నాలుగు మెడికల్‌ కాలేజీలకే ఎన్‌ఎంసీ అనుమతి | NMC gives permission to only four medical colleges in telangana | Sakshi
Sakshi News home page

నాలుగు మెడికల్‌ కాలేజీలకే ఎన్‌ఎంసీ అనుమతి

Published Fri, Aug 2 2024 5:22 AM | Last Updated on Fri, Aug 2 2024 5:22 AM

NMC gives permission to only four medical colleges in telangana

ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీలకు గ్రీన్‌సిగ్నల్‌

ఈ వైద్య విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా నాలుగు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ (ఎల్‌ఓపీ) జారీ చేసింది. ప్రభుత్వం ఈ ఏడాదికి  8 కాలేజీల కోసం దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. వాటిలో నాలుగింటికే అనుమతులొచ్చాయి. ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట మెడికల్‌ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి వైద్యవిద్య ప్రవేశాలకు ఎన్‌ఎంసీ పచ్చజెండా ఊపింది. 

యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్‌ కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతులు ఇవ్వలేదు. వీటి ఎల్‌ఓపీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అప్పీల్‌కు వెళ్లనుంది. కాగా, గత నెల ఈ కాలేజీలన్నింటికీ అనుమతులు ఇవ్వలేమని ఎన్‌ఎంసీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో తమకు మరో అవకాశం ఇవ్వాలని, లోపాలను సరిచేసుకుంటామని ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. ఆ తర్వాత అధ్యాపకులను నియమించింది. 245 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించింది. కొత్త కాలేజీలకు పోస్టు చేసింది.

ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా ఆ కాలేజీలకు రెగ్యులర్‌ ప్రిన్సిపాల్స్, ఆస్పత్రుల సూపరింటెండెంట్లను పంపింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌లో కలిపి 56 మెడికల్‌ కాలేజీలున్నాయి. వాటిల్లో మొత్తం కలిపి 8,515 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు 28 ఉండగా..వాటిలో 3,915 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. వీటికి అదనంగా మరో 200 సీట్లు కలవనున్నాయి. ఒక్కో కొత్త కాలేజీల్లో  50 సీట్ల కోసం అనుమతులు కోరుతూ దరఖాస్తు చేశారు. వాటిలో నాలుగింటికి అనుమతులొచ్చాయి. దీంతో సర్కారీ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 4,115కు చేరనుంది. 

రాష్ట్రానికి చేరుకున్న నీట్‌ ర్యాంకులు 
కాగా నీట్‌ రాష్ట్రస్థాయి ర్యాంకులు తెలంగాణకు చేరుకున్నాయి. ఈ మేరకు కాళోజీ విశ్వవిద్యాలయవర్గాలు ఢిల్లీకి వెళ్లి ఆ డేటాను తీసుకొచ్చాయి. ఆ డేటాను విశ్లేషించి రాష్ట్రస్థాయి ర్యాంకులు తయారు చేసి శనివారం విడుదల చేసే అవకాశముంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement