‘వెంకటమ్మ రేషన్ కార్డు మీద సరుకులు తెచ్చుకున్నవా.. పండుగ దగ్గరకొత్తాంది.. ఏం సరుకులిత్తాండ్లని రేషన్‌షాపుకు పోవాలే.. నాకున్న అంత్యోదయ కార్డు మీద ఇదివరకు చక్కెర వచ్చేది.. ఇప్పుడు బియ్యమే దిక్కయినయి. పోయినేడు కాంచి చక్కెర ఇస్తలేరు.. గట్లున్నది సర్కారోళ్లు, రేషన్ డీలర్ల పనితీరు ఏం చేయాల్నే రమణమ్మ.. ఆయింత పట్టించుకునేటోళ్లు లేరు.
–సాక్షి, వరంగల్ రూరల్
ఒకప్పుడు రేషన్ షాపుకు వెళ్తే తొమ్మిది రకాల సరుకులు లభించేవి. ఇప్పుడు కేవలం బియ్యం తప్పా ఏమీ ఇవ్వడం లేదు.. అంత్యోదయ కార్డుదారులకు ప్రభుత్వం అందిస్తున్న చక్కెరకు రేషన్ డీలర్లు మంగళం పాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంత్యోదయ కార్డుదారులకు బియ్యంతో పాటు చక్కెరను సైతం అందించాలని గతంలోనే నిర్ణయించింది. 2015 సంవత్సరం తర్వాత ఆహార భద్రత కార్డులకు చక్కెర పంపి ణీ నిలిపివేశారు. అంత్యోదయకార్డులకు చక్కెరను ప్రభుత్వం అందిస్తోంది.
జిల్లాలో జిల్లాలో 2,18,269 మొత్తం కార్డులుండగా అంత్యోదయ కార్డులు 12,187లు ఉన్నాయి. గత కొంత కాలంగా అంత్యోదయ కార్డుదారులకు చక్కెరను ప్రభుత్వం అందిస్తున్నా రేషన్ డీలర్లు అందించడం లేదు. ప్రతీ నెల రేషన్ డీలర్లు కేవలం బియ్యానికే డీడీలు చెల్లిస్తున్నారు. ప్రతి రేషన్‌షాప్‌లో పదుల సంఖ్య లో అంత్యోదయ కార్డులుంటాయి. ప్రభుత్వం అందిస్తున్న చక్కెరను అందించేందుకు రేషన్ డీలర్లు ముందుకు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా సగం కంటే తక్కువ మంది రేషన డీలర్లు మాత్రమే ఒక్కో నెల చక్కెరను అందిస్తున్నారు.. ఇంకో నెల అందించడం లేదు.
అసలు కారణమిదే..
చక్కెరను ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే రేషన్ షాపుల్లో గొడవలు జరుగుతున్నాయి. ఆహార భద్రత, అన్నపూర్ణ కార్డుదారులకు ఇవ్వకుండా కేవలం అంత్యోదయ కార్డులకే చక్కెరను ఇస్తే మిగతా వారి నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2015 జూన్ కంటే ముందు అన్ని కార్డు దారులకు అరకిలో చొప్పున చక్కెరను అందించేవారు. అంత్యోదయ కార్డుదారులకు చక్కెర అందడం లేదని సివిల్ సప్లయ్ అధికారులకు తెలిసినా సైతం పట్టించుకోవడం లేదు.
బియ్యానికే పరిమితం..
గతంలో ఆహారభద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకు బియ్యంతో పాటు తొమ్మిది వస్తువులు రేషన్ షాపుల ద్వారా అందించేవారు. ప్రస్తుతం బియ్యానికే పరిమితమయింది. బియ్యంతో పాటు చక్కెర, పసుపు, కారం, చింతపండు, కందిపప్పు. ఉప్పు, గోధుమ పిండి, ఫామాయిల్, గోధుమలు అందించేవారు. రాను రాను అన్ని నిత్యావసర వస్తువులు ప్రభుత్వం ఇవ్వడం బంద్ చేసింది.
చక్కెర పంపిణీ చేయడం సమస్యగా మారింది
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కేవలం అంత్యోదయ కార్డు కలిగిన వినియోగదారులకు మాత్రమే చక్కెర రావడం చాలా సమస్యగా మారింది. చాలామంది దసరా పండుగకు మాకెందుకు చక్కెర ఇవ్వడం లేదంటూ గొడవ పడుతున్నారు. అధికారులకు విషయం చెపితే మా చేతుల్లో ఏమి లేదందటున్నారు. మరి మేం ఏం చేయలి. గతంలో మాధిరిగానే వినియోగదారులకు పంపిణీ చేస్తే సమస్య సద్దుమణుగుతుంది. ఉన్నతాధికారులు స్పందించి రేషన్ కోటాను పెంచాల్సిన అవసరం ఉంది.
–చందుపట్ల రాజేందర్‌రెడ్డి, రేషన్ డీలర్ల సంఘం పరకాల డివిజన్ అధ్యక్షుడు
ఈ నెల అందరూ డీడీలు కట్టాలని ఆదేశించా..
అంత్యోదయకార్డు దారులకు గత కొంత కాలం చక్కెరను ప్రభుత్వం అందిస్తోంది. కానీ కొందరు డీలర్లు చెల్లించడం లేదు. ఈ నెల 18న బియ్యం డీడీలతో పాటు చక్కెరకు సంబంధించిన డీడీలను అందించాలని ఆదేశించాను. అంత్యోదయ కార్డుదారులకు చక్కెరను ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి తప్పకుండా కార్డుదారులకు చక్కెర చేరాలి.
–వనజాత, డీఎస్‌ఓ
జిల్లాలో 2,18,269 మొత్తం కార్డులు
అంత్యోదయ కార్డులు 12,187
ఆహార భద్రత కార్డులు 2, 06, 067
అన్నపూర్ణ 15 కార్డులు
జిల్లాలో 464 రేషన్ షాప్‌లు
Comments
Please login to add a commentAdd a comment