సాక్షి, అమరావతి: వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విత్తనం నుంచి కోత వరకు రైతులెదుర్కొంటున్న కూలీల వెతలకు చెక్ పెట్టింది. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ప్రతి ఆర్బీకే పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో (సీహెచ్‌సీ) అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. నూరు శాతం ఆర్బీకేల్లో సీహెచ్‌సీల ఏర్పాటు లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇప్పటికే 6,525 ఆర్బీకేల పరిధిలో అందుబాటులోకి రాగా మిగిలిన 4,225 ఆర్బీకేల్లో మే మొదటి వారంలో సీహెచ్‌సీలను గ్రౌండింగ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది.
ఖర్చులు తగ్గించి రాబడి పెరిగేలా..
రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, మెరుగైన ఆదాయం పొందడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే సన్న, చిన్న కారు రైతులకు అందుబాటులోకి తెచ్చింది. రూ.2,106 కోట్ల వ్యయంతో ఆర్బీకేల స్థాయిలో ఒక్కొక్కటి రూ.15 లక్షల విలువ గల 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.25 లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
ఇప్పటికే 6,525 ఆర్బీకేల స్థాయిలో 391 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను నెలకొల్పగా రైతుల వినతి మేరకు రూ.175 కోట్ల వ్యయంతో 3,800 ట్రాక్టర్లను రైతు కమిటీలకు అందించింది. సీహెచ్‌సీల కోసం 40 శాతం సబ్సిడీ రూపంలో రూ.240.67 కోట్లను ఖర్చు చేసింది. పంటల సరళి, స్థానిక డిమాండ్ బట్టి యంత్ర పరికరాల ఎంపిక, నిర్వహణ బాధ్యతలను రైతు గ్రూపులకే అప్పగించింది. పరికరాలు, అద్దె, వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. మిగిలిన ఆర్బీకేల్లో కూడా సత్వరమే యంత్రసేవా కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ఇటీవల సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో ఆ మేరకు చర్యలు చేపట్టారు.
జూలైలో కనీసం 500 ఆర్బీకేల్లో డ్రోన్లు
ఆర్బీకేల స్థాయిలో 2 వేల కిసాన్ డ్రోన్లను అందుబాటులోకి తేవడంలో భాగంగా జూలైలో కనీసం 500 ఆర్బీకేల్లో డ్రోన్లతో పాటు వ్యక్తిగతంగా 7 లక్షల మంది రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్ల పంపిణీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. మిగిలిన 4,225 ఆర్బీకేల్లో సీహెచ్‌సీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 3,594 ఆర్బీకేల్లో గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది.
ఇప్పటి వరకు 1,532 గ్రూపులు ట్రాక్టర్లు కావాలని ప్రతిపాదించడంతో కోరుకున్న కంపెనీలకు చెందినవి సమకూర్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా గ్రూపుల ఎంపిక, రుణాల మంజూరు ప్రక్రియ పూర్తి చేసి మే మొదటి వారంలో నూరు శాతం యూనిట్లు గ్రౌండింగ్ లక్ష్యంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే 391 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటు చేయగా మిగిలిన జిల్లాల పరిధిలో జిల్లాకు కనీసం ఐదు కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో కూడిన సీహెచ్‌సీల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.
కూలీల వెతలు తీరాయి..
మా గ్రామం మండల కేంద్రానికి 13 కి.మీ. దూరంలో ఉంది. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం ఎంతో ఇబ్బంది పడ్డాం. యంత్రాల కోసం సీజన్‌లో ముందే బయానా ఇచ్చి రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అడిగినంతా ఇస్తే కానీ వచ్చేవారు కాదు. ఇప్పుడు ఆర్బీకే ద్వారా రైతుగ్రూపుగా ఏర్పడి రూ.2.17 లక్షల విలువైన యంత్రాలను తీసుకున్నాం. మా వ్యవసాయ అవసరాలకు వాడుకోవడంతోపాటు మిగిలిన రైతులకు అద్దెకిస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. – జి.రాఘవకుమారి, కన్వి నర్, శ్రీలక్ష్మీనరసింహ సీహెచ్‌సీ గ్రూపు, దేవవరం, అనకాపల్లి జిల్లా
మిగిలిన చోట్ల వచ్చే నెలే గ్రౌండింగ్
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో అన్ని ఆర్బీకేల్లో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాం. ఇప్పటికే 6,525 ఆర్బీకేల్లో సీహెచ్‌సీలు ఏర్పాటయ్యాయి. మిగిలిన 4,225 ఆర్బీకేల్లో మే మొదటి వారంలో సీహెచ్‌సీలను సీఎం జగన్ చేతుల మీదుగా గ్రౌండింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
–చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment