సాక్షి, హైదరాబాద్: వచ్చే యాసంగి సీజన్‌లో తెలంగాణలో పండే పంటలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జాతీయ అవసరాల కోసం సేకరించేందుకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. బుధవారం ఢిల్లీలో వివిధ రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ అధికారులు, మంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వచ్చే రబీలో ఏయే రాష్ట్రం నుంచి ఎంత మేర ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలనే దానిపై స్పష్టత ఇచ్చారు. 80 ఎల్‌ఎంటీ ధాన్యాన్ని మిల్లింగ్ చేయగా వచ్చే 54 లక్షల మెట్రిక్ టన్నుల ముడిబియ్యాన్ని ఈ యాసంగి సీజన్‌లో కేంద్రం సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐ ద్వారా సేకరించనుంది. దీనికి సంబంధించి రైతులకు మద్ధతుధరను కేంద్ర ప్రభుత్వం చెల్లించేందుకు అంగీకరించింది.
1.28 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడికి అవకాశం
యాసంగిలో సాగైన పంట విస్తీర్ణం ఆధారంగా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 1.28 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో బహిరంగ మార్కెట్‌లో విక్రయాలు, మిల్లర్ల కొనుగోళ్లు , రైతుల సొంత అవసరాలు పోగా 80 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నట్లు పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. అందుకు అనుగుణంగానే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు నివేదికలు పంపింది.
ఇక ఈ ఏప్రిల్ నుంచి ప్రభుత్వ పథకాలన్నింటికీ బలవర్ధక బియ్యం (ఫోరి్టఫైడ్ రైస్) ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ముడి బియ్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ (ఎఫ్‌ఆర్‌కే)తో 1:100 నిష్పత్తిలో కలిపి పంపిణీ చేయనున్నారు. కాగా యాసంగిలో ముడిబియ్యంగా కాకుండా బాయిల్డ్ రైస్‌గా తెలంగాణ నుంచి సేకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. సమావేశంలో తెలంగాణ ప్రతినిధులుగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ బి.అనిల్‌కుమార్, పౌర సరఫరాల కార్పొరేషన్ జీఎం రాజిరెడ్డి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment