ఏపీ స్ఫూర్తితో సాగుతాం :కేరళ మంత్రి | Kerala Agriculture Minister Prasad Praises Andhra Pradesh Govt | Sakshi
Sakshi News home page

ఏపీ స్ఫూర్తితో సాగుతాం :కేరళ మంత్రి

Published Mon, Feb 27 2023 2:30 AM | Last Updated on Mon, Feb 27 2023 7:57 AM

Kerala Agriculture Minister Prasad Praises Andhra Pradesh Govt - Sakshi

ఏపీ వ్యవసాయ శాఖ తరఫున ఏర్పాటు చేసిన స్టాల్‌ను తిలకిస్తున్న కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్‌ తదితరులు

సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలో రైతులకు సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలుస్తోందని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్‌ ప్రశంసించారు. ఏపీ స్ఫూర్తితో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని, సాగుదారుల హక్కు చట్టం (సీసీఆర్సీ) తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఆర్బీకేల తరహాలో వన్‌స్టాప్‌ సొల్యూషన్‌ సెంటర్ల ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా ఆదాయం పొందడంపై వైగా–2023 ఇంటర్నేషనల్‌ సెమినార్‌  కేరళలోని తిరువనంతపురంలో ఆదివారం ప్రారంభమైంది.

వారం రోజుల పాటు జరగనున్న సెమినార్‌ను ఏపీ, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌ వ్యవసాయ శాఖల మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.ప్రసాద్, చందర్‌ కుమార్‌ ప్రారంభించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో ఏపీ దూసుకెళుతోందని ఈ సందర్భంగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి కొనియాడారు. ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అందిస్తున్న సేవలు అద్భుతమన్నారు. ల్యాబ్‌ టూ ల్యాండ్‌ కాన్సెప్ట్‌ కింద ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నామని, తమ రాష్ట్రంలోనూ ఆచరణలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. 

సీఎం జగన్‌ ఆలోచనల ఫలితమే ఆర్బీకేలు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు సంక్షేమం కోసం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ఆయన ఆలోచనల నుంచి పుట్టినవే వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలని సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆర్బీకేల ద్వారా పాడి, మత్స్య,డెయిరీ, బ్యాంకింగ్‌ సేవలన్నీ అందిస్తున్నామన్నారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

నాణ్యమైన ఇన్‌పుట్స్‌ అందించేందుకు నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ నెలకొల్పామన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆక్వా రంగానికి సబ్సిడీ విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. ఉచిత పంటల బీమా, వడ్డీలేని పంట రుణాలు, సీజన్‌ ముగియకుండానే పంట నష్టపరిహారం(ఇన్‌పుట్‌ సబ్సిడీ), రైతు క్షేత్రం వద్దే పంట ఉత్పత్తుల కొనుగోలు చేపట్టామన్నారు. రైతులను ఆదుకునేలా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు వివరించారు.  

ఆకట్టుకున్న ఏపీ స్టాల్‌ 
వైగా–2023 ఇంటర్నేషనల్‌ సెమినార్‌లో ఆంధ్రప్రదేశ్‌ తరపున ఏర్పాటు చేసిన స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్బీకే నమూనాతో పాటు వ్యవసాయ–అనుబంధ రంగాలలో తీసుకొచ్చిన సంస్కరణలు, గ్రామ స్థాయిలో అందిస్తున్న సేవలను కళ్లకు కట్టినట్టుగా స్టాల్‌ ద్వారా ప్రదర్శించారు. సెమినార్‌కు హాజరైన వివిధ రాష్ట్రాల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు ఏపీ స్టాల్‌ను సందర్శించి ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

పర్యటనలో మంత్రి కాకాణితో పాటు ఏపీ ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్లు డాక్టర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్, రాహుల్‌ పాండే, ఏపీసీడ్స్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సీఈవో ఎల్‌.శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement