ఇంటింటికీ రైస్‌కార్డులు  | Kolagatla Veerabhadra Swamy Distributes Ration Cards In Vizianagaram | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ రైస్‌కార్డులు 

Published Sun, Feb 16 2020 11:33 AM | Last Updated on Sun, Feb 16 2020 11:33 AM

Kolagatla Veerabhadra Swamy Distributes Ration Cards In Vizianagaram - Sakshi

విజయనగరం మండలం జొన్నవలసలో కార్డులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, చిత్రంలో  జేసీ కిశోర్‌కుమార్, తదితరులు 

సాక్షి, విజయనగరం: రైస్‌కార్డులు పంపిణీ కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైంది. నియోజకవర్గానికి ఒక సచివాలయంలో ముందుగా పంపిణీ చేస్తున్నారు. దశల వారీగా వారం పదిరోజుల్లో అన్ని సచివాలయాల్లో పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ఇప్పటికే కొన్ని కుటుంబాలను అర్హులుగా గుర్తించగా మరికొన్ని కుటుంబాలు పరిశీలనలో ఉన్నాయి. అన్ని అర్హత గల కుటుంబాలకు రైస్‌కార్డులు అందించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రేషన్‌కార్డే అన్ని పథకాలకు అర్హతగా గుర్తించడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పథకాలు కూడా పక్కదారి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలనలో ప్రక్షాళన, పారదర్శకత ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఏ పథకానికి సంబంధించి వారికి ఆ కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రేషన్‌డిపోల ద్వారా ఇంటింటికీ సరకుల పంపిణీకి రైస్‌కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. నవంబర్, డిసెంబర్‌ నెలలో జరిపిన సర్వేలో లబి్ధదారులను ఎంపిక చేశారు. ఈ మేరకు అర్హులుగా తేలిన వారికి ఈ నెల 15వ తేదీ నుంచి రైస్‌కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించి ఆమేరకు పనులు ప్రారంభించారు. 

ప్రారంభమైన కొత్త రేషన్‌కార్డులు పంపిణీ 
ప్రభుత్వం అనుకున్నట్లు శనివారం నుంచి రైస్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నవశకం సర్వేలో గుర్తించిన లబి్ధదారుల పేరున కొత్తగా కార్డులు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. సాంకేతిక కారణాల రీత్యా అన్ని సచివాలయాల్లో అన్ని కుటుంబాలకు కార్డులు ఒకేరోజు పంపిణీ చేయడం సాధ్యం కాకపోవడంతో దశలవారీగా అందజేస్తున్నారు. శనివారం నియోజకవర్గానికి ఒక సచివాలయంలో రేషన్‌డిపోలో ఈ కార్యక్రమం స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలతో ప్రారంభించారు. వారు అందుబాటులో లేని చోట అధికారులు ప్రారంభించారు. కార్డులు కూడా జిల్లాకు వస్తున్నాయి. వాటిని కూడా సచివాలయాలకు పంపించి వలంటీర్ల ద్వారా అందజేసే ఏర్పాటు చేస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ అధికారికంగా ప్రకటించారు.  

అర్హత గల ప్రతి కుటుంబానికి కార్డులు 
జిల్లాలో అర్హతకలిగిన ప్రతి కుటుంబానికి రైస్‌కార్డు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా మార్చి సచివాలయాల ద్వారా ఎప్పుడూ పంపిణీ చేసేలా కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. జిల్లాలో ఇంతవరకు 7,10,554 రేషన్‌కార్డులు ఉన్నాయి. వాస్తవానికి వీరందరికీ రైస్‌కార్డులు అవసరం లేదు. కోటా బియ్యం తినే కుటుంబాలు ఇందులో చాలా వరకూ లేవు. కానీ విద్య, వైద్యం నిమిత్తం రేషన్‌కార్డులు పొందారు. ఇప్పుడు రైస్‌కార్డులు కేవలం సరుకులకు మాత్రమే ఉపయోగ పడనుండడంతో రైస్‌కార్డుల సంఖ్య తగ్గుతుంది. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం జిల్లాలో 6,46,171 కుటుంబాలను సర్వేలో వలంటీర్లు అర్హులుగా గుర్తించారు. ప్రజాసాధికార సర్వేలో కూడా వీరు అర్హులుగా తేలారు.

మరో 30,403 కుటుంబాలు అర్హులుగా వలంటీర్లు గుర్తించినా భూమి, విద్యుత్‌ వినియోగం, నాలుగు చక్రాల వాహనాలు, అధిక ఆదాయం కారణంగా వీరిని పక్కన పెట్టారు. ఇందులో కొందరు నిజమైన అర్హులని అధికారుల పరిశీలనలో తేలడంతో ప్రభుత్వం మళ్లీమళ్లీ విచారణ చేసి అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని ఆదేశించింది. ఇలా విచారణ చేయగా 22వేల కుటుంబాలు అర్హులుగా తేలారు. వీరికి ఇవ్వాల్సిన రేషన్‌కార్డులు కూడా ముద్రిస్తున్నారు. ఈ నెల 22వ తేదీలోగా వీరందరికీ కార్డులు వచ్చేస్తాయి. అయితే మరో 33,980 వరకు కార్డులున్నా వారి నివాసాలపై స్పష్టత లేదు. కార్డులున్నా కుటుంబాలు ఎక్కడో నివాసం ఉంటున్నాయి. వీరి విషయంలో కూడా విచారణ చేసి అర్హతను గుర్తిస్తారు. ఇందులో అర్హులకు వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ కార్డులు అందజేస్తారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement