Nandi nata kotsavalu
-
అక్టోబర్‌లో నంది నాటకోత్సవాలు
సాక్షి, అమరావతి: నంది నాటకోత్సవాలను అక్టోబర్ నెలలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో సెక్రటరీ, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ తుమ్మా విజయ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది నంది నాటకోత్సవాల్లో (రంగస్థల పురస్కారాలు) భాగంగా ఐదు విభాగాల్లో 73 అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సోమవారం విజయవాడ ఆర్టీసీ కాన్ఫరెన్స్ హాల్లో నంది నాటకోత్సవాల నిర్వహణపై నాటక రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల లఘు నాటిక, కళాశాల లేదా యూనివర్సిటీ లఘు నాటిక (ప్లేలెట్స్) అనే ఐదు విభాగాల్లో అవార్డులు అందజేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇచ్చామని, అనంతరం వారం రోజులు దరఖాస్తుల ఉపసంహరణకు కేటాయించామని తెలిపారు. అందరికీ అనుకూలంగా ఉండే ప్రాంతాన్ని నంది నాటకోత్సవాలకు వేదికగా ఎంపిక చేస్తామని తెలిపారు. ప్రదర్శితమైన నాటకాలకే అవకాశం రాష్ట్రవ్యాప్తంగా 2018 నుంచి 2022 వరకు వివిధ నాటక సమాజాల ద్వారా ప్రదర్శించిన నాటకాలను ఈ ఏడాది నంది నాటకోత్సవాల్లో ఎంట్రీలకు అవకాశం కల్పిస్తున్నట్టు విజయ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంట్రీలను న్యాయ నిర్ణేతల ద్వారా పరిశీలించి తుది పోటీలకు 10 పద్య నాటకాలు, 6 సాంఘిక నాటకాలు, 12 సాంఘిక నాటికలు, 5 బాలల నాటికలు, 5 కళాశాల లేదా యూనివర్సిటీ యువత నాటికలను ఎంపిక చేస్తామన్నారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి వీటి సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. బాలలు, యువతకు సంబంధించిన నాటకాలకు సంబంధించి ఈ ఏడాది కొత్తగా ప్రదర్శించిన వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ప్రదర్శన, ఎంపిక సమయంలో నాటకరంగ కళాకారులుండే ప్రాంతానికే వచ్చి తమ జ్యూరీ బృందం పరిశీలిస్తుందన్నారు. సరికొత్త కథాంశాలతో మన సంస్కృతి సంప్రదాయాలను, మానవతా విలువలను, ఉన్నతమైన జీవనాన్ని ప్రతిబింబించే అంశాలకు కళాకారులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చివరిసారిగా 2017లో నంది నాటకోత్సవాలు నిర్వహించామని, అనంతరం కరోనా విపత్కర పరిస్థితులతో నిర్వహించలేకపోయామన్నారు. కళాకారులకు ఆర్టీసి చార్జీల్లో రాయితీ ఇచ్చే విషయమై సంబంధిత విభాగంతో చర్చిస్తామన్నారు. రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జీఎం ఎంవీఎల్‌ఎన్ శేషసాయి, కళారాధన సమితి కార్యదర్శి రవికృష్ణ నంద్యాల, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడారు. సమావేశం అనంతరం ‘తెలుగు పద్యనాటక రంగం– సాంకేతికత–సమకాలీన అధ్యయనం’ అంశంపై ఆర్.నిరుపమ సునేత్రి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
నటకళారంగానికి రంగస్థలమే ఊపిరి
గొల్లప్రోలు : నటకళా రంగానికి రంగస్థలమే ఊపిరి పోస్తోందని ప్రముఖ టీవీ, రంగస్థల కళాకారుడు కోట శంకరరావు అన్నారు. తాటిపర్తిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి నాటక పోటీలకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. మంచి నాటకానికి ఎప్పుడూ ప్రజాదరణ ఉంటుందన్నారు. నందీ నాటకోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి నాటకరంగంలో పోటీతత్వం పెరిగిందని చెప్పారు. కళాకారుల పోషణకు ప్రభుత్వం మరింతగా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఇప్పటివరకూ 80 సినిమాలు, 64 టీవీ సీరియల్స్‌లో తాను నటించానని, 500 పైగా నాటకాలు ప్రదర్శించానని వివరించారు. మూడుసార్లు నంది అవార్డు అందుకున్నానని చెప్పారు. బెంగళూరుకు చెందిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ సంస్థ తనకు 2014లో డాక్టరేట్ ప్రదానం చేసిందన్నారు. నా పేరు మీనాక్షి, కెవ్వుకేక, గుండెజారి గల్లంతయ్యిందే.. సీరియల్స్‌లో నటిస్తున్నానని తెలిపారు. అపర్ణా నాటక కళాపరిషత్ నాటకరంగానికి చేస్తున్న సేవ అభినందనీయమని శంకరరావు అన్నారు. టీవీ రంగం అభివృద్ధితో కళాకారులకు ప్రోత్సాహం పిఠాపురం టౌన్ : టీవీ రంగం అభివృద్ధితో ప్రతిభ ఉన్న కళాకారులకు ప్రోత్సాహం లభిస్తోందని శంకరరావు అన్నారు. పిఠాపురంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నాటకరంగం మీద మక్కువతో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ తీసుకున్నానని తెలిపారు. తన పెద్దన్నయ్య కోట నరసింహరావు తనకు స్ఫూర్తి అని తెలిపారు. -
రేపటి నుంచి నంది నాటకోత్సవాలు
తిరుపతిలో చురుగ్గా ఏర్పాట్లు తిరుపతి కల్చరల్: నంది నాట కోత్సవాలకు తిరుపతి నగరం ముస్తాబైంది. నాటకోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పౌరాణిక పద్య, సాంఘిక నాటికలను ప్రదర్శించనున్నారు. 2006లో ప్రథమంగా ప్రభుత్వ నందినాటకోత్సవాలు తిరుపతి నగరంలో జరిగాయి. దశాబ్దం తర్వాత రెండో సారి ఆధ్యాత్మిక తిరుపతి నగరం నంది నాటకోత్సవాలకు వేదికగా నిలవబోతోంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఎఫ్డీసీ ఆధ్వర్యంలో చురుగ్గా సాగుతున్నాయి. ప్రారంభోత్సవ సభను దృష్టిలో ఉంచుకుని మహతి కళా వేదికను కలియుగ వైకుంఠుడు, సప్తగిరీశ్వరుడైన శ్రీవేంకటేశ్వరుని ప్రతిమతో సుందరంగా అలంక రించారు. మహతి ఆవరణలో నంది నాటకోత్సవాలను చాటే విధంగా కటౌట్లు, నంది ప్రతిమలను ఏర్పాటు చేస్తున్నారు. ఎఫ్డీసీ మేనేజర్ శేషసాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మార్గదర్శకమైన కళా రంగ పరిరక్షణతో పాటు ప్రోత్సహిస్తూ వాటిని భావితరాలకు అందించాలనే సంలక్పంతో ప్రభుత్వం నంది నాటకోత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ఏడాది సుమారు 190 పద్య, సాంఘిక నాటికలకు ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. వీటిని పరిశీలించి 44 నాటకాలను ప్రదర్శనకు ఎంపిక చేశామన్నారు. ఇందులో సుమారు 3 వేల మంది కళాకారులు పాల్గొంటారని తెలిపారు. నంది నాటకోత్సవాల పట్ల ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ స్పందిస్తున్నారని చెప్పారు. చివరిరోజైన 27న జరిగే బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై బహుమతుల అందజేస్తారని తెలిపారు.