![Harish Rao criticized the Congress party](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/harish.jpg.webp?itok=I3DXgd_k)
మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రైతుభరోసా విషయంలో చేసింది గోరంత, చెప్పుకునేది కొండంత.. అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతులందరికీ ఎకరాకు రూ.7,500 చొప్పున రైతుభరోసా ఇస్తామని ప్రకటించి దానిని రూ.6 వేలకు కుదించిందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా విదిల్చి, ఇచ్చిన మాట మీద నిలబడ్డట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది.
రాష్ట్రంలో 68 లక్షల మంది రైతులుండగా ఇందులో 21,45,330 మందికి రైతు భరోసా ఇచ్చినట్లు చెప్తోంది. మరి మిగతా రైతుల పరిస్థితి ఏమిటి. 2023 వానాకాలానికి సంబంధించి, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరం లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 22,55,181గా గుర్తించి రైతుబంధును ఇచ్చిoది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వీరి సంఖ్యను 21,45,330 మందిగా గుర్తించింది. అంటే ఎకరాలోపు భూమి ఉన్న 1,09,851 మంది రైతులకు కోత విధించింది’అని హరీశ్‌రావు అన్నారు.
లక్ష మందికి పైగా రైతులకు ఎందుకు రైతు భరోసా లేకుండా చేసారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి రైతులు, పేదల సంక్షేమం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో 415 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment