ఏటా రూ. 15 వేలిస్తామని రూ. 12 వేలకు కుదిస్తారా?
రైతాంగానికి రేవంత్ తీరని ద్రోహం చేశారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరని ద్రోహం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువు చేశారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతుభరోసా సాయాన్ని ఎకరానికి ఏటా రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి చివరకు రూ. 12 వేలకు కుదించడం రైతులను నిలువునా వంచించడమేనని దుయ్యబట్టారు. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని గ్రామగ్రామాన ఎండగట్టేందుకు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలతోపాటు రైతులు కూడా నిరసనల్లో పాల్గొనాలని కోరారు.
నాడు బిచ్చం అన్నావు.. నేడు ముష్టి వేస్తున్నావా?
‘ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ రైతులకు ఏటా రూ. 10 వేలు ఇస్తే దాన్ని రేవంత్ ‘బిచ్చం’అన్నాడు. మరి నువ్వు ఇప్పుడు పెంచిన మొత్తం మాటేమిటి? రైతులకు ముష్టి వేస్తున్నావా? తెలంగాణ ప్రజలకు కష్టమొస్తే వెంటనే వస్తానని రాహుల్ గాంధీ అన్నారు. రేవంత్‌రెడ్డి చేసిన మోసంతో తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు.
మరి రాహుల్ గాంధీ ఎక్కడ? ఇచ్చిన మాట తప్పడమే ఇందిరమ్మ రాజ్యమా? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. రేవంత్ రైతాంగానికి తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలి. నమ్మించి నయవంచన చేసినందుకు రాహుల్ గాంధీ 70 లక్షల మంది రైతులకు క్షమాపణలు చెప్పాలి. మేనిఫెస్టోలో రైతులకిచ్చిన ప్రధాన హామీని నిలబెట్టుకోనందుకు ముఖ్యమంత్రి ముందుగా రాష్ట్ర రైతాంగం ముందు లెంపలేసుకోవాలి.
కాంగ్రెస్ నాయకులు రైతుభరోసాపై మాట మార్చినందుకు ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలి. కేసీఆర్ రైతుబంధుగా నిలిస్తే రేవంత్ రాబందుగా మిగులుతారు. హార్టికల్చర్ రైతులకు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా? ఉద్యోగులకు భూమితో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం దాటేందుకు రైతు భరోసాపై ప్రకటన చేశారు. ఎన్నికల తరువాత ఎత్తేసే కుట్ర జరుగుతుంది. రైతుబంధు పథకం ఉండాలా వద్దా అనేది రైతులు నిర్ణయం తీసుకోవాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆర్థిక పరిస్థితి కాదు... రేవంత్ మానసిక పరిస్థితి బాగాలేదు
‘రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం కాదు.. దివాలా తీసింది రేవంత్‌రెడ్డి మెదడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేసింది ఆయనే. రాష్ట్రానికి ఆర్థిక ఇంజన్‌గా ఉన్న హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ పరిధిలో కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది. సంవత్సరంలో రూ. లక్షా 38 వేల కోట్ల అప్పు చేశారు.
2014లో రెవెన్యూ మిగులు రూ. 369 కోట్లతో మాకు ప్రభుత్వాన్ని అప్పగిస్తే 2023లో రూ. 5,943 కోట్ల రెవెన్యూ మిగులుతో మేం రాష్ట్రాన్ని అప్పగించాంం. అప్పుల పేరుతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అన్యాయం చేస్తున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. ఉమ్మడి ఏపీలోనే ఉద్యోగుల పరిస్థితులు బాగుండేవంటూ రేవంత్‌రెడ్డి తెలంగాణను కించపరిచారని కేటీఆర్ ఆరోపించారు. దేశంలో బీఆర్‌ఎస్ పాలనలో అత్యధిక జీతాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ అవమానకరంగా మాట్లాడారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment