Telangana: రేపు అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌ | Congress Govt Declares Job Calendar In Assembly On August 2 | Sakshi
Sakshi News home page

Telangana: రేపు అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌

Published Thu, Aug 1 2024 9:00 PM | Last Updated on Thu, Aug 1 2024 9:04 PM

Congress Govt Declares Job Calendar In Assembly On August 2

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌బోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్‌ను కేబినేట్ ఆమోదించిందని పేర్కొన్నారు. అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో మంత్రివ‌ర్గ స‌మావేశం ముగిసిన అనంత‌రం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ..

‘కేరళలో వయనాడ్‌లో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినేట్ సంతాప తీర్మానం ఆమోదించింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేయడంతోపాటు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకు వచ్చింది. రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్‌తో హెల్త్ కార్డులను జారీ చేయాలని కేబినెట్ చర్చించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవెన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, సివిల్ సప్లయిస్ మంత్రితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వ‌ర‌లోనే అర్హులైన పేద‌లంద‌రికి కొత్త రేష‌న్ కార్డులు జారీ చేస్తాం.

క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్‌కు, సిరాజ్‌కు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్‌కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది

గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినేట్ చర్చించింది. ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ పేర్లను మరోసారి గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. అవసరమైతే ఇథనాల్, విద్యుత్తు ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చర్చించింది. ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆ బాధ్యతలు అప్పగించింది. 

మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్‌పేట చెరువు నింపి, అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగ‌ర్‌కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 15 టీఎంసీలను తరలించి, అందులో 10 టీఎంసీలతో చెరువులు నింపి, మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించిన‌ట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ప‌ష్టం చేశారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement