సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏయే పంటలను, ఎంతెంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే వివరాలను పక్కాగా తేల్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం శాటిలైట్ సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పంటల నమోదు ప్రక్రియ పక్కాగా ఉండాలన్న లక్ష్యంతో ఇప్పటికే 20 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద శాటిలైట్ సర్వే ప్రారంభించారు.
డిసెంబర్ 20 నుంచి 23 వరకు.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. 144 మండలాల్లోని 318 క్లస్టర్లలో ప్రక్రియను పూర్తి చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శాటిలైట్ సర్వే చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అత్యాధునిక పరిజ్ఞానంతో..
రాష్ట్రంలో ఇప్పటివరకు పంటల నమోదు ప్రక్రియ కొంత అశాస్త్రీయంగా ఉందని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఈ క్రమంలోనే శాటిలైట్ సర్వే చేపట్టడానికి అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. క్లస్టర్ల వారీగా ప్రతి 300 మీటర్ల పరిధిలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు అవుతున్నాయనేది ఈ ప్రక్రియలో భాగంగా లెక్కిస్తారు. ఈ యాప్‌లో ‘గ్రౌండ్ ట్రూత్ పాయింట్ (జీటీ పాయింట్)’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు ఆయా క్లస్టర్ పరిధిలోని సంబంధిత పాయింట్ వద్దకు వెళ్లి పరిశీలించి.. పంటల వివరాలు నమోదు చేస్తారు.
క్షేత్రస్థాయికి వెళితేనే వివరాలు కనిపించేలా..
వ్యవసాయ శాఖలో కొన్నేళ్లుగా ఏఈవోలు రోజువారీ హాజరు, రైతుబీమా, రైతుబంధు నమోదు కోసం ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లు, మొబైల్ ఫోన్లలో యాక్టివ్ ౖలాగర్ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఇదే యాప్ ద్వారా సర్వే నంబర్ల ఆధారంగా పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. మొదట్లో రైతు యూనిట్‌గా పంటల సర్వే చేపట్టగా.. పంటలు అమ్ముకునే సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో సర్వే నంబర్ల ఆధారంగా పంటలను అప్‌లోడ్ చేశారు. ఈ విధానంలో ఏఈవోలు క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు రైతులు, రెవెన్యూ అధికారులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఇలాంటి లోటుపాట్లను సరిచేసి కచ్చితత్వంతో పంటల నమోదు చేపట్టేందుకు తాజాగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. సంబంధిత సర్వే నంబర్ ప్రాంతానికి వెళ్లినప్పుడే వివరాలు కనిపించేలా తీర్చిదిద్దారు. ఏఈవోలు ఏదైనా సర్వే నంబర్ వద్దకు వెళ్లాల్సి వస్తే.. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆ లొకేషన్‌కు చేరుకోవచ్చు.
శాటిలైట్ ద్వారా 300 మీటర్ల పరిధిలో ఉన్న సర్వే నంబర్ వివరాలు యాప్‌లో కనిపిస్తాయి. ఇలా పక్కాగా పంటల నమోదు జరిగితే.. రాష్ట్రవ్యాప్తంగా ఏ పంటలు ఎంతమేర సాగు చేస్తున్నారనేది కచ్చితంగా లెక్కించవచ్చని అధికారులు చెప్తున్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో ఏదైనా పథకానికి పంటల సాగుకు లింక్ పెట్టాల్సి వచ్చినా.. ప్రభుత్వం వద్ద కచ్చితమైన సమాచారం ఉంటుందని అంటున్నారు.
పంటలపై శాటి‘లైట్’!
Published Mon, Jan 1 2024 5:03 AM | Last Updated on Mon, Jan 1 2024 1:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment