వ్యవసాయ కార్పొరేషన్లపై ఏసీబీ నిఘా | ACB surveillance on agricultural corporations | Sakshi
Sakshi News home page

వ్యవసాయ కార్పొరేషన్లపై ఏసీబీ నిఘా

Published Sun, Mar 10 2024 1:36 AM | Last Updated on Sun, Mar 10 2024 7:27 PM

ACB surveillance on agricultural corporations - Sakshi

భారీగా అక్రమాలు జరిగినట్టు సర్కారుకు ఫిర్యాదులు

ఒక కార్పొరేషన్‌ ఎండీ ఆస్తి రూ.100 కోట్లకు పైనేనని అంచనా

కార్పొరేషన్ల మేనేజర్లు, ఉద్యోగులకు విల్లాలు, ఎకరాలకొద్దీ భూములు

ప్రభుత్వం మారినా చక్రం తిప్పుతున్న మాజీ చైర్మన్లు

పలు టెండర్లలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు

ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: ఆయన వ్యవసాయశాఖలోని ఒక కార్పొరేషన్‌ ఎండీ.. టెండర్లు, పనుల్లో పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటారని ఆరోపణలున్నాయి. ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టులు మొదలు అన్నింటిలోనూ వసూళ్లేనని.. ఆయన ఆస్తుల విలువ రూ.100 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ఆయన హైదరాబాద్‌లో ఒక కమర్షియల్‌ కాంప్లెక్స్, ఒక విల్లా, హైదరాబాద్‌ పరిసరాల్లో 30 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

ఇదేశాఖలోని ఓ కార్పొరేషన్‌కు చెందిన జనరల్‌ మేనేజర్‌కు రెండు విల్లాలు, రెండు ప్లాట్లు, నగర శివారులో ఐదెకరాల ఫాంహౌస్‌ ఉందని సమాచారం. మరో కార్పొరేషన్‌కు చెందిన జనరల్‌ మేనేజర్‌కు ఒక విల్లా, రెండు ఖరీదైన ఫ్లాట్లు, ఐదుచోట్ల ఇళ్ల స్థలాలు, నగర సమీపంలో రెండెకరాల భూమి ఉన్నాయి. ఒక కార్పొరేషన్‌లోని డిప్యూటీ మేనేజర్‌ స్థాయి అధికారికి ఒక విల్లా, రెండు ఖరీదైన ఫ్లాట్లు, స్థలాలు ఉన్నాయి.

..వ్యవసాయశాఖ పరిధిలోని కార్పొరేషన్ల ఎండీలు, జనరల్‌ మేనేజర్లు, మేనేజర్లు, డిప్యూటీ మేనే జర్లపై వస్తున్న ఫిర్యాదుల్లోని అంశాలివి. దీనిపై దృష్టిపెట్టిన ఏసీబీ కొందరు పెద్ద ఎత్తున ఆస్తులు కూడ బెట్టినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. రెండు కార్పొరేషన్ల ఎండీలపై నేరుగా ఫిర్యాదులు అందడంతో.. ఏసీబీ అధికారులు లోతుగా పరిశీల న చేపట్టి, రికార్డులను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అవసరమైతే ఆయా ఉద్యోగులను పిలిపించి విచారించేందుకు, సోదాలు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఆయా కార్పొరేషన్ల జనరల్‌ మేనేజర్లు, మేనేజర్లపై విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని వ్యవసా య ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు.

ఐఏఎస్‌ల విచారణతో..
వ్యవసాయశాఖలోని 11 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఇద్దరు ఐఏఎస్‌లను విచారణ అధికారులుగా నియమించారు కూడా. దీంతో భారీగా దండుకున్న అధికారుల్లో దడ మొదలైంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని, దీని నుంచి బయటపడేందుకు పలువురు ఎండీలు, జనరల్‌ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.
మార్క్‌ఫెడ్‌లో భారీగా ఉల్లంఘనలు!

వ్యవసాయశాఖ పరిధిలో మార్క్‌ఫెడ్, వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్, ఆయిల్‌ఫెడ్, ఆగ్రోస్, హాకా, టెస్కాబ్, సీడ్‌ కార్పొరేషన్‌ వంటి కీలక కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిల్లో వందల కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. మార్క్‌ఫెడ్‌ లోనైతే ఏటా వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ జరుగుతుంది. దానిద్వారానే రైతులకు ఎరువుల సరఫరా జరుగుతుంది. రైతుల పంటలను కూడా మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేస్తుంది.

ఇందుకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకురావడం, రైతుల నుంచి కొన్న పంటలను విక్రయించాక వచ్చే డబ్బును బ్యాంకులకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. అధికా రులు ఆయా లావాదేవీలను ప్రభుత్వ బ్యాంకుల్లో కాకుండా ప్రైవేట్‌ బ్యాంకులతో నిర్వహిస్తుండటంపై విమర్శలు న్నా యి. ఈ వ్యవహారంలో కమీషన్లు చేతులు మారుతు న్నట్టు ఆరోప ణలు న్నాయి.

ఎరువుల నుంచి గన్నీ బ్యాగుల దాకా..
ఎరువుల రవాణా టెండర్లు అధికారులకు వరాల జల్లు కురిపిస్తాయని.. రూ.వంద కోట్లకు పైబడి ఉండే ఈ టెండర్లను ఒకే కంపెనీకే  వచ్చేలా నిబంధనలు రూపొందించి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటిదాకా  ఒక్క కంపెనీకే టెండర్‌ దక్కుతూ వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇక గన్నీ బ్యాగుల టెండర్లలోనూ కొందరు అధికారులు కంపెనీల నుంచి కమీషన్లు అందుకుంటున్నారన్న సమాచారం ఉంది.

 2019–20లో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసిన మొక్కజొన్నను టెండర్ల ద్వారా తక్కువ ధరకు విక్రయించాల్సి రావడంతో దాదాపు రూ.1,200 కోట్లు నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి ఎండీ స్థాయి అధికారి నుంచి మేనేజర్ల వరకు కోట్లలో కమీషన్లు ముట్టినట్లు ఫిర్యాదులున్నాయి. మార్క్‌ఫెడ్‌కు రూ.3 వేల కోట్ల అప్పులుంటే, ఈ స్కాం వల్లే సగం అప్పు పేరుకుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. అసలు పదేళ్లుగా మార్క్‌ఫెడ్‌ జనరల్‌ బాడీ సమావేశం జరగలేదంటే నిబంధనల ఉల్లంఘన ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నాయి. మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగిరెడ్డి కాంగ్రెస్‌లో చేరి తన పోస్టును కాపాడుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.

వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లోనైతే జిల్లా మేనేజర్లు కూడా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే ఉన్నారు. వీరిలో కొందరిని అడ్డుపెట్టుకొని పైస్థా యి అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమా లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రైవే ట్‌ గోదాములతో సంబంధాలు పెట్టుకుని.. వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ను దివాలా తీయిస్తున్నా రన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని పనులకు టెండర్లకు వెళ్లకుండా పాత వాటినే కొనసాగిస్తూ నష్టం కలిగిస్తున్నారని అంటున్నారు.

ఆయిల్‌ఫెడ్‌లో సిద్దిపేట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతుల టెండర్‌ను తక్కువ ధరకు కోట్‌ చేసిన కంపెనీకి కాకుండా మరో కంపెనీకి ఇవ్వడం వివాదం రేపింది. కోర్టులో ఈ వివాదం ముగిసింది. కానీ ఈ వ్యవహారంలో కొందరు అధికారులు పాత్ర పోషించారని.. కోట్లు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా ఆయిల్‌ఫెడ్‌లో రూ.కోటిన్నర, వేర్‌హౌజింగ్‌ కార్పొరేషన్‌లో రూ.కోటి మొత్తాన్ని కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధుల కింద కేటాయించారు.  

హాకాలో శనగల కొనుగోలు వ్యవహారం విమర్శలకు దారితీసింది. ఇందులో ఎండీ పాత్ర కంటే అప్పటి ఒక ప్రజాప్రతినిధి జోక్యమే అన్ని విధాలుగా హాకాను భ్రష్టుపట్టించిందనే విమర్శ లున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి శనగలు సరఫరా చేసే బాధ్యత తీసుకొని వాటిని విని యోగదారులకు కాకుండా వ్యాపారులకు కమీష న్లకు అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి.

ఇక ఆగ్రోస్‌ను పెద్దగా అభివృద్ధి చేయలేదన్న విమర్శలున్నాయి. ఇందులో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. వ్యవసాయ యాంత్రీకరణ అమలుకాకపోవడంతో ఆగ్రోస్‌ కునారిల్లిపోయింది.

ఒక కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన ఒక ప్రజాప్రతినిధి తన పదవిని అడ్డుపెట్టుకొని రూ.500 కోట్ల దాకా వెనకేసుకున్నట్టు ఆరోపణ లున్నాయి. అధికారం ద్వారా అనేక వ్యాపారాలు చేసి కమీషన్లు వసూలు చేశారని, అధికారులు తనకు నచ్చినట్టుగా వ్యవహరించేలా చేశాడని సమాచారం. అదే ఇప్పుడు సదరు కార్పొ రేషన్‌ను బోనులో నిలబెట్టిందని అంటున్నారు. 

ఇప్పటికీ చక్రం తిప్పుతున్న మాజీ చైర్మన్లు
గత ప్రభుత్వంలో కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేసినవారు ఇప్పుడు మాజీలుగా మారినా కొత్త ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నారు. ఆయా కార్పొరేషన్‌ ఎండీలు, ఇతర మేనేజర్లు, ఉద్యోగులపై ఒత్తిడి చేస్తూ పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరైతే పార్టీ మారి మళ్లీ ఇదే కార్పొరేషన్‌కు చైర్మన్‌గా వస్తామనీ బెదిరిస్తున్నట్టు సమాచారం. కొందరు ఇప్పటికీ కార్పొరేషన్ల డ్రైవర్లను వాడుకుంటున్నట్టు తెలిసింది. సదరు మాజీ చైర్మన్లతో కలసి అక్రమాలకు పాల్పడిన పలువురు ఎండీలు వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement