రేపటి నుంచి నంది నాటకోత్సవాలు
తిరుపతిలో చురుగ్గా ఏర్పాట్లు
తిరుపతి కల్చరల్: నంది నాట కోత్సవాలకు తిరుపతి నగరం ముస్తాబైంది. నాటకోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పౌరాణిక పద్య, సాంఘిక నాటికలను ప్రదర్శించనున్నారు. 2006లో ప్రథమంగా ప్రభుత్వ నందినాటకోత్సవాలు తిరుపతి నగరంలో జరిగాయి. దశాబ్దం తర్వాత రెండో సారి ఆధ్యాత్మిక తిరుపతి నగరం నంది నాటకోత్సవాలకు వేదికగా నిలవబోతోంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో చురుగ్గా సాగుతున్నాయి. ప్రారంభోత్సవ సభను దృష్టిలో ఉంచుకుని మహతి కళా వేదికను కలియుగ వైకుంఠుడు, సప్తగిరీశ్వరుడైన శ్రీవేంకటేశ్వరుని ప్రతిమతో సుందరంగా అలంక రించారు. మహతి ఆవరణలో నంది నాటకోత్సవాలను చాటే విధంగా కటౌట్లు, నంది ప్రతిమలను ఏర్పాటు చేస్తున్నారు.
ఎఫ్‌డీసీ మేనేజర్ శేషసాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మార్గదర్శకమైన కళా రంగ పరిరక్షణతో పాటు ప్రోత్సహిస్తూ వాటిని భావితరాలకు అందించాలనే సంలక్పంతో ప్రభుత్వం నంది నాటకోత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ఏడాది సుమారు 190 పద్య, సాంఘిక నాటికలకు ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. వీటిని పరిశీలించి 44 నాటకాలను ప్రదర్శనకు ఎంపిక చేశామన్నారు. ఇందులో సుమారు 3 వేల మంది కళాకారులు పాల్గొంటారని తెలిపారు. నంది నాటకోత్సవాల పట్ల ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ సిద్ధార్‌థజైన్ స్పందిస్తున్నారని చెప్పారు. చివరిరోజైన 27న జరిగే బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై బహుమతుల అందజేస్తారని తెలిపారు.