AP: అడిగిన వెంటనే వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు,..ఏడాదిలో రూ.20.73 కోట్ల ఖర్చు  | AP Govt Spent 20 Crores On Agricultural Power Connections In Year | Sakshi
Sakshi News home page

AP: అడిగిన వెంటనే వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు,..ఏడాదిలో రూ.20.73 కోట్ల ఖర్చు 

Published Thu, Jan 12 2023 2:11 PM | Last Updated on Thu, Jan 12 2023 2:16 PM

AP Govt Spent 20 Crores On Agricultural Power Connections In Year - Sakshi

వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోంది. విత్తనం నుంచి ఎరువులు, వ్యవసాయ ఉపకరణాల వరకు, సాగు ప్రారంభం నుంచి పంట కోతల వరకు, సాగు పెట్టుబడి, వడ్డీ రాయితీలు అందిస్తూ, గిట్టుబాటు ధరలు కల్పిస్తూ ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ప్రధానంగా సాగునీటి వసతి కల్పించడం కోసం జలవనరులు అభివృద్ధి చేస్తోంది.

నీటి పారుదల వసతి లేక, మోటార్లపై ఆధారపడిన రైతులకు పుష్కలంగా సాగునీటిని అందించాలనే లక్ష్యంతో సరిపడినంత విద్యుత్‌ సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా రైతులు అడిగిన వెంటనే ప్రభుత్వమే ఖర్చులు భరించి ఉచితంగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరు చేస్తోంది.  

నెల్లూరు (వీఆర్సీసెంటర్‌): గత ప్రభుత్వ హయాంలో రైతులకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ పొందాలంటే గగనంగా ఉండేది. కనెక్షన్‌ మంజూరు అయినా అన్ని ఖర్చులు రైతులే భరించారు. అప్పట్లో ఏడాదికి పరిమిత సంఖ్యలోనే వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయడంతో రైతులు ఎదురుచూస్తూనే ఉండాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో రాజకీయ నాయకుల ఒత్తిడి, ఎవరైతే అమ్యామ్యాలు ఇచ్చే వారో అడ్డదారిలో ప్రాధాన్యత ఇచ్చి కనెక్షన్లు ఇచ్చేవారు.

అయితే ఇప్పుడు ఆ పరిస్థితులకు భిన్నంగా రైతు అడిగిన వెంటనే రూపాయి ఖర్చు లేకుండా వెంటనే ప్రభుత్వం కనెక్షన్‌ ఏర్పాటు చేస్తోంది. ఏ రాజకీయ ఒత్తిళ్లు లేవు. పైరవీలు లేవు. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత విద్యుత్‌శాఖ అధికారులు రైతుల అర్హతలు పరిశీలించి, క్షేత్రస్థాయిలో విద్యుత్‌ అందుబాటులో నుంచి కనెక్షన్లు ఇస్తున్నారు. విద్యుత్‌ సర్వీసు అందించడం కోసం ఒక్కొక్క కనెక్షన్‌ కోసం మూడు విద్యుత్‌ స్తంభాలు, వైరు (కండక్టర్‌), కాసారం, ఇన్సులేటర్, లేబర్‌ చార్జీలకు అయ్యే రూ.22 వేలను పూర్తిగా విద్యుత్‌శాఖనే భరిస్తోంది.   

ఏడాదిలో రూ.20.73 కోట్ల ఖర్చు 
ఒక వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ (5హెచ్‌పీ) కోసం అందుబాటులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి రైతు పొలం వరకు మూడు విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేస్తోంది. 180 మీటర్ల నూతన విద్యుత్‌ లైన్‌ను వేసి విద్యుత్‌ సరఫరా అందజేస్తోంది. ఈ ప్రక్రియలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మూడు విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటుకు రూ.12 వేలు, నూతన విద్యుత్‌ లైన్‌ (కండక్టర్‌), కాసారాలు, ఇన్సులేటర్లకు రూ.6 వేలు, లేబర్‌ చార్జీలు (కూలీలు)కు ఖర్చు రూ.4 వేలు వంతున మొత్తం రూ.22 వేలను విద్యుత్‌ సంస్థే భరిస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. ఈ లెక్కన గత పది నెలల కాలంలో 9,426 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు పొందిన రైతులకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు రూ.20,73,72,000 ఖర్చు చేసింది.  

పంటపొలాలు సస్యశ్యామలం
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 1,88,526 వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులు ఉన్నాయి. ఇందులో గతేడాది 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 10 నెలల కాలంలో 9,426 విద్యుత్‌ సర్వీసులు ఇచ్చారు. ఇవి కాకుండా మరో 1,855 మంది రైతులు వ్యవసాయ విద్యుత్‌ సర్వీసుల కోసం దరఖాస్తు చేసుకోగా వీరందరికీ మరో రెండు నెలల్లో కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క సర్వీస్‌ కింద 3 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లాలో 5,65,578 ఎకరాలకు మోటార్ల ద్వారా సాగునీరు పారుతోంది. ఇందులో వరితో పాటు మెట్ట పైర్లు, ఉద్యాన తోటలు ఉన్నాయి.  

విద్యుత్‌ పరికరాల కొరత లేదు 
గతంలో మాదిరిగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం వేచి చూసే పరిస్థితి ఇప్పుడు లేదు. గతంలో సంవత్సరానికి ఇన్ని మాత్రమే వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులు ఇవ్వాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు అడిగిన వెంటనే కనెక్షన్లు ఇస్తున్నాం. సంస్థ స్టోర్స్‌లో విద్యుత్‌ స్తంభాలు, వైర్లు, విద్యుత్‌ పరికరాల స్టాక్‌ ఉంది. దీంతో దరఖాస్తు చేసుకున్న సత్వరమే కనెక్షన్లు ఇచ్చే వీలు కలుగుతోంది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కనెక్షన్లు కూడా రెండు నెలల్లో ఏర్పాటు చేస్తాం. 
– వెంకటసుబ్బయ్య, ఎస్‌ఈ, ఏపీఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌ 

అప్పట్లో ఒక్క స్తంభానికే రూ.20 వేలు ఖర్చు చేశా 
ఇరవై ఏళ్ల క్రితం నా పొలానికి నీటి సౌకర్యం కోసం విద్యుత్‌ సర్వీసు కనెక్షన్‌ తీసుకున్నాను. నా పొలానికి దగ్గరగా ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి కనెక్షన్‌ ఇచ్చేందుకు అదనంగా ఒక విద్యుత్‌ స్తంభం కావాల్సి వచ్చింది. దీని కోసం అప్పట్లోనే రూ.20 వేలు సొంతంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా 3 విద్యుత్‌ స్తంభాలు వేసి, లైన్‌ వేసి ఇస్తోంది. ఇది రైతు ప్రభుత్వమని చెప్పడానికి ఇదే ఉదాహరణ. 
– తోటపల్లి హరిబాబురెడ్డి, రైతు, పడుగుపాడు, కోవూరు మండలం 

సామాన్య రైతుకు ఎంతో ఉపయోగకరం 
వ్యవసాయ విద్యుత్‌ సర్వీ సు పొందే రైతులకు విద్యుత్‌ శాఖ ఉచితంగా రూ.22 వేలతో మూడు విద్యుత్‌ స్తంభాలు, 180 మీటర్ల విద్యుత్‌ లైన్‌ వైరు, కాసారాలు, ఇన్సులేటర్స్‌ ఉచితంగా అందజేస్తోంది. ఇది సామాన్య రైతుకు ఎంతో ఉపయోగంగా మారింది. రైతు పక్షపాతిగా ప్రభుత్వం వ్యవహరిస్తుండడంతో రాష్ట్రంలోని రైతులు అందరూ ఆనందంగా వారి పొలాలను సాగు చేసుకునే వీలుకలుగుతోంది.  
– కోటంరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, రైతు, వెన్నవాడ, ఆత్మకూరు మండలం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement