AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌ | Probation For Employees Of Secretariat Who Got Jobs Through Second Phase Notification - Sakshi
Sakshi News home page

AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌

Published Tue, Apr 18 2023 8:18 AM | Last Updated on Tue, Apr 18 2023 3:28 PM

Probation For Employees Of Secretariat Who Got Jobs Through Second Phase Notification - Sakshi

సాక్షి, అమరావతి: రెండో విడత నోటిఫికేషన్‌ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారికి కూడా ప్రొబేషన్‌ ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభు­త్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 సం­వత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ ద్వారా ఉ­ద్యో­గాలు పొందిన వీరు ప్రస్తుతం రూ.15 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్నారు. ప్రొబేషన్‌ ఖరా­రు అనంతరం దాదాపు రెట్టింపు జీతం అందుకుంటారు.

గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రొబే­షన్‌ ఖరారైన గ్రేడ్‌ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మిని్రస్టేటివ్‌ సెక్రటరీలు ఇప్పుడు కనీస బేసిక్‌ వేతనం రూ.23,120 కాగా, డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకున్న తర్వాత రూ. 29,598 అందుకుంటారు. మిగిలిన 17 విభాగాల ఉద్యోగులు ఇప్పుడు కనీస బేసిక్‌ వేతనం రూ.22,460కు డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకొని రూ. 28,753 అందుకుంటారని అధికారవర్గాలు తెలిపాయి.

పట్టణ ప్రాంతాల్లో హెచ్‌­ఆర్‌ఏ స్లాబు ప్రకారం కొంత మందికి కొంచెం ఎక్కువ వేతనం వస్తుంది. పెరిగిన వేతనాలు మే 1 నుంచి (అంటే జూన్‌ ఒకటిన ఉద్యోగులకు అందే జీతం) అమలులోకి వస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రొబేషన్‌ ఖరారు ఉత్తర్వుల విడుదల నేపథ్యంలో.. జిల్లాల్లో వేర్వేరుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తారు. నిబంధనల ప్రకారం.. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్ట్‌మెంట్‌ టెస్టులో ఉత్తీర్ణత సాధించి, ఎటువంటి నేర చరిత్ర లేదని పోలీసు రిపోర్టుల్లో తేలిన వారికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రొబేషన్‌ ఖరారు ప్రక్రియ కొనసాగుతుంది. 

1.34 లక్షల మందికి కొత్త ఉద్యోగాలిచ్చిన సీఎం జగన్‌ 
సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన రోజునే ప్రజల గడపవద్దకే ప్రభుత్వపాలన తీసుకొచ్చేందు­కు రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రక­టించారు. దీని ద్వారా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. జిల్లా సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) విధానంలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 1,26,728 ఉద్యోగాలకు, విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో మరో 9,600 ఎనర్జీ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 2019 జూలైలో నోటిఫికేషన్‌ జారీచేశారు.

నాలుగు నెలల్లో­నే రాత పరీక్షలు, నియామక ప్రక్రియ పూర్తిచేశారు. పంచాయతీరాజ్‌శాఖ నోటి­ఫికేషన్‌ ద్వారా 1,05,497 మంది ఉద్యోగాలు పొందగా.. అందులో నిబంధల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్ట్‌మెంట్‌ టెస్టు పాసైన 1,00,724 మంది (ఎనర్జీ అసిస్టెంట్లు కాకుండా)కి గత ఏడాది జూన్‌ నెలాఖరుకే ప్రభుత్వం ప్రొబేషన్‌ ఖరారు చేసింది. వారందరికీ గత ఏడాది జూలై ఒకటి నుంచి పే–స్కేలుతో కూడిన వేతనాలను ఇస్తోంది. మొదటి విడత నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులకు వెంటనే 2020లో నోటిఫికేసన్‌ జారీ చేయగా, మరో 12,837 మంది ఉద్యోగాలు పొందారు. వీరు ఇప్పుడు ప్రొబేషన్‌ పొంది మే 1 నుంచి పే స్కేలుతో కూడిన వేతనాలు అందుకోబోతున్నారు. మొదటి విడత ఉద్యోగుల్లో మిగిలినవారు నిబంధనల ప్రకారం అర్హత పొందిన వెంటనే ప్రొబేషన్‌ పొందుతారని అధికారులు వెల్లడించారు.

నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం జగన్‌
గ్రామ, వార్డు సచివాలయాలు సృష్టించి ఒకే విడతలో 1.34 లక్షల ఉద్యోగాలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. సీఎం జగన్‌కు మేమెప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. 
– గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, అదనపు ప్రధాన కార్యదర్శి బి.ఆర్‌.ఆర్‌. కిషోర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విప్పర్తి నిఖిల్‌ కృష్ణ

సీఎం జగన్‌ రుణం తీర్చుకుంటాం.. ఉద్యోగ సంఘాల హర్షం
గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండోవిడత ఉ­ద్యో­గాలు పొందిన వారికీ ప్రొబేషన్‌ ఖరారు చేసి­నందుకు ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ప్రభుత్వానికి, సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మీద ముఖ్యమంత్రి జగన్‌కున్న అభిమానానికి ఈ నిర్ణయాలే నిదర్శనమని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలా సచివాలయాల ఉద్యోగులు కష్టపడి పని చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రుణం తీర్చుకుంటారని చెప్పారు.
చదవండి: ఇంటింటా అభిమానం.. 55 లక్షల కుటుంబాల ప్రజలు మిస్డ్‌కాల్స్‌

వన్స్‌ ఎగైన్‌ థాంక్యూ సీఎం సార్‌
రెండో విడత నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలు పొ­ం­దిన  గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యో­గు­ల ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వన్స్‌ ఎగైన్‌ థాంక్యూ సీఎం సార్‌.  
– గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జాని పాషా, ప్రధాన కార్యదర్శి పుట్టి రత్నం, ఉపాధ్యక్షులు జి.హరీంద్ర, కె.రామకృష్ణా రెడ్డి, కె.కిరణ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement