సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మాగాణి కోటి ఎకరాలకు చేరువలో ఉంది. భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపుందుకున్నాయి. అధిక వర్షాలతో ఓవైపు పంటనష్టం జరిగినా, మరోవైపు ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సమయానికి ఆయా పంటలవారీగా అధికంగానే సాగైందని చెప్పవచ్చు.
ప్రసుత్త సమయానికి 14.66 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న 59 వేల ఎకరాల్లో అధికంగా సాగైంది. అయితే పత్తిసాగులో కాస్త వెనుకబడి ఉన్నారు. గతేడాది ఇదే సమయానికి 47.27 లక్షల ఎకరాల్లో పత్తిసాగు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 44.49 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే సాధారణ సాగుతో పోలిస్తే 87.96 శాతం విస్తీర్ణంలోనే పత్తి సాగైంది.
వాస్తవంగా ఈ ఏడాది 65 లక్షల నుంచి 70 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయించాలని వ్యవసాయశాఖ భావించింది. ఆ మేరకు రైతులకు పిలుపునిచ్చింది. కానీ సకాలంలో రుతుపవనాలు రాకపోవడం, కీలకమైన జూన్, జూలై రెండోవారం వరకు వర్షాలు లేకపోవడంతో అదను దాటిపోయింది. దీంతో పత్తి సాగు విస్తీర్ణం అనుకున్నదానికంటే గణనీయంగా తగ్గిందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సాగు ఇలా
♦ సాధారణ సాగు విస్తీర్ణం1.24కోట్ల ఎకరాలు
♦ ఇప్పటివరకు సాగైంది 95.78 లక్షలఎకరాలు
♦ గతేడాది ఇదేసమయానికి 83.43 లక్షల ఎకరాలు
నాలుగు జిల్లాల్లో 100 శాతానికిపైగా సాగు
నాలుగు జిల్లాల్లో సాగు విస్తీర్ణం 100 శాతానికి పైగా పెరిగింది. ఆయా జిల్లాల వారీగా చూస్తే..మెదక్ జిల్లాలో 105.82 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 103.94 శాతం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 102.19 శాతం,నిజామాబాద్ జిల్లాలో 101.10 శాతం విస్తీర్ణంలో వివిధ పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 24.97 శాతం, ఆ తర్వాత ములుగు జిల్లాలో 32.97 శాతం పంటలు సాగయ్యాయి. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 77.07 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి.
37 శాతం అధిక వర్షపాతం
ఇక రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 37 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో 44 శాతం వర్షపాతం కొరత ఉండగా, జూలై నెలలో ఏకంగా 114 శాతం భారీ అధిక వర్షపాతం నమోదైంది. 8 జిల్లాల్లో భారీ అధిక వర్షపాతం, 19 జిల్లాల్లో అధిక వర్షపాతం, ఆరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు అనేకచోట్ల పంటలు దెబ్బతిన్నాయి.
కొన్ని తేరుకోగా, మరికొన్ని చోట్ల నష్టం సంభవించిందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయాచోట్ల తిరిగి పంటలు సాగు చేసుకునేందుకు రైతులు నానాయాతన పడుతున్నారు. ఇసుక మేటలు తీయిస్తున్నారు. పంటలు కొట్టుకుపోయిన చోట్ల మళ్లీ దుక్కులు దున్ని పంటలు సాగు చేస్తున్నారు. మరోవైపు పంటలకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
పప్పుధాన్యాల సాధారణ సాగువిస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.23 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగువిస్తీర్ణం 4.13 లక్షలఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.43 లక్షల ఎకరాల్లో సాగైంది.
Comments
Please login to add a commentAdd a comment