ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టు | Sakshi Hyderabad Vibes Special Story On Hair Care | Sakshi
Sakshi News home page

ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టు

Published Fri, Nov 15 2024 8:49 AM | Last Updated on Fri, Nov 15 2024 8:49 AM

Sakshi Hyderabad Vibes Special Story On Hair Care

నగర వాతావరణం, కాలుష్యమూ కారణమే!

కాఫీ నుంచి కాలుష్యం దాకా.. కాదేదీ కాటుకు అనర్హం
కొన్ని ప్రాంతాల్లో దొరికే నీళ్లు సైతం కారణమే
అవగాహన పెంచుకొని అలవాట్లు మార్చుకోవాలి 
జుట్టు రక్షణకు పలు సూచనలు చేస్తున్న వైద్యులు

ధునిక సాంకేతిక మార్పులతో పాటు నగరవాసుల జీవనశైలి మార్పులు కూడా హెయిర్‌కి టెర్రర్‌గా మారుతున్నాయి. బిజీ లైఫ్‌లో పట్టించుకోని, మార్చుకోలేని అలవాట్లు సిటిజనుల కేశ సంపదను కొల్లగొడుతున్నాయి. సమయానికి తినడం తప్ప సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం తగ్గిపోతోంది. జంక్‌ ఫుడ్‌ వినియోగంతో కేశాల ఆరోగ్యానికి అత్యవసరమైన ఐరన్, జింక్, బయోటిన్‌ అందడం లేదు. కాబట్టి ఆహారంలో తప్పనిసరిగా గుడ్లు, చేపలు, పాలకూర వంటి ఆకుకూరలు, గింజలు, లీన్‌ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. మంచినీళ్లు 2 నుంచి 3 లీటర్లు తాగాలి. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌ లభించే డ్రైఫ్రూట్స్, నట్స్‌ తీసుకోవాలి. 

స్టైలింగ్‌.. కిల్లింగ్‌.. 
జుట్టు పొడిబారడానికి హెయిర్‌ డ్రైయర్‌లు, స్ట్రెయిట్‌నెర్‌లు ఉపయోగించడం వల్ల జుట్టు విరిగిపోతోంది. పోనీటెయిల్స్‌ లేదా బ్రెయిడ్స్‌ వంటి బిగుతు హెయిర్‌ స్టైల్స్‌తో ట్రాక్షన్‌ అలోపేసియా అనే పరిస్థితికి గురై జుట్టు రాలిపోతుంది. కాబట్టి హీట్‌–ఫ్రీ స్టైలింగ్‌ పద్ధతులను, స్టైలింగ్‌ చేసేటప్పుడు హీట్‌ ప్రొటెక్షన్‌ ఉత్పత్తులను ఉపయోగించాలి. జుట్టు షాఫ్ట్‌లపై ఒత్తిడి తగ్గించడానికి వదులుగా ఉండే కేశాలంకరణను ఎంచుకోవాలి. ఫ్యాషన్‌ కోసం పెరమ్స్, రిలాక్సర్‌ల మితిమీరిన రంగుల వినియోగం, రసాయన చికిత్సలతో జుట్టు నిర్మాణం బలహీనపడుతోంది.  

అలవాట్లు.. జుట్టుకు పోట్లు.. 
నగర యువతలో పెరిగిన ధూమపానం, ఆల్కహాల్‌ వినియోగం రెండూ కేశాలకు నష్టం కలుగజేస్తున్నాయి. ఈ అలవాట్లతో రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల చక్కని హెయిర్‌ కోసం ఖచి్చతంగా ధూమపానం మానేయడంతో పాటు మద్యపానాన్ని బాగా తగ్గించడం అవసరం.  

ఉపరితలం.. ఇలా క్షేమం.. 
తల ఉపరితలం(స్కాల్ప్‌) తరచుగా నగరవాసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది జుట్టుకు హాని చేస్తోంది కాబట్టి స్కాల్ప్‌ను శుభ్రంగా తేమగా ఉంచుకోవడం అవసరం. అవసరాన్ని బట్టి హెయిర్‌ ఫోలికల్స్‌ను పోషించడానికి ఉత్తేజపరిచేందుకు అందుబాటులో ఉన్న ఉత్పత్తులను ఉపయోగించవచ్చు.  

కదలికతో కేశాలకు మేలెంతో.. 
కూర్చుని పనిచేయడం, ఎక్కడకు వెళ్లాలన్నా వాహనాల వినియోగం.. ఇలా కదలికలు తగ్గిపోతున్న నగరవాసుల నిశ్చల జీవనశైలి రక్తప్రసరణ లోపానికి దారి తీస్తోంది. తలపై భాగానికి రక్త ప్రసరణ లేకపోవడం కేశాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి శారీరక శ్రమ అవసరం.  

నీళ్లూ.. నష్టమే.. 
సిటీలో కొన్ని ప్రాంతాల్లో సాల్ట్స్‌ ఎక్కువగా ఉండే హార్డ్‌ వాటర్‌తో స్నానం చేస్తున్నారు. దీంతో తలలో ఉండే సహజమైన నూనెలు ఆవిరై తల ఉపరితలం పొడిబారి కేశాలు దెబ్బతింటాయి.

నిద్రలేమీ.. ఓ సమస్యే..
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల విషయంలో నిర్లక్ష్యం హెయిర్‌పై దు్రష్పభావం చూపిస్తోంది. గుర్తించిన థైరాయిడ్‌ వంటి వ్యాధులు లేదా గుర్తించలేని హార్మోన్ల అసమతుల్యత వంటివి.. జుట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఆరోగ్య సమస్యలను గుర్తించడం తగిన చికిత్స పొందడం అవసరం. అలాగే నిద్రలేమి సిటీలో సర్వసాధారణమైపోయింది. ఇది జుట్టు పెరుగుదల వంటి శరీరపు సహజ ప్రక్రియలను నిరోధిస్తోంది. ప్రతి రాత్రి 7–9 గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరి.  

వ్యాధులుంటే.. నష్టమే.. 
థైరాయిడ్‌ వంటి దీర్ఘకాలిక రుగ్మతలు మాత్రమే కాకుండా హార్మోన్ల అసమతుల్యత వంటివి కేశాలకు హాని చేస్తాయి. కాబట్టి అంతర్లీన ఆరోగ్య సమస్యలను గుర్తించి, ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించాలి. లక్ష్యసాధన కోసం పరుగుతో దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి జుట్టు ఆరోగ్యంపై పడుతోంది. ఒత్తిడికి విరుగుడుగా ధ్యానం, యోగా బ్రీతింగ్‌ వ్యాయామాలు చేయాలి.  

కారణాలెన్నో.. జాగ్రత్తలు తప్పనిసరి.. 
మన జుట్టులో 80శాతం ఎదిగే దశలో ఉంటే 12 నుంచి 13శాతం విశ్రాంతి దశ, మరో 7 నుంచి 8శాతం మృత దశలో ఉంటుంది. అనారోగ్యపు అలవాట్ల వల్ల గ్రోత్‌ దశలో ఉండాల్సిన 80శాతం 50 శాతానికి అంతకంటే తక్కువకు పడిపోయి డీలోజన్‌ ఫేజ్‌ అనే దశకు చేరి హెయిర్‌ ఫాల్‌ జరుగుతుంది. రోజుకు 60 నుంచి అత్యధికంగా 100దాకా వెంట్రుకలు ఊడటం సాధారణం కాగా.. ఈ సంఖ్య 200కి చేరితే తీవ్రమైన హెయిర్‌ఫాల్‌గా గుర్తిస్తాం. నివారణ కోసం సల్ఫేట్‌ ఫ్రీ షాంపూల వాడకం, వారానికి ఒక్కసారైనా హెయిర్‌ కండిషనర్‌ గానీ హెయిర్‌ మాస్క్‌ గానీ వాడటం అవసరం. అలాగే కాలుష్యం బారిన పడకుండా అవుట్‌డోర్‌ వెళ్లినప్పుడు మహిళలు చున్నీ, స్కార్ఫ్‌ మగవాళ్‌లైతే హెల్మెట్‌ వంటివి తప్పనిసరి. జాగ్రత్తలు తీసుకున్నా కేశాల ఆరోగ్యం సరిగా లేదంటే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి.  


:::డా.జాన్‌వాట్స్, డెర్మటాలజిస్ట్, సీనియర్‌ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement