సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలకు మొత్తం 19 రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలను గుర్తింపు కలిగిన జాతీయ పార్టీల జాబితాల నుంచి తొలగించి, మరికొన్నింటిని చేర్చడంతోపాటు రాష్ట్రాల్లో గుర్తింపు కలిగిన జాబితాలో మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్.. గుర్తింపు కలిగిన జాతీయ, రాష్ట్ర పార్టీల వివరాలతో ఈ కొత్త నోటిఫికేషన్‌ను జారీచేసింది.
రాష్ట్రంలో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో సహా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద జాతీయ పార్టీల గుర్తింపు ఉన్న ఆమ్ ఆద్మీ, బీఎస్సీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు ఆయా పార్టీల ఎన్నికల గుర్తులు కలిగి ఉంటాయని ఆ నోటిఫికేషన్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె.ఆర్.బి.హెచ్.ఎన్.చక్రవర్తి పేర్కొన్నారు. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ సహా వివిధ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన మరో 11 రాజకీయ పార్టీలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలుగా గుర్తిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఆయా రాజకీయ పార్టీల గుర్తులనే అవి కలిగి ఉంటాయని వివరించారు.
నిబంధనల ప్రకారం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణీత ఓట్ల శాతం గానీ, అసెంబ్లీలో సీట్ల సంఖ్యను గానీ పొందలేక, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రత్యేక గుర్తును కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీ జాబితాలో స్థానాన్ని కూడా కోల్పోయిన జనసేన పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ విత్ రిజర్వుడ్ సింబల్ (ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీగా) గుర్తిస్తున్నట్టు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రత్యేక గుర్తును కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీ జాబితాలో లేని పార్టీలకు సైతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తుల కేటాయింపు నిబంధనలు 5 (ఏ) (బీ) ప్రకారం.. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడైనా 15 ఎంపీటీసీ స్థానాలు లేదా మూడు జెడ్పీటీసీ స్థానాలు లేదా 15 మున్సిపల్ వార్డు స్థానాలు లేదా 15 నగర కార్పొరేషన్ వార్డులు గెల్చుకున్న పార్టీలకు ప్రత్యేక ఎన్నికల గుర్తు కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తిస్తుందని తెలిపారు.
దీనికి తోడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తుల కేటాయింపు నిబంధనలు 5 (ఏ) (బీ–1)ప్రకారం.. రాష్ట్ర అసెంబ్లీలో కనీస ఒక సభ్యుడు ఉన్న ప్రతి పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక రిజర్వు సింబల్‌ను పొందే అర్హత ఉంటుందని పేర్కొన్నారు. ఇంకొక 94 రాజకీయ పార్టీలను కూడ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ పార్టీలుగా గుర్తించినప్పటికీ, వాటికి మాత్రం ఎటువంటి రిజర్వు సింబల్ కేటాయించని పార్టీల జాబితాల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment