సాక్షి, హైదరాబాద్: పరిశోధనా ఫలాల్ని మారుమూల ప్రాంతాల్లో ఉండే సన్న చిన్న కారు రైతాంగాలకి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పిలుపునిచ్చారు. పంటల ఉత్పత్తి, ఉత్పాదకతల్ని అధికం చేయడానికి, నష్టాల్ని తగ్గించడానికి, మార్కెట్ అనుసంధానం చేయడానికి టెక్నాలజీలని విరివిగా వినియోగించుకోవాలన్నారు. కిందిస్థాయి రైతాంగం వరకు శిక్షణ అందించాలన్నారు.
రైతాంగ సంక్షేమం కోసం కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో కలిసి పనిచేస్తాయన్నారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ‘విస్తరణ విద్యాసంస్థ (ఈఈఐ)’లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈఈఐ స్వరో్ణత్సవాల సందర్భంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో 200 మంది కూర్చునే విధంగా ఈ ఆడిటోరియాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ, అనేక పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలలో దేశం ప్రథమ శ్రేణిలో ఉందన్నారు. దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసుకునే స్థాయికి దేశం ఎదిగిందని మంత్రి వివరించారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి తమ ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వివరించారు. రాష్ట్రానికి కేంద్రం కూడా ఇతోధిక సాయం అందించాలని కోరారు.
జూన్ 15–17 మధ్య హైదరాబాద్‌లో జీ–20 సదస్సు...
జూన్ 15–17 మధ్య హైదరాబాద్‌లో జరగనున్న జీ–20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ముందస్తు ఏర్పాట్లపై మాదాపూర్ హెచ్‌ఐసీసీ లో కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్, రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ, వ్యవసాయరంగంలో తెలంగాణ ముందున్న నేపథ్యంలోనే ఇక్కడ జీ–20 సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.
సీఎస్ శాంతి కుమారితో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి భేటీ...
కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి మనోజ్ అహూజా సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మనోజ్ అహూజా, జాయింట్ సెక్రటరీ యోగితా రాణాలను శాంతి కుమారి శాలువాతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment