరిగే కీలక సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక నెలకు రూ.2,500 నగదు సాయం విషయంలో మహిళల అర్హతను ఎలా నిర్ణయిస్తారనేది కూడా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కుటుంబంలో ఒక మహిళకు ఇస్తారా? ఎంతమంది మహిళలున్నా ఇస్తారా? అసలు ఈ పథకానికి అర్హులను ఎలా నిర్ధారిస్తానే సందేహాలు మహిళల్లో వ్యక్తమవుతున్నాయి. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఆరు గ్యారంటీల్లో చెప్పినప్పటికీ ఏడాదికి ఇన్ని సిలిండర్లేనన్న పరిమితి విధించనున్నట్టు తెలుస్తోంది. ఈ పథకం అమలుకు రేషన్‌కార్డును తప్పనిసరిగా ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తుందని అధికార వర్గాలు చెపుతున్నాయి.
ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు కావాల్సిన పథకాలివే:
– నెలకు ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం
– రూ.500కే గ్యాస్ సిలిండర్
– రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం
– వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు
– వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్
– గృహ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
– తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు అడుగుల ఇంటి స్థలం
– ఇంటి స్థలం ఉన్న పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం
– విద్యాభరోసా కింద విద్యార్థులు చదువుకునేందుకు రూ.5 లక్షల విలువైన కార్డు
– ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ పాఠశాల ఏర్పాటు
– చేయూత కింద పింఛన్లు రూ.4 వేలకు పెంపు
40 రోజులే గడువు!
Published Mon, Jan 8 2024 12:44 AM | Last Updated on Mon, Jan 8 2024 4:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment