పశువైద్యులకు ‘కాంట్రాక్టు’ గండం | TSPSC Notification Released Disappointing For Veterinary Students | Sakshi
Sakshi News home page

పశువైద్యులకు ‘కాంట్రాక్టు’ గండం

Published Mon, Dec 26 2022 12:34 AM | Last Updated on Mon, Dec 26 2022 8:13 AM

TSPSC Notification Released Disappointing For Veterinary Students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పశువైద్య విద్యను అభ్యసించిన ఉద్యోగార్థులకు టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్‌ నిరాశ మిగిల్చింది. రాష్ట్రంలోని రెండు మల్టీజోన్లవారీగా ఈ నెల 22న విడుదలైన నోటిఫికేషన్‌ ప్రకారం తమకు అన్యాయం జరుగుతోందని పశువైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద తీసుకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో 247 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (వీఏఎస్‌) పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కానీ తాజా నోటిఫికేషన్‌లో కేవలం 170 క్లాస్‌–ఏ వీఏఎస్‌ పోస్టులనే భర్తీ చేస్తున్నారని వాపోతున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 850 మంది వెటర్నరీ సైన్స్‌ గ్రాడ్యుయేట్స్‌ ఉన్నారని, 2016 తర్వాత విడుదలైన నోటిఫికేషన్‌లో తగినన్ని పోస్టులు లేకపోవడం, కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారి స్థానంలో పోస్టులు చూపకపోవడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా మల్టీజోన్‌–1లో 90 పోస్టులు, మల్టీజోన్‌–2లో 80 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా కాంట్రాక్టు ఉద్యోగులున్నారని చూపని 77 ఖాళీల్లో ఎక్కువగా మల్టీజోన్‌–2లోనే ఉన్నాయని పశువైద్య ఉద్యోగార్థులు చెబుతున్నారు.

మల్టీజోన్‌–2లో నోటిఫై చేసిన పోస్టులను పరిశీలిస్తే ఎక్కువ మంది అభ్యర్థులు ఉండే బీసీ వర్గాలకు కేవలం 3 సాధారణ ఖాళీలు చూపారని, బీసీ–బీ, సీ, డీ, ఈ గ్రూపుల అభ్యర్థులకు అసలు పోస్టులే లేకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ–బీ, సీ గ్రూపుల్లో మహిళా కోటాలో ఒక్కో పోస్టునే నోటిఫై చేయడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందంటున్నారు.

అందువల్ల టీఎస్‌పీఎస్సీ ఈ నోటిఫికేషన్‌ను వెంటనే సవరించి మొత్తం 247 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాజా నోటిఫికేషన్‌లో మొత్తం 170 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (వీఏఎస్‌) పోస్టులకుగాను 89 పోస్టులు బ్యాక్‌లాగ్‌ పోస్టులే ఉన్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీలకు చెందిన పోస్టులు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు వెటర్నరీ సైన్స్‌ చదివిన అర్హులైన వారందరికీ ఉద్యోగాలు వచ్చాయని, తెలంగాణ ఏర్పాటయ్యాక జిల్లాలు, మండలాలు పెరిగినప్పటికీ ఒక్క కొత్త పోస్టును కూడా సృష్టించకపోగా ఖాళీగా ఉన్న వాటిలో కోత పెట్టి నోటిఫికేషన్లు ఇవ్వడంతో అన్యాయం జరుగుతోందనేది పశువైద్య విద్యార్థుల అభిప్రాయం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement