
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరి 5వ తేదీ నుంచి నాలుగు విడతల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శుక్రవారం షెడ్యూల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు చురుగ్గా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఉద్యోగులంతా ఆ విధుల్లో నిమగ్నమయ్యారని, ఎన్నికలు జరపాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిలు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలసి లిఖితపూర్వకంగా తెలియజేసిన కొద్దిసేపటికే నిమ్మగడ్డ ఏకపక్షంగా షెడ్యూల్‌ను ప్రకటించడం గమనార్హం.
ఫిబ్రవరి ఐదో తేదీన తొలిదశ పంచాయతీ ఎన్నికలు, 9, 13, 17వ తేదీల్లో మరో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహించి అదేరోజు కౌంటింగ్, సర్పంచి, ఉప సర్పంచి ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 25 నుంచి, మిగతా విడతల ఎన్నికలకు ఈ నెల 29, ఫిబ్రవరి 2, 6వ తేదీల నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.
నేటి నుంచి ఎన్నికల కోడ్: ఈనెల 9 (శనివారం) నుంచే ఎన్నికల నిబంధనావళి (కోడ్) అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కోడ్ వర్తిస్తుందని, పట్టణ ప్రాంతాల్లో వర్తించదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment