Advanced equipment
-
అన్ని ఆర్బీకేల్లో యంత్ర సేవా కేంద్రాలు!
సాక్షి, అమరావతి: వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విత్తనం నుంచి కోత వరకు రైతులెదుర్కొంటున్న కూలీల వెతలకు చెక్ పెట్టింది. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ప్రతి ఆర్బీకే పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో (సీహెచ్‌సీ) అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. నూరు శాతం ఆర్బీకేల్లో సీహెచ్‌సీల ఏర్పాటు లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇప్పటికే 6,525 ఆర్బీకేల పరిధిలో అందుబాటులోకి రాగా మిగిలిన 4,225 ఆర్బీకేల్లో మే మొదటి వారంలో సీహెచ్‌సీలను గ్రౌండింగ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఖర్చులు తగ్గించి రాబడి పెరిగేలా.. రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, మెరుగైన ఆదాయం పొందడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే సన్న, చిన్న కారు రైతులకు అందుబాటులోకి తెచ్చింది. రూ.2,106 కోట్ల వ్యయంతో ఆర్బీకేల స్థాయిలో ఒక్కొక్కటి రూ.15 లక్షల విలువ గల 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.25 లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 6,525 ఆర్బీకేల స్థాయిలో 391 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను నెలకొల్పగా రైతుల వినతి మేరకు రూ.175 కోట్ల వ్యయంతో 3,800 ట్రాక్టర్లను రైతు కమిటీలకు అందించింది. సీహెచ్‌సీల కోసం 40 శాతం సబ్సిడీ రూపంలో రూ.240.67 కోట్లను ఖర్చు చేసింది. పంటల సరళి, స్థానిక డిమాండ్ బట్టి యంత్ర పరికరాల ఎంపిక, నిర్వహణ బాధ్యతలను రైతు గ్రూపులకే అప్పగించింది. పరికరాలు, అద్దె, వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. మిగిలిన ఆర్బీకేల్లో కూడా సత్వరమే యంత్రసేవా కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ఇటీవల సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో ఆ మేరకు చర్యలు చేపట్టారు. జూలైలో కనీసం 500 ఆర్బీకేల్లో డ్రోన్లు ఆర్బీకేల స్థాయిలో 2 వేల కిసాన్ డ్రోన్లను అందుబాటులోకి తేవడంలో భాగంగా జూలైలో కనీసం 500 ఆర్బీకేల్లో డ్రోన్లతో పాటు వ్యక్తిగతంగా 7 లక్షల మంది రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్ల పంపిణీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. మిగిలిన 4,225 ఆర్బీకేల్లో సీహెచ్‌సీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 3,594 ఆర్బీకేల్లో గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. ఇప్పటి వరకు 1,532 గ్రూపులు ట్రాక్టర్లు కావాలని ప్రతిపాదించడంతో కోరుకున్న కంపెనీలకు చెందినవి సమకూర్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా గ్రూపుల ఎంపిక, రుణాల మంజూరు ప్రక్రియ పూర్తి చేసి మే మొదటి వారంలో నూరు శాతం యూనిట్లు గ్రౌండింగ్ లక్ష్యంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే 391 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటు చేయగా మిగిలిన జిల్లాల పరిధిలో జిల్లాకు కనీసం ఐదు కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో కూడిన సీహెచ్‌సీల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. కూలీల వెతలు తీరాయి.. మా గ్రామం మండల కేంద్రానికి 13 కి.మీ. దూరంలో ఉంది. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం ఎంతో ఇబ్బంది పడ్డాం. యంత్రాల కోసం సీజన్లో ముందే బయానా ఇచ్చి రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అడిగినంతా ఇస్తే కానీ వచ్చేవారు కాదు. ఇప్పుడు ఆర్బీకే ద్వారా రైతుగ్రూపుగా ఏర్పడి రూ.2.17 లక్షల విలువైన యంత్రాలను తీసుకున్నాం. మా వ్యవసాయ అవసరాలకు వాడుకోవడంతోపాటు మిగిలిన రైతులకు అద్దెకిస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. – జి.రాఘవకుమారి, కన్వి నర్, శ్రీలక్ష్మీనరసింహ సీహెచ్‌సీ గ్రూపు, దేవవరం, అనకాపల్లి జిల్లా మిగిలిన చోట్ల వచ్చే నెలే గ్రౌండింగ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అన్ని ఆర్బీకేల్లో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాం. ఇప్పటికే 6,525 ఆర్బీకేల్లో సీహెచ్‌సీలు ఏర్పాటయ్యాయి. మిగిలిన 4,225 ఆర్బీకేల్లో మే మొదటి వారంలో సీహెచ్‌సీలను సీఎం జగన్ చేతుల మీదుగా గ్రౌండింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
వైద్య పరికరాల కొనుగోలుకు రూ. 16 కోట్లు
ప్రభుత్వ ఆస్పత్రిలో అవసరమైన పరికరాల కొనుగోలుకు రూ. 16 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిని సందర్శించిన ఆయన ఐసీయూలో నూతనంగా ఏర్పాటు చేసిన డయగ్నస్టిక్ ల్యాబరేటరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రులలో అధునాతన పరికరాలు కొనుగోలు చేస్తామని అందుకోసం తక్షణం రూ. 16 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. -
ప్రసూతి ఆస్పత్రికి మహర్దశ
అదనంగా రూ.57.2 కోట్ల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం 57.30 కోట్లతో మూడువందల పడకల సామర్థ్యంతో భవన నిర్మాణం రూ.20 కోట్లతో అధునాతన పరికరాల కొనుగోలుకు వెసులుబాటు..! తిరుపతి : రూయా ఆస్పత్రి పరిధిలోని ప్రసూతి(మెటర్నిటీ) ఆస్పత్రికి మహర్దశ పట్టనుంది. మూడు వందల పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆస్పత్రికి అదనంగా రూ.57.2 కోట్లను మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. మెటర్నిటీ ఆస్పత్రి అంచనా వ్యయం రూ.77.30 కోట్లకు పెంచినట్లు వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ.సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. వివరాల్లోకి వెళితే.. రాయలసీమలో ప్రత్యేకమైన ప్రసూతి ఆసుపత్రి ఒక్క రుయా పరిధిలో మాత్రమే ఉంది. ప్రసూతి ఆసుపత్రికి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గర్భిణులు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ.20.10 కోట్లతో వంద పడకల ప్రసూతి ఆసుపత్రి భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మార్చి 29, 2012న ఉత్తర్వులు జారీచేసింది. భవన నిర్మాణ స్థాయిని వంద పడకల నుంచి మూడు వందల పడకలకు పెంచాలని డిసెంబర్ 14, 2012న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇందుకు రూ.57.20 కోట్లను(రూ.37.20 కోట్లతో భవన నిర్మాణం.. రూ.20 కోట్లతో అధునాత పరికరాల కొనుగోలు) మంజూరు చేయాలని కోరింది. ఇందుకు ఆమోదం తెలిపిన కేంద్రం 2013-14లో రూ.20 కోట్లు.. 2014-15లో రూ.37.20 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించింది. 2013-14లో రూ.20 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. ఈ ఆర్థిక సంవత్సరం నిధులు ఇప్పటిదాకా విడదల చేయలేదు. దాంతో.. భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ భవనాన్ని స్విమ్స్ నేతృత్వంలోని శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రుయా ఆసుపత్రి వర్గాలు.. జూనియర్ డాక్టర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసూతి ఆసుపత్రికే ఆ భవనాన్ని కేటాయించాలంటూ భారీ ఎత్తున ఉద్యమించారు. ఈ వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. సెప్టెంబర్‌లో రుయా ఆసుపత్రికి వెళ్లిన తిరుపతి ఎంపీ వరప్రసాద్.. మూడు వందల పడకల ఆసుపత్రి స్థితిగతులపై సమీక్షించారు. కేంద్రం 2014-15లో నిధులు విడుదల చేయని విషయాన్ని రుయా అధికారవర్గాలు ఎంపీ దృష్టికి తీసుకొచ్చాయి. నిధుల విడుదలపై కేంద్రంతో చర్చిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ.. అదనంగా నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అదనంగా రూ.20.10 కోట్లు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 27న ప్రతిపాదనలు పంపారు. అంటే.. ప్రసూతి ఆసుపత్రికి నేషనల్ హెల్త్ మిషన్ కింద మొత్తం రూ.77.30 కోట్లను మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపినట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రతిపాదలనపై కేంద్రం ఆమోదముద్ర వేసింది. రూ.57.30 కోట్లతో మూడు వందల పడకల సామర్థ్యంతో భవన నిర్మాణం.. రూ.20 కోట్లతో అధునాతన పరికరాలు కొనుగోలు చేయాలని కేంద్రం సూచించింది. నిధులను సకాలంలో విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించడంతో రుయాలోని ప్రసూతి ఆసుపత్రి భవన నిర్మాణం వేగం పుంజుకోనుంది. మూడు వందల పడకల ఆసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. గర్భిణులకు సమస్యలు తీరినట్లవుతుందని రుయా అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
అధ్వానంగా అగ్నిమాపక శాఖ
సాక్షి, ముంబై: ముంబై అగ్నిమాపక శాఖ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది. సేవలందించడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ముంబై అగ్నిమాపకశాఖ అగ్రస్థానంలో ఉంది. అరకొర సౌకర్యాలు, నిర్వహణ సక్రమంగా లేక అనేక ఫైరింజన్లు తుప్పుపట్టి మూలుగుతున్నాయి. ముంబై అగ్నిమాపక శాఖకు మొత్తం 202 అగ్నిమాపక శకటాలు ఉన్నాయి. ఇందులో ఆరు టర్న్ టేబుల్ ల్యాడర్స్ (నిచ్చెనలతో కూడినవి) ఉండగా రెండు పనిచేయడం లేదు. అదే విధంగా పది పెద్ద స్నార్కెల్స్ ఉండగా అందులో మూడు పని చేయడం లేదు. వీటి నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు కేవలం 52 మంది సిబ్బంది ఉన్నారు. ఇటీవల ఈ శాఖ అధీనంలోకి వచ్చిన అత్యాధునిక ఫైరింజన్లకు మరమ్మతులు చేయడంపై సిబ్బందికి ఇంతవరకు శిక్షణ ఇవ్వలేదు. వీటికి మరమ్మతులు చేయాలంటే సంబంధిత కంపెనీ సిబ్బంది రావాలి లేదా వాటిని అలాగే వదిలేయాలి. ఇటీవల అంధేరిలోని లోటస్ బిజినెస్ పార్క్ భవనంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనాస్థలానికి బైకల్లా నుంచి బయల్దేరిన నుంచి బయలుదేరిన స్నార్కెల్ ఫైరింజన్ టైరు వర్లీ సీలింకు సమీపంలో పంక్చరయింది. టైరు మార్చేందుకు వాహనంలో స్టెప్నీ కూడా లేకపోవడంతో అది అక్కడే నిలిచిపోయింది. చివరకు గ్యారేజీలో తుప్పుపట్టి పడి ఉన్న ఓ వాహనం టైరు తీసుకొచ్చి మార్చారు. ఆ తరువాత ఈ వాహనం అంధేరికి చేరుకునే సరికి సాయంత్రమయింది. అప్పటికే స్థానిక అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కోట్లు ఖర్చుచేసి కొనుగోలుచేసిన స్నార్కెల్ ఫైరింజన్ ఆపద సమయంలో ఉపయోగపడకుండా పోయింది. నిబంధనల ప్రకారం ప్రతీ 10 ఫైరింజన్ల మరమ్మతులు, నిర్వహణకు 13 మందిని కేటాయించాలి. ముంబైలో 202 వాహనాలకు 54 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. సిబ్బంది సంఖ్యను పెంచడానికి 2010 నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఫలించలేదు. దీంతో గ్యారేజీల్లో అత్యవసర పనులు మాత్రమే చేపడుతున్నారు. ముంబైకర్ల భద్రత కోసం ఆధునిక ఫైరింజన్లు కొనుగోలు చేస్తామని మంత్రులు హామీ ఇస్తున్నారు. మరమ్మతులకు నోచుకోలేక గ్యారేజీల్లో మూలుగుతున్న వాహనాల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక్కడి మెకానిక్‌లకు ఆధునిక యంత్రాలను ఎలా రిపేరు చేయాలో శిక్షణ ఇవ్వలేదు. అనేక సందర్భాలలో విదేశాల నుంచి ఇంజినీర్లను పిలిపించాల్సి వచ్చింది. అప్పటి వరకు ఫైరింజన్లు అలాగే పడి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా భారీ అగ్ని ప్రమాదం జరిగినా అత్యాధునిక ఫైరింజన్లను వినియోగించుకోలేకపోతున్నారు. గ్యారేజీ సిబ్బంది సంఖ్య పెంచడంతోపాటు వారికి ఆధునిక వాహనాలపై శిక్షణ ఇస్తే ప్రమాదాలను చాలా వరకు నియంత్రించవచ్చని భావిస్తున్నారు.