మాగాణికీ మెట్ట పంటలే శరణ్యం!
సాక్షి, హైదరాబాద్: నైరుతీ రుతుపవనాలు ముఖం చాటేయడం, రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటడంతో రాష్ట్రంలో వరి సాగును నియంత్రించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించేలా కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో గురువారం నుంచి ఊరూరా సదస్సులు నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ఖరీఫ్ సాగు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుపై రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ కె.మధుసూదనరావు బుధవారమిక్కడ సమీక్షించారు.
మెట్ట పంటల పరిశోధన కేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో జిల్లాలవారీగా పంటల సాగుపై సమీక్షించారు. ఇప్పటికే అదును దాటినందున వరి సాగు చేయకుంటేనే మంచిదన్న విషయాన్ని రైతులకు తెలియజెప్పాలని నిర్ణయించారు. జూన్లో వేసిన పంటలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని, జూలై, ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో సాగు విస్తీర్ణం గతేడాది కంటే తగ్గిందని అధికారులు వివరించారు.
గతేడాది ఇదే సమయానికి, ఇప్పటికీ పంటల సాగులో పెద్దగా వ్యత్యాసం లేనప్పటికీ గతేడాది ఆగస్టులో రిజర్వాయర్లలోకి నీరు వచ్చింది. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మొక్కజొన్న, శనగ, పెసర, పిల్లిపెసర, మినుము వంటి పంటల్ని వేయాలని వ్యవసాయశాఖ కమిషనర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై జిల్లా అధికారులతో గురు, శుక్రవారాలలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు.
సీమలో సగటు లోటు 41 శాతం..
రాష్ట్రంలో అక్కడక్కడా చిరు జల్లులు పడుతున్నా సగటు వర్షపాతం లోటు 11 శాతానికి చేరింది. ప్రాంతాలవారీగా చూస్తే రాయలసీమలో అత్యధికంగా 41 శాతం, దక్షిణ కోస్తాలో 9 శాతం లోటు వర్షపాతం నమోదవగా ఉత్తర కోస్తా జిల్లాల్లో పరిస్థితి ఓ మోస్తరుగా ఉంది. అల్పపీడనాలతో వచ్చేవారంలో వర్షాలు పడతాయన్న ఆశ తప్ప రుతుపవనాలపై ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సలహా ఇచ్చారు.
వ్యవసాయశాఖ బుధవారం నాటి నివేదిక ప్రకారం.. జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు 347.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 310.3 మిల్లీమీటర్లు నమోదైంది. ఖరీఫ్ సాగు విస్తీర్ణమైన 42.56 లక్షల హెక్టార్లలో ఇప్పటికి 29.74 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉండగా.. 23.18 లక్షల హెక్టార్లలో వేశారు. వేసిన పంటల్లో కొన్ని ఇప్పటికే ఎండిపోగా రైతులు మరోసారి వేసేందుకు ఇష్టపడట్లేదు. వేరుశనగపై దాదాపు ఆశ లేనట్టే. పత్తి విస్తీర్ణమూ గణనీయంగా తగ్గింది. ప్రస్తుతానికి గోదావరి డెల్టాలోనే పంటల పరిస్థితి మెరుగ్గా ఉంది.
తగ్గిన ఉల్లి సాగు
కోయకుండానే ప్రజల కంట నీరు పెట్టిస్తున్న ఉల్లి పంటను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం చెప్పినా ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గింది. గతేడాది 20,888 హెక్టార్లున్న ఉల్లి సాగు ఈసారి 18,917 హెక్టార్లకు పడిపోయింది. అత్యధికంగా సాగయ్యే కర్నూలు జిల్లాలో సైతం ఉల్లి సాగు తగ్గింది. జిల్లాలో గతేడాది 19,620 హెక్టార్లలో సాగవగా.. ఈ ఏడాది 16,400 హెక్టార్లకు తగ్గిపోయింది. విజయనగరంలో 62 హెక్టార్లు, విశాఖలో 17, తూర్పుగోదావరిలో 16, ప్రకాశంలో 21, నెల్లూరులో 115, వైఎస్సార్ కడపలో 2,216, చిత్తూరు జిల్లాలో 60 హెక్టార్లలో ఉల్లి పంట సాగవుతోంది.