సాక్షి, అమరావతి: నంది నాటకోత్సవాలను అక్టోబర్ నెలలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో సెక్రటరీ, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ తుమ్మా విజయ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది నంది నాటకోత్సవాల్లో (రంగస్థల పురస్కారాలు) భాగంగా ఐదు విభాగాల్లో 73 అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
సోమవారం విజయవాడ ఆర్టీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో నంది నాటకోత్సవాల నిర్వహణపై నాటక రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల లఘు నాటిక, కళాశాల లేదా యూనివర్సిటీ లఘు నాటిక (ప్లేలెట్స్) అనే ఐదు విభాగాల్లో అవార్డులు అందజేయాలని నిర్ణయించామన్నారు.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇచ్చామని, అనంతరం వారం రోజులు దరఖాస్తుల ఉపసంహరణకు కేటాయించామని తెలిపారు. అందరికీ అనుకూలంగా ఉండే ప్రాంతాన్ని నంది నాటకోత్సవాలకు వేదికగా ఎంపిక చేస్తామని తెలిపారు.
ప్రదర్శితమైన నాటకాలకే అవకాశం
రాష్ట్రవ్యాప్తంగా 2018 నుంచి 2022 వరకు వివిధ నాటక సమాజాల ద్వారా ప్రదర్శించిన నాటకాలను ఈ ఏడాది నంది నాటకోత్సవాల్లో ఎంట్రీలకు అవకాశం కల్పిస్తున్నట్టు విజయ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంట్రీలను న్యాయ నిర్ణేతల ద్వారా పరిశీలించి తుది పోటీలకు 10 పద్య నాటకాలు, 6 సాంఘిక నాటకాలు, 12 సాంఘిక నాటికలు, 5 బాలల నాటికలు, 5 కళాశాల లేదా యూనివర్సిటీ యువత నాటికలను ఎంపిక చేస్తామన్నారు.
దరఖాస్తుల సంఖ్యను బట్టి వీటి సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. బాలలు, యువతకు సంబంధించిన నాటకాలకు సంబంధించి ఈ ఏడాది కొత్తగా ప్రదర్శించిన వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ప్రదర్శన, ఎంపిక సమయంలో నాటకరంగ కళాకారులుండే ప్రాంతానికే వచ్చి తమ జ్యూరీ బృందం పరిశీలిస్తుందన్నారు.
సరికొత్త కథాంశాలతో మన సంస్కృతి సంప్రదాయాలను, మానవతా విలువలను, ఉన్నతమైన జీవనాన్ని ప్రతిబింబించే అంశాలకు కళాకారులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చివరిసారిగా 2017లో నంది నాటకోత్సవాలు నిర్వహించామని, అనంతరం కరోనా విపత్కర పరిస్థితులతో నిర్వహించలేకపోయామన్నారు. కళాకారులకు ఆర్టీసి చార్జీల్లో రాయితీ ఇచ్చే విషయమై సంబంధిత విభాగంతో చర్చిస్తామన్నారు.
రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జీఎం ఎంవీఎల్‌ఎన్ శేషసాయి, కళారాధన సమితి కార్యదర్శి రవికృష్ణ నంద్యాల, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడారు. సమావేశం అనంతరం ‘తెలుగు పద్యనాటక రంగం– సాంకేతికత–సమకాలీన అధ్యయనం’ అంశంపై ఆర్.నిరుపమ సునేత్రి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment