సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద విడుదల చేసిన సొమ్ము లక్షలాది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంలేదు. ఆ సొమ్ము బ్యాంకుల నుంచి తిరిగి ట్రెజరీలకే వెళ్తోంది. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడం, ఖాతాదారులు డిఫాల్టర్‌గా మారడం, కొందరి ఖాతాలు క్లోజ్ అవ్వడం, రుణాలు రెన్యువల్ చేసుకోవడంతో పాత ఖాతాలు పోయి కొత్త ఖాతాలు రావడం, పాత ఖాతాల వివరాలే వ్యవసాయశాఖ వద్ద ఉండటం తదితర కారణాలతో లబ్దిదారులకు రుణమాఫీ సొమ్ము అందలేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
వ్యవసాయ వర్గాల ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 3 లక్షల మంది రైతుల సొమ్ము వారి ఖాతాల్లో జమ కాకుండా వెనక్కు వెళ్తోంది. దీనిపై రైతులు వ్యవసాయశాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా వ్యవసాయశాఖ స్పందించడం లేదన్న విమర్శలొస్తున్నాయి. ఈ విషయంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా... ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా వ్యవసాయశాఖ అధికారులు కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంకులతో వ్యవసాయ శాఖ సమన్వయం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ముందే తెలిసినా వ్యవసాయశాఖ నిర్లక్ష్యం...
రుణం తీసుకున్న రైతులు మూడు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించడం, వాటిని ఇటీవలి వరకు తీర్చకపోవడంతో రైతులు బకాయిలు చెల్లించలేదు. మరోవైపు దీర్ఘకాలంగా బకాయిలు పేరుకుపోయిన వారు కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రుణమాఫీ సొమ్ము పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో అనేక మంది రైతులకు రుణాల రెన్యువల్ సమస్య వచ్చింది.
రెన్యువల్ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారతారు. దీంతో రైతులు బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. అయితే కొందరు రైతులు అలా చెల్లించగా మరికొందరు రైతులు డబ్బుల్లేక బ్యాంకులకు చెల్లించలేకపోయారు. దీంతో సుమారు 10 లక్షల మంది వరకు రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయినట్లు అంచనా.
అనేక కారణాలతో రైతుల రుణ ఖాతాలు ఫ్రీజ్ కావడమో, నిలిచిపోవడమో, డబ్బు చెల్లించిన వారి ఖాతాలు మూసేయడంతో ఈ సమస్య వచ్చిపడింది. ఈ విషయంపై వ్యవసాయశాఖ అధికారులకు స్పష్టత ఉన్నా, ఇలాంటి సమస్య తలెత్తుతుందని కొందరు హెచ్చరించినా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించినట్లు తెలిసింది. ప్రభుత్వం రుణమాఫీ సొమ్మును జమ చేసినా, అధికారులు సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు విడతల్లో మాఫీ సొమ్ము విడుదల
రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక 2018 డిసెంబర్ 11 నాటికి రాష్ట్రంలో రూ. లక్ష వరకు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం తెలిసిందే. రూ. 50 వేలలోపు రుణాలున్న 7.19 లక్షల మంది రైతులకు సంబంధించి ప్రభుత్వం రూ. 1,943.64 కోట్లను బ్యాంకులకు చెల్లించింది.
ఈ మొత్తాన్ని రైతు రుణ మాఫీ ఖాతాల్లో సర్దుబాటు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రూ.99, 999 వరకు రుణాలున్న రైతులకు బకాయిలను విడుదల చేసింది. ఆ మేరకు 10. 79 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 6,546.05 కోట్లు విడుదల చేసింది. తాజా నిర్ణయంతో ఇప్పటివరకు మొత్తంగా 16.66 లక్షల మంది రైతులకు రూ. 7,753.43 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కింద చెల్లించినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment