సాక్షి, ముంబై: ముంబై అగ్నిమాపక శాఖ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది. సేవలందించడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ముంబై అగ్నిమాపకశాఖ అగ్రస్థానంలో ఉంది. అరకొర సౌకర్యాలు, నిర్వహణ సక్రమంగా లేక అనేక ఫైరింజన్లు తుప్పుపట్టి మూలుగుతున్నాయి. ముంబై అగ్నిమాపక శాఖకు మొత్తం 202 అగ్నిమాపక శకటాలు ఉన్నాయి. ఇందులో ఆరు టర్న్ టేబుల్ ల్యాడర్స్ (నిచ్చెనలతో కూడినవి) ఉండగా రెండు పనిచేయడం లేదు. అదే విధంగా పది పెద్ద స్నార్కెల్స్ ఉండగా అందులో మూడు పని చేయడం లేదు. వీటి నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు కేవలం 52 మంది సిబ్బంది ఉన్నారు.
ఇటీవల ఈ శాఖ అధీనంలోకి వచ్చిన అత్యాధునిక ఫైరింజన్లకు మరమ్మతులు చేయడంపై సిబ్బందికి ఇంతవరకు శిక్షణ ఇవ్వలేదు. వీటికి మరమ్మతులు చేయాలంటే సంబంధిత కంపెనీ సిబ్బంది రావాలి లేదా వాటిని అలాగే వదిలేయాలి. ఇటీవల అంధేరిలోని లోటస్ బిజినెస్ పార్క్ భవనంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనాస్థలానికి బైకల్లా నుంచి బయల్దేరిన నుంచి బయలుదేరిన స్నార్కెల్ ఫైరింజన్ టైరు వర్లీ సీలింకు సమీపంలో పంక్చరయింది. టైరు మార్చేందుకు వాహనంలో స్టెప్నీ కూడా లేకపోవడంతో అది అక్కడే నిలిచిపోయింది. చివరకు గ్యారేజీలో తుప్పుపట్టి పడి ఉన్న ఓ వాహనం టైరు తీసుకొచ్చి మార్చారు.
ఆ తరువాత ఈ వాహనం అంధేరికి చేరుకునే సరికి సాయంత్రమయింది. అప్పటికే స్థానిక అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కోట్లు ఖర్చుచేసి కొనుగోలుచేసిన స్నార్కెల్ ఫైరింజన్ ఆపద సమయంలో ఉపయోగపడకుండా పోయింది. నిబంధనల ప్రకారం ప్రతీ 10 ఫైరింజన్ల మరమ్మతులు, నిర్వహణకు 13 మందిని కేటాయించాలి. ముంబైలో 202 వాహనాలకు 54 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. సిబ్బంది సంఖ్యను పెంచడానికి 2010 నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఫలించలేదు.
దీంతో గ్యారేజీల్లో అత్యవసర పనులు మాత్రమే చేపడుతున్నారు. ముంబైకర్ల భద్రత కోసం ఆధునిక ఫైరింజన్లు కొనుగోలు చేస్తామని మంత్రులు హామీ ఇస్తున్నారు. మరమ్మతులకు నోచుకోలేక గ్యారేజీల్లో మూలుగుతున్న వాహనాల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఇక్కడి మెకానిక్‌లకు ఆధునిక యంత్రాలను ఎలా రిపేరు చేయాలో శిక్షణ ఇవ్వలేదు. అనేక సందర్భాలలో విదేశాల నుంచి ఇంజినీర్లను పిలిపించాల్సి వచ్చింది. అప్పటి వరకు ఫైరింజన్లు అలాగే పడి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా భారీ అగ్ని ప్రమాదం జరిగినా అత్యాధునిక ఫైరింజన్లను వినియోగించుకోలేకపోతున్నారు. గ్యారేజీ సిబ్బంది సంఖ్య పెంచడంతోపాటు వారికి ఆధునిక వాహనాలపై శిక్షణ ఇస్తే ప్రమాదాలను చాలా వరకు నియంత్రించవచ్చని భావిస్తున్నారు.
అధ్వానంగా అగ్నిమాపక శాఖ
Published Fri, Jul 25 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM
Advertisement